close
ఘనంగా తానా మహాసభలు ప్రారంభం

ఈనాడు, అమరావతి: అమెరికా వాషింగ్టన్‌ డీసీలోని వాల్టర్‌ ఈ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తానా 22వ మహాసభలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సంఘం అధ్యక్షుడు సతీశ్‌ వేమన, నీలిమ దంపతులు జ్యోతి వెలిగించి సభలను ప్రారంభించారు. మొదటి రోజు కార్యక్రమానికి క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ ముఖ్యఅతిథిగా హాజరై ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ లీడర్‌షిప్‌’ అంశంపై ప్రసంగించారు. రెండో రోజు శుక్రవారం... ఇదే వేదికపై 150 మంది చిన్నారులు ఒక్కచోట చేరి 60 నిమిషాల పాటు ప్రదర్శించిన నృత్యరూపకం ఔరా అనిపించింది. తొలుత వాషింగ్టన్‌ వీధుల్లో మేళతాళాలతో తానా పరేడ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, ఎంపీలు సీఎం రమేశ్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. విశ్వంజీ, పరిపూర్ణానంద స్వామీజీలు తమ ప్రసంగాలతో ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లారు. తానా కాన్ఫరెన్స్‌ ఛైర్మన్‌ కొడాలి నరేన్‌, సమన్వయకర్త మూల్పూరి వెంకట్రావు, రవి గోగినేని, తానా కాబోయే అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి, తానా పూర్వ అధ్యక్షుడు జయరామ్‌ కోమటి, జంపాలచౌదరి, నాదెండ్ల గంగాధర్‌, తానా ఎగ్జిక్యూటివ్‌, ఫౌండేషన్‌ కమిటీ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

 

వార్తలు / కథనాలు

మరిన్ని