close
ఆకలి కేకలు..పాము కాట్లు..బందిపోట్లు

మెక్సికో నుంచి తిరిగి వచ్చిన భారతీయుల వ్యథ

దిల్లీ: అమెరికాకు వెళ్లి డాలర్లు సంపాదించాలన్న వారి కలలు సరిహద్దులోనే చెరిగిపోయాయి. వారి లక్ష్యానికి అక్రమ మార్గాన్ని ఎంచుకోవడమే ఇందుకు కారణం. యూఎస్‌లో ఉద్యోగం చేయడానికి అక్రమంగా వెళుతున్న 311 మంది భారతీయులను మెక్సికో వెనక్కి పంపిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ ఏజెంట్ల చేతిలో మోసపోయిన వీరిది ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ. డబ్బులకు ఆశపడిన ఏజెంట్ల చేతిలో భారీగా మోసపోయిన వీరి బాధలు అక్కడ వర్ణనాతీతం. మెక్సికోలో బయల్దేరిన వీరంతా శుక్రవారం దిల్లీకి చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మెక్సికోలో వీరు పడ్డ కష్టాల గురించి వివరించారు. 

వారిలో ఒకరైన పంజాబ్‌కు చెందిన మణ్‌దీప్‌ సింగ్‌ అనే  19 ఏళ్ల యువకుడు మాట్లాడుతూ.. ‘మా నాన్న పోలీసు శాఖలో పనిచేస్తారు. అమెరికాలో వీసా కోసం.. కారు, ఇళ్లు అన్నీ అమ్మేశాడు. అలా 19లక్షలు పోగు చేసి నన్ను ఓ ఏజెంటు చేతిలో పెట్టాడు. ఈ ఏడాది జూన్‌లో నన్ను ఈ వ్యక్తి మా ఇంటి నుంచి తీసుకెళ్లాడు. అమెరికాలోకి ప్రవేశించడానికి  ముందు పనామా చేరుకోవాలని చెప్పి అక్కడున్న నదుల్లో, కొండల్లో మమ్మల్ని 15 రోజుల పాటు నడిపించారు. ఆ సమయంలో మాకు తిండి లేదు. ఆకలితో ఏడ్చేవాళ్లం. పనామా అడవుల్లో నడిచేటప్పుడు విషపూరిత పాములు, బందిపోట్ల భయం ఎక్కువగా ఉండేది. దారిలో ఎన్నో శవాలు కూడా కనిపించేవి. వారిలో ఎక్కువ మంది ఆకలికి తాళలేక, పాము కాట్ల వల్ల చనిపోయిన వారేనని మా ఏజెంట్లు చెప్పేవారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ రెండు వారాల పాటు అక్కడే గడిపాం. నాతో పాటు చాలా మంది భారతీయులు మరో రెండు వారాల పాటు శరణార్థుల స్థావరాల్లో తలదాచుకున్నాం. మమల్ని అక్కడ జంతువుల్లాగా చూశారు. కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవు. తినడానికి తిండి లేదు. మూడు నెలలుగా నేను ఇదే టిషర్టుతో ఉన్నాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. సింగ్‌లాగే హరియాణకు చెందిన మనీష్‌ కుమార్‌, రణవీర్‌తో పాటు మరికొందరిదీ ఇదే పరిస్థితి.

వార్తలు / కథనాలు

మరిన్ని