close
అమెరికాలో ఐదుగురు చిన్నారుల మృతి

వాషింగ్టన్‌: అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఎరీ నగరంలో విషాదం చోటు చేసుకుంది. హ్యారిస్‌ ఫ్యామిలీ పిల్లల సంరక్షణ(డే కేర్‌) కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. డే కేర్‌ యజమానితో సహా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అక్కడి సిబ్బంది సమయానికి స్పందించడంతో మరో ఏడుగురు పిల్లల్ని కాపాడగలిగారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున  ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయంలోనూ ఈ డే కేర్‌ పనిచేస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మృతులంతా 8నెలల నుంచి ఏడేళ్ల మధ్య వయసువారేనని తెలిపాయి. 

మృతి చెందినవారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు (ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు) ఉన్నారు. పిల్లల తల్లిదండ్రులు రాత్రిళ్లు ఉద్యోగ విధులకు వెళ్లడంతో తమ పిల్లలను డే కేర్‌కు తీసుకెళ్లినట్లు మృతుల నానమ్మ లాకెట్‌ స్లప్క్సీ వెల్లడించారు. ఏడాది కాలంగా వారిని రాత్రి సమయంలో ఇదే డే కేర్‌లో ఉంచుతున్నట్లు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున డే కేర్‌లోని మొదటి అంతస్తులో ఉన్న లివింగ్‌రూమ్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సెలవులతో సంబంధం లేకుండా 24X7 ఈ డే కేర్‌ నడుస్తుందని, ఇక్కడకు రావడానికి పిల్లలకు రవాణా సౌకర్యం కూడా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. అన్ని ప్రమాణాలు పాటిస్తున్నప్పటికీ ఆ దుర్ఘటన ఎలా జరిగిందో తెలియడం లేదని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై విచారణ జరిపేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. 

వార్తలు / కథనాలు

మరిన్ని