close
నమోదు చేసుకుంది లక్ష..ఓటు వేసింది 25వేలు

దిల్లీ: పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లుగా నమోదు చేసుకున్న దాదాపు లక్ష మంది ప్రవాస భారతీయుల్లో 25,606 మంది మాత్రమే ఓటు వేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వీరిలో 24,458మంది పురుషులు ఉండగా.. 1,148మంది మహిళలు ఉన్నారు. ఈసీ గణాంకాల ప్రకారం విదేశాల్లో నివసిస్తూ.. పౌరసత్వాన్ని వదులుకోని మొత్తం 99,807 మంది ప్రవాస భారతీయులు వివిధ రాష్ట్రాల్లో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వారిలో 91,850 మంది పురుషులు కాగా..7,943 మంది మహిళలు, 14మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. దిల్లీలో ఓటు హక్కు పొందిన 336మందిలో ఒక్కరు కూడా ఓటు వేయలేదు. పశ్చిమ్‌ బెంగాల్‌, పుదుచ్చేరి ప్రవాస భారతీయుల్లోనూ ఏ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోలేదు. కేరళలో ఓటర్లుగా నమోదు చేసుకున్న 85,161 మంది ప్రవాస భారతీయుల్లో 25,091 మంది మాత్రమే  ఓటు వేశారు. 

ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన భారతీయులకు పరోక్ష పద్ధతిలో ఓటు హక్కు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును 16వ లోక్‌సభ కాలంలోనే ప్రవేశపెట్టారు. కానీ, రాజ్యసభ ఆమోదం పొందకపోవడంతో ఆ బిల్లుకు కాలం చెల్లింది. దీన్ని తిరిగి 17వ లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు న్యాయమంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం దాదాపు 3.10కోట్ల మంది ప్రవాస భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నారు.

 


వార్తలు / కథనాలు

మరిన్ని