close
మహాత్ముడి మాటలు.. బంగారు బాటలు: సతీశ్‌ వేమన


వాషింగ్టన్‌ డీసీ: అమెరికాలోని  వాషింగ్టన్‌ డీసీ  హెన్‌డెన్‌లో మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఆర్‌ఐ భాను ప్రకాశ్‌ మాగులూరి ఆధ్వర్యంలో రెండో రోజు జరిగిన ఈ కార్యక్రమానికి తానా మాజీ అధ్యక్షుడు సతీశ్‌ వేమన, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సతీశ్‌ వేమన మాట్లాడుతూ.. సత్యాగ్రహంతో బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని బాపూజీ గడగడలాడించారన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించిన బాపూజీ తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి ప్రపంచ చరిత్రలోనే అరుదైన స్థానం సంపాదించారని కొనియాడారు. బాపూజీ ఇచ్చిన  సత్యం, అహింస సందేశం భావితరాలకు బంగారు బాటగా నిలుస్తాయన్నారు. తన పోరాట పటిమతో మహాత్ముడిగా, జాతిపితగా ఎదిగారన్నారు. ప్రపంచ చరిత్రను గమనిస్తే రక్తపాత రహితంగా ఒక సుదీర్ఘ పోరాటంతో స్వాతంత్ర్యం సాధించిన ఘనత ఒక్క భారతదేశానికే దక్కుతుందన్నారు. ప్రపంచ శాంతి కోసం తమదైన శైలి వ్యూహాలతో ముందుకెళ్లిన ఎంతోమంది నేతలకు గాంధీజీనే స్ఫూర్తి అన్నారు. మహాత్ముడి జీవితాన్ని ఈ తరానికి తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సతీశ్‌ అన్నారు.  

విద్యార్థి దశ నుంచే అహింసను ఆయుధంగా మలుచుకొని గాంధీజీ కొనసాగించిన ప్రస్థానం అజరామరమని మన్నవ సుబ్బారావు కొనియాడారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించిన గాంధీ పోరాటం ప్రపంచ దేశాలకే మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ఏళ్ల తరబడి సాగిన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీజీది ఎప్పుడూ ముందడుగే తప్ప ఏనాడూ వెనకడుగు వేయలేదని చెప్పారు.

భారతమాత దాస్య శృంఖలాలు తెంచిన స్వాతంత్ర్య సమరయోధులు ఎంతో మంది ఉన్నా వారందరినీ గాంధీజీ ఏకతాటిపై నడిపించారని ప్రకాశ్‌ మాగులూరి అన్నారు. ప్రజల్లో చైతన్యం రగిలించి ఆ తర్వాతి తరాలకు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని అందించారని తెలిపారు. గాంధీ చూపిన పోరాట మార్గం ప్రపంచానికే ఆదర్శనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో చంద్ర మాలవతు, సుధీర్‌ కొమ్మి, హనుమంతరావు వెంపరాల, హరిబాబు చిన్నం, భాస్కరరావు, కామేశ్వరరావు, మోహనరావు, అంజిరెడ్డి, భగవాన్‌ రెడ్డి, సిద్ధార్థ బోయపాటి, భార్గవ్‌ తదితరులు పాల్గొన్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని