close
లండన్‌లో ఘనంగా క్రిస్‌మస్‌ వేడుకలు

లండన్‌: లండన్‌లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్‌ లండన్‌‌(తాల్‌) ఆధ్వర్యంలో శనివారం క్రిస్‌మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈస్తమ్‌లోని పిల్‌గ్రిమ్స్‌వే చర్చిలో నిర్వహించిన ఈ వేడుకలకు తెలుగు ప్రజలు భారీగా హాజరయ్యారు. ముందుగా జీసస్‌ శాంతి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా కొందరు చిన్నారులు ఏసుక్రీస్తు పుట్టుక ఆయన జీవితంలోని తదితర ఘట్టాలను నాటకం రూపంలో ప్రదర్శించగా అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డేవిస్‌, ప్రవీణ్‌ల బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీతం అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకుంది. పాస్టర్లు సలోమి, డోమినిక్‌లు జీసస్‌ క్రైస్ట్‌ జీవితంపై సందేశాన్ని ఇచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 

తాల్‌ ఛైర్మన్‌ సోమిశెట్టి శ్రీధర్‌ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం కార్యక్రమ నిర్వహణకు కృషి చేసిన రవి కుమార్‌ మోచర్ల, రత్నాకర్‌ దారతో పాటు, సిస్టర్లు జెమీమా దార, పద్మను ప్రశంసించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు సాంటా క్లాజ్‌లను ధరించి ఆకట్టుకున్నారు. అనంతరం చిన్నారులకు తాల్‌ తరపున బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు. తాల్‌ గత 11 సంవత్సరాల నుంచి లండన్‌లోని తెలుగు చర్చిల భాగస్వామ్యంతో ఘనంగా క్రిస్‌మస్‌ వేడుకలను నిర్వహిస్తోందని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాల్‌ కోశాధికారి నిర్మలా ధవల, సలహాదారులు బోయల్ల రామానాయుడు, పగడాల సత్యేంద్ర, ఇతర సభ్యులు పాల్గొన్నారు. 

వార్తలు / కథనాలు

మరిన్ని