close
ట్రంప్‌ హయాంలో భారీగా వీసా తిరస్కరణలు

భారత కంపెనీలపైనే ఎక్కువ ప్రభావం

వాషింగ్టన్‌: అమెరికాలో వలసలను తగ్గించి స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు ట్రంప్‌ సర్కార్‌ వీసా నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనల కారణంగా ఇటీవల హెచ్‌-1బీ వీసా తిరస్కరణలు భారీగా పెరిగాయట. 2015లో కేవలం 6శాతం తిరస్కరణలు మాత్రమే ఉంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 24శాతానికి పెరిగిందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది. 

యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ డేటా ఆధారంగా హెచ్‌-1బీ వీసాలపై నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ ఇటీవల ఓ అధ్యయనం చేపట్టింది. ట్రంప్‌ హయాంలో హెచ్‌-1బీ వీసాల తిరస్కరణలు భారీగా పెరిగినట్లు ఈ అధ్యయనంలో తేలింది. కాగా.. ఇందులో ఎక్కువగా భారత ఐటీ కంపెనీల నుంచి వచ్చినవేనట. దీన్ని బట్టి చూస్తే ట్రంప్‌ సర్కార్‌ భారత కంపెనీలనే ఎక్కువగా టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోందని ఈ సంస్థ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. 

2015లో టెక్‌ మహింద్రా చేసిన హెచ్‌-1బీ దరఖాస్తుల్లో 4శాతం తిరస్కరణకు గురికాగా.. 2019 నాటికి ఆ సంఖ్య 41శాతానికి పెరిగిందని అధ్యయనం పేర్కొంది. ఇక ఇదే కాలంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ చేసిన దరఖాస్తుల్లో తిరస్కరణలు 6శాతం నుంచి 34శాతానికి పెరిగాయి. విప్రో చేసిన వాటిల్లో తిరస్కరణలు 7శాతం నుంచి 53శాతానికి, ఇన్ఫోసిస్‌ చేసిన దరఖాస్తుల్లో తిరస్కరణలు 2శాతం నుంచి 45శాతానికి పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. 

2010-2015 మధ్య హెచ్‌-1బీ వీసా తిరస్కరణలు ఎప్పుడూ 8శాతానికి మించి దాటలేదని, కానీ.. ట్రంప్‌ సర్కార్‌లో మాత్రం ఇది మూడు రెట్లు పెరిగి 24శాతానికి చేరిందని నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ పేర్కొంది. ‘వలస విధానాల్లో తీసుకొచ్చిన కఠిన నిబంధనలు, పాలసీల్లో మార్పుల వల్ల ట్రంప్‌ ప్రభుత్వం ప్రాథమిక లక్ష్యం నెరవేరింది’ అని అభిప్రాయపడింది.


వార్తలు / కథనాలు

మరిన్ని