close
సూడాన్‌ మృతుల్లో 18 మంది భారతీయులు

ఖార్తూమ్‌: సూడాన్‌ రాజధాని ఖార్తూమ్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో 18 మంది భారతీయులు మృతిచెందినట్లు అక్కడ భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. రాజధానిలోని ఓ సిరామిక్‌ ఫ్యాక్టరీలో ఎల్‌పీజీ ట్యాంకర్‌ పేలడంతో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 23 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 130 మందికి పైగా గాయపడ్డారు. 

ఘటనపై అక్కడి భారత రాయబార కార్యాలయం స్పందించింది. ‘తాజా సమాచారం ప్రకారం.. మృతుల్లో 18 మంది భారతీయులు ఉన్నారు. ఘటన తర్వాత మరో 16 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో కొందరు చనిపోయి ఉండొచ్చు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించలేకపోతున్నాం’ అని ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ ఘటన తర్వాత ఫ్యాక్టరీలో పనిచేస్తున్న భారతీయుల డేటాను రాయబార కార్యాలయం విడుదల చేసింది. ప్రమాదం నుంచి 34 మంది సురక్షితంగా బయటపడగా.. మరో ఏడుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 18 మంది మృతిచెందగా.. మరో 16 మంది గల్లంతైనట్లు పేర్కొంది. ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదాలను నివారించేందుకు ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

వార్తలు / కథనాలు

మరిన్ని