close
సౌదీలో ఇక రెస్టారెంట్లలో ఒకే క్యూ..

రియాద్‌: సౌదీ అరేబియా ప్రభుత్వం సామాజిక కట్టుబాట్లలో మరో నిబంధనను సడలించింది. ఇప్పటి వరకు ఆ దేశ రెస్టారెంట్లలో రెండు ప్రవేశద్వారాలు, క్యూలు ఉండేవి. వీటిలో ఒక దానిని కుటుంబాలు, ఒంటరిగా వచ్చిన మహిళలు ఉపయోగించుకొనేవారు. మరో మార్గాన్ని పురుషులు వాడుకొనేవారు. ఈ నేపథ్యంలో రెండు మార్గాల నిబంధనను తొలగిస్తున్నట్లు మున్సిపల్‌ అండ్‌ రూరల్‌ అఫైర్స్‌ మినిస్ట్రీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాకపోతే ఇది ప్రవేశద్వారాలు, క్యూలైన్ల వరకే వర్తిస్తుందని భావిస్తున్నారు.
ఇప్పటి వరకు కూర్చుని తినే విషయంలో మాత్రం ఒంటరిగా వచ్చిన పురుషులు వేరే కుటుంబాలతోపాటు, ఒంటరి మహిళలతో కలిసి కూర్చొని తినకూడదు. ఈ నిబంధన మాత్రం కొనసాగుతుంది. సౌదీ అరేబియా ఇటీవల కాలంలో సాంఘికంగా ఉన్న  కఠిన నిబంధనలను మెల్లగా తొలగిస్తూ వస్తోంది. ముఖ్యంగా చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి మారాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటోంది. సౌదీ యువరాజుగా మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశాన్ని ఆధునీకరించడానికి చేపట్టిన తన సంస్కరణల్లో ఉదారవాద ఇస్లామ్‌ను ఒక కీలక భాగంగా చేసుకొన్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని