close
జన్మతః వచ్చే పౌరసత్వం రద్దు!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడి 
లక్షల కుటుంబాల్లో ఆందోళన

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి ఆ దేశానికి వలస వచ్చిన వారికి వ్యతిరేకంగా తన అక్కసును వెళ్లగక్కారు. అమెరికా గడ్డపై పుట్టిన ఇతర దేశాలకు చెందిన వారి సంతానంపై ఇప్పుడు ఆయన కన్ను పడింది. వారికి జన్మతః లభించే అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. అక్రమ వలసలను అరికట్టే పేరుతో అమెరికాకు వలస వచ్చిన వారికి ట్రంప్‌ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. పౌరసత్వంపై ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు కూడా లక్షల కుటుంబాలకు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ట్రంప్‌ వ్యాఖ్యలు కార్యరూపం దాలిస్తే అమెరికాలో పుట్టిన అనేక దేశాల చిన్నారులకు ఆ దేశ పౌరసత్వం లభించడం ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంది. ట్రంప్‌ బుధవారం శ్వేత సౌధం వెలుపల మాట్లాడుతూ ‘‘సరిహద్దులు దాటి వస్తున్నారు. బిడ్డలకు జన్మనిస్తున్నారు. ఆ పిల్లలకు ఇక్కడ పౌరసత్వం లభిస్తోంది. ఇది హాస్యాస్పదం. జన్మతః పౌరసత్వం రద్దు చేసే విషయంపై మేము తీవ్రంగా ఆలోచిస్తున్నాం’’ అని ప్రకటించారు.

రాజ్యాంగం కల్పించిన పౌరసత్వం 
అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ఆ గడ్డపై జన్మించిన వారందరికీ పౌరసత్వం కల్పిస్తుంది.  అమెరికాకు వలస వచ్చిన వారి సంతానానికీ ఇది వర్తిస్తుంది. ఈ సవరణను ఉపయోగించుకొనే వలసదారులు దొడ్డిదారిన తమ దేశ పౌరసత్వాన్ని పొందుతున్నారన్నది ట్రంప్‌ వాదన. జన్మతః లభించే పౌరసత్వాన్ని అమెరికా రద్దు చేస్తే ఆ ప్రభావం భారత్‌ నుంచి వెళ్లిన అనేక కుటుంబాలపై కూడా పడుతుంది. ప్రత్యేకించి 2010 తరవాత దాదాపు 8లక్షల మంది భారతీయులు అమెరికాకు వెళ్లారు. నిబంధనలు కఠినతరం చేయడంతో వీరిలో అత్యధికులకు గ్రీన్‌ కార్డులు లభించలేదు. అందువల్ల ట్రంప్‌ తాజా ప్రకటన ఈ కుటుంబాలకు ఆందోళన కలిగిస్తుంది.

అలాగే అక్రమంగా వలస వచ్చిన వారి పిల్లలను ఎంత కాలం నిర్బంధంలో ఉంచాలన్న ఆంక్షలను కూడా ఎత్తివేయనున్నట్లు అమెరికా అధికార యంత్రాంగం పేర్కొంటోంది. 1997లో జరిగిన ఫ్లోర్స్‌ సెటిల్‌మెంట్‌ అగ్రిమెంట్‌ మేరకు వలస పిల్లలను 20 రోజులకు మించి నిర్బంధంలో ఉంచరాదు. ట్రంప్‌ ప్రకటనను భారత సంతతికి చెందిన డెమోక్రటిక్‌ సెనేటర్‌ కమలా హారిస్‌ ఎద్దేవా చేశారు. ‘అమెరికా రాజ్యాంగాన్ని చదివే అంశాన్ని ట్రంప్‌ తీవ్రంగా పరిశీలించాలి’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

అఫ్గాన్‌లో తాలిబన్లపై పోరుకు భారత్‌ రావాలిట్రంప్‌
అఫ్గాన్‌కు 7 వేల మైళ్ల దూరంలో ఉంటున్న అమెరికా.. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతుండగా, పక్కనే ఉండే భారత్‌ పోరాడటం లేదు. పాకిస్థాన్‌ చాలా కొద్దిమేర కృషి చేస్తోంది. ఇది సమంజసం కాదు. ఈ పోరాటానికి భారత్‌, ఇరాన్‌, ఇరాక్‌, రష్యా, టర్కీ వంటి దేశాలు కలిసి రావాలి.

వార్తలు / కథనాలు

మరిన్ని