close
హ్యూస్టన్‌లో భారీ కార్యక్రమానికి సన్నాహాలు

ద టెక్సాస్‌ ఇండియా ఫోరం నిర్వహణ
భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ

హ్యూస్టన్‌: సెప్టెంబరులో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా హ్యూస్టన్‌లోని భారతీయ సంఘం భారీ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టింది. సెప్టెంబరు 22న జరిగే ఈ సభలో ప్రధాని భారతీయులనుద్దేశించి ప్రసంగించే సమయంలో దాదాపు 50 వేల మంది ప్రవాస భారతీయులు పాల్గొంటారని అంచనా. సుమారు 5 లక్షల మంది భారతీయులు నివసించే హ్యూస్టన్‌ ప్రాంతంలో ‘హౌదీ.. మోదీ!’ సభను ఏర్పాటు చేయనున్నారు. హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో ఈ సభ నిర్వహించడం పట్ల తాము ఎంతో ఉత్సుకతతో ఉన్నామని నిర్వాహకులైన ద టెక్సాస్‌ ఇండియా ఫోరం ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుjకు 25 వేల మంది భారతీయ అమెరికన్‌లు సహా వెయ్యి మంది వలంటీర్లు, 650 వరకూ ఇతర సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయని వివరించారు. తోడ్పాటునందించేందుకు మరింత మంది ఆసక్తి కనబరుస్తున్నారని ‘హౌడీ, మోదీ!’ కార్యక్రమ నిర్వహక కమిటీ కన్వీనర్‌ జుగల్‌ మలానీ అన్నారు. 
‘‘భారతీయ అమెరికన్‌ సోదరులను పెద్ద ఎత్తున ఒక చోట కలిపే కార్యక్రమం ఇది. ఈ సభ భారతీయతను ప్రతిబింబిస్తుంది. సభకు హాజరయ్యేవారికి ఇబ్బంది కలగకుండా హ్యూస్టన్‌ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి 300 బస్సులు ఏర్పాటు చేయనున్నాం.’’ అని మలానీ తెలిపారు. ప్రధాని ప్రసంగానికి ముందు భారతీయ అమెరికన్లతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. 
‘‘ఈ కార్యక్రమానికి హాజరు కావాలనుకొనే వారికి ప్రవేశం ఉచితం. కాకపోతే ముందస్తుగా తమ పేర్లు నమోదు చేయించుకొని, ఎంట్రీ పాసులు పొందాల్సి ఉంటుంది. ఎంట్రీ పాసులు పొందే ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారా ఉంటుంది. ఆగస్టు 12 నుంచి సాధారణ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తాం.’’ అని నిర్వహకులు తెలిపారు.
అమెరికాలో అతి పెద్ద వేదికగా భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించడం ఇది మూడోసారి అవుతుంది.

వార్తలు / కథనాలు

మరిన్ని