close
దర్శక ధీర.. ఒడిశా మీరా 

కెమెరా రోలింగ్‌..3..2..1..క్లాప్‌ 
..యాక్షన్‌ 
దర్శక ధీర.. ఒడిశా మీరా 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: చుట్టూ సమాజమనే సర్కస్‌.. పదేళ్ల పిల్లోడు (కృష్ణ) అందులో కార్మికుడు (కథానాయకుడు). ఏదో ధైర్యం, మరేదో మొండితనం. ప్రతి విషయంలో ఒకటే ధోరణి దేనికి భయపడడు . డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిని, ఓ మోసగాడి చేతిలో బలైపోతున్న వేశ్యని, తనలాగే దరిద్రాన్ని మోస్తున్న తోటి కార్మికురాలిని కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు. చివరకు ప్రయత్నమే మిగులుతుంది కానీ, కథ సుఖాంతమవదు. ఎందుకంటే అది జీవన పోరాటం. కట్‌ చేస్తే.. ‘సలాం బాంబే’ సినిమా. మీరా నాయర్‌ నిర్మాతగా, దర్శకురాలిగా తొలి ప్రయత్నం. ముంబై నగర మురికివాడల్లో తిరిగే అమాయకపు జీవితాల ఇతివృత్తమిది. ఉత్తమ విదేశీ చిత్రంగా రికార్డులు నెలకొల్పి మీరా జీవితంలో మొట్టమొదటి మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం. ఈ సినిమా మొదలుకొని ‘క్వీన్‌ ఆఫ్‌ కాట్వే’ వరకు జరిగిన సినీ ప్రస్థానంలో మీరా గెలుపుల ప్రయాణం తిరుగులేనిది.

మీరాకు గెలుపులు పహారా 
ఔను నిజమే.. ఆమె ప్రతి ప్రయత్నం ఓ అద్భుతమే. విజయపు ఒక్కో మలుపు ఆమె ఔన్నత్యానికి నిదర్శనమే. ముఖం మనసుకు అద్ధం అంటారు. అలాంటిది ఆమె మనసునే అద్ధం ముందు చూపెడితే అదే సినిమా..! మీరా సినిమా..!! నీవు రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండు అన్నాడో కవి. కానీ, ఈమె ఖండాంతరవాసం చేస్తోంది. విభిన్న సంస్కృతుల వారితో సహవాసం కొనసాగిస్తోంది. అయినా మూలాలు మరిచిపోదు. శైలిని మార్చుకోదు. పరాయి దేశంలోనూ స్వదేశ సంప్రదాయాలూ, ఆచారాలు, సమాజ పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా సినిమా రూపంలో చూపిస్తుంది. కళకి ఎల్లలూ, హద్దులూ లేవంటూ.. ఆశయమే అవధిగా పోరాడి ఎన్నో ప్రయత్నాల్లో సఫలీకృతమై సాగిపోతోంది.

మెచ్చుకోలు 
మీరాలోని దృక్కోణం చాలా సున్నితం. అలాగే చెప్పాలనుకున్న విషయాన్ని ఏ మాత్రం సందిగ్ధం లేకుండా వివరంగా చెప్పగలరామె. ఈ విషయంలో ప్రముఖ నిర్మాతలైన వార్నర్‌ బ్రదర్స్‌ కదిలి ఆమె ఇంటికి వచ్చి హ్యారీపోటర్‌ సినిమా దర్శకత్వం చేయమని అడిగారంటే, ఆవిడ సామర్థ్యం ఏంటో తెలుస్తుంది. ఆమె తీసిన సినిమాల్లో డాక్యుమెంటరీలు, ఫీచర్‌ ఫిల్మ్స్‌లు మనసుని కట్టిపడేసేలా, కూర్చున్న చోటు నుంచి కదలకుండా అతుక్కుపోయేలా ఉంటాయ్‌. శృంగార రస విషయాల చిత్రం ‘కామసూత్ర టేల్‌ ఆఫ్‌ లవ్‌’ రూపకర్త కూడా ఈమే. మీరా దర్శకత్వంలో వచ్చిన సలాంబాంబే, మిస్సిస్సీపీ మసాలా, మాన్‌సూన్‌ వెడ్డింగ్‌, ది నామ్సాకే సినిమాల్లో 20కి పైగా నేషనల్‌ అవార్డులు వచ్చాయ్‌. సినీ రంగంలో ఈమె ప్రతిభకు మెచ్చి 2012లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. జులై 2013లో జరిగిన హైఫా ఇంటర్నేషనల్‌ గౌరవ అతిథిగా హాజరయ్యారు. అంతేగాక జ్యూరీ అవార్డులు, గోల్డెన్‌ లయన్‌, గోల్డెన్‌ గ్లోబ్‌ మరెన్నో పురస్కారాలు ఆమె ఖాతాలో వేసుకున్నారు.

ఒంటరి యుద్ధం 
నటిగా వచ్చి దర్శకురాలిగా, నిర్మాతగా ఎదిగిన మీరా తొలినాళ్లలో సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఆడపిల్లకు ఎక్కువగా ప్రాధాన్యమివ్వని దేశం నుంచి వెళ్లి పరాయి దేశంలో, కొత్త సంస్కృతుల మధ్య సినీరంగంలో తనదంటూ ముద్ర వేశారు. మనిషిలోని సున్నిత భావాలను కెమెరా కంటితో చూడగలరు.

అంతరంగం 
మీరానాయర్‌ ఒడిశాలోని భువనేశ్వర్‌లో 1957 అక్టోబరు15న జన్మించారు. తండ్రి ఐఏఎస్‌ ఆఫీసర్‌ అమృత్‌ నాయర్‌, తల్లి ప్రవీణ్‌ నాయర్‌ ఓ సామాజిక కార్యకర్త. తండ్రి ఉద్యోగ రీత్యా బదిలీ కావడంతో దిల్లీలో స్థిరపడ్డారు. మీరాకు పదమూడేళ్ల వయస్సులో సిమ్లాలోని ‘లోరెటో కాన్వెంట్‌ తారా’ హాల్లో సాహిత్యంపై ఆసక్తి ఏర్పడింది. 1977 హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఫొటోగ్రఫీ కోర్సు నేర్చుకుంటున్నప్పుడు సహవిద్యార్థి మిచ్‌ ఎప్‌స్టీన్‌తో స్నేహం ఏర్పడి కొంత కాలానికి వివాహమైంది. పదేళ్ల తర్వాత అతనితో సంబంధాలు సజావుగా లేకపోవడంతో విడాకులు తీసుకుంది. 1988లో మిస్సిసీపీ మసాలా సినిమా ప్రయత్నంలో భాగంగా ‘ది మిత్‌ ఆఫ్‌ పాపులేషన్‌ కంట్రోల్‌’ పుస్తక రచయితతో ఏర్పడిన పరిచయం బలపడి మహమూద్‌ మమ్దానీని వివాహమాడింది. ఇతను కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌. వీరి సంతానం జోహ్రాన్‌.

మైక్రోసాఫ్ట్‌ సారథి... సత్య నాదెళ్ల.. 

మైక్రోసాఫ్ట్‌ సారథి... సత్య నాదెళ్ల.. 

పోటీ ప్రపంచం... పరిగెడుతున్న సమాజం... ఒకప్పటి పేరు క్రమంగా తగ్గుతోంది... గెలుపు దూరమవుతోంది... ఇదీ మైక్రోసాఫ్ట్‌ స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీను నడిపించి గెలిపించే నాయకుడు ఎవరనేది ప్రశ్న. వందల రెజ్యూమెలు.. వేల పరిశీలనలను దాటి ఓ తెలుగు వ్యక్తి ఆ పదవిని అందుకున్నాడు. అతనే సత్య నాదెళ్ల. ఎటువంటి గట్టి సవాలునైనా ఎదుర్కోగలడనే నమ్మకంతో సంస్థ అతనిని 2014 ఫిబ్రవరి 4న (సీఈఓ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి పదవిలో కూర్చోబెట్టింది.

నిత్య శోధన.. 
‘కొత్తదనం లేకపోతే గతంలో ఉండిపోతాం. ఎప్పుడూ ఏదో ఓ విషయం నేర్చుకుంటేనే ఉండాలి’ అని యువతలో స్ఫూర్తి నింపే సత్య నాదెళ్ల 1992లో ఒక ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా మైక్రోసాఫ్ట్‌లో కెరీర్‌ ప్రారంభించారు. 1999లో మైక్రోసాఫ్ట్‌ బీసెంట్రల్‌కు ఉపాధ్యక్షుడిగా, రెండేళ్లలోనే మైక్రోసాఫ్ట్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌ కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, 2007లో ఆన్‌లైన్‌ సేవల విభాగానికి సీనియర్‌ ఉపాధ్యక్షునిగా పదవులు చేపట్టి మంచి నాయకుడిగా ఎదిగారు. నేర్చుకోవాలనే తపనతో ఇప్పటికీ ఏదో ఒక ఆన్‌లైన్‌ కోర్సులో జాయిన్‌ అవుతూనే ఉంటారు.

మైక్రోసాఫ్ట్‌ సారథి... సత్య నాదెళ్ల.. 

ఎవరైనా ఒకటే... 
ఒక పని ఆరంభించాక, దానిని అత్యుత్తమంగాపూర్తి చేసేందుకు సత్య నూరుశాతం మనసు పెడతారు. 360 డిగ్రీల కోణంలో ఆలోచిస్తారు. ఆ సమయంలో అతని ఏకాగ్రత అపూర్వం. ఓపనిలో నిమగ్నమైనప్పుడు ఎంతటి స్థాయి వ్యక్తి వచ్చి కదిలించినా దాన్నుంచి క్షణకాలం కూడా పక్కకి జరగరు. ఓసారి సంస్థ సీఈఓ ఫోన్‌ చేసి ‘నీతో మాట్లాడాలి, త్వరగా రాగలరా’ అంటే ‘ఇప్పుడు ఖాళీగా లేను’ అని సూటిగా బదులిచ్చారట సత్య. ఎందుకంత సాహసమంటే... తనకు అప్పగించిన బాధ్యతను ఇంకెవరూ చేయనంత బాగా చేయాలన్న తపనే కారణం. అతని ఈ తీరు సంస్థలో అందరికీ తెలుసు కాబట్టే ఉన్నత పదవులు అతనికి రెడ్‌ కార్పెట్‌ పరిచాయి. కంపెనీ సీఈఓ పదవి అతన్ని వరించింది.

మైక్రోసాఫ్ట్‌ సారథి... సత్య నాదెళ్ల.. 

స్నేహమంటే.. 
సత్య... స్నేహానికి చాలా విలువిస్తారు. ఇప్పటికీ హైదరాబాద్‌ వచ్చినప్పుడు పాత మిత్రులను కలిసి పేరుపేరునా పలకరిస్తారు. తన సహోద్యోగులతోనూ అదే సంబంధాన్ని కొనసాగిస్తారు. కాబట్టే మైక్రోసాఫ్ట్‌ సంస్థలో తనంటే గిట్టని వారంటూ ఎవరూ ఉండరు.

చరిత్రకు వారసుడు.. 
మైక్రోసాఫ్ట్‌ మొదటి సీఈఓ బిల్‌గేట్స్‌, రెండో సీఈఓ స్టీవ్‌బామర్‌. వీరి వారసుడిగా కంపెనీని చూసుకోగల వ్యక్తి ఎవరా అని యాజమాన్యం వెతికే సమయంలో సత్య పేరొచ్చిందంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఇట్టే అర్థమవుతుంది. ఈయన తండ్రి యుగంధర్‌ ఐఏఎస్‌ అధికారి. జాతీయ స్థాయిలో పేరు సంపాదిస్తే, సత్య అంతర్జాతీయంగా ఎదిగి కుటుంబ ఖ్యాతిని పెంచారు. సామాన్యుడే

సత్యనాదెళ్ల ఉద్యోగంలో చేరినప్పుడు సామాన్యుడే.. ఇప్పుడు ముఖ్య కార్య నిర్వహణాధికారి పదవిలోనూ సామాన్యుడే!! ఇప్పటికీ నిరాడంబరంగా, సాదాసీదాగానే ఉంటారు. ఎంత అంటే ఫుట్‌ బాల్‌ప్లేయర్‌ గ్లీవ్‌సనన్‌ ఇచ్చిన ఐస్‌బకెట్‌ ఛాలెంజ్‌ని అంగీకరించి తనలోని క్రీడాస్ఫూర్తిని చాటాడు.

మైక్రోసాఫ్ట్‌ సారథి... సత్య నాదెళ్ల.. 

నమ్మిన నిజం 
ఏదైనా పనిని చేయాలనుకుంటే దానిని ప్రేమించాలి. అప్పుడే ఆ పనిలో విజయాన్ని చేరుకోగలం ఆంటారు నాదెళ్ల. ఐటీ రంగం అంటేనే డైనమిక్‌గా ఉంటుంది. హోదా, జీతంతో పాటూ చకచకా సంస్థలు మారాలనుకునే వారెక్కువ. అటువంటి రంగంలోనే ఉన్న సత్య నాదెళ్లమాత్రం నెల జీతాన్నే ప్రాధాన్యంగా తీసుకుని మైక్రోసాఫ్ట్‌లో కొనసాగారు. పనినీ, బాధ్యతనూ ప్రేమిస్తూ... సంస్థ నియమాలూ, అధికార గుణగణాలను బేరీజు వేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. ఇక్కడ సత్య నిబద్ధత, ముందుచూపుని అభినందించాల్సిందే! అదేసమయంలో ఇన్వెస్టర్లకు భయపడి సీఈవోలను మార్చే సంస్కృతి బిల్‌గేట్స్‌కు లేకపోవడాన్ని ప్రస్తావించుకోవాలి. ప్రతిభకే కానీ ఓ జాతికీ, ప్రాంతానికీ విలువివ్వని తీరుకి వహ్వా అనాలి.

మొత్తంగా.. 
బేగంపేటలో మొదలైంది సత్య ప్రస్థానం. ఈయన అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌కు చెందిన బేగంపేట ప్రాంతంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో 1967 ఆగస్టు 19న జన్మించారు. తండ్రి బుక్కాపురం యుగంధర్‌ నాదెళ్ల ఐఏఎస్‌ అధికారి తల్లి ప్రభావతి. కర్ణాటకలోని మంగుళూరు విశ్వవిద్యాలయం నుంచి బీ.టెక్‌ పూర్తిచేశారు. ఎమ్మెస్‌ చేయడానికి అమెరికా వెళ్లి.. ప్రస్తుతం అక్కడి పౌరసత్వం పొందారు. సన్‌ మైక్రోసిస్టమ్స్‌కు చెందిన ఒరాకిల్‌ సంస్థలో ఉద్యోగిగా ఉన్నప్పుడు 1992లో మైక్రోసాఫ్ట్‌లో ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా ఉద్యోగం లో చేరారు. సరిగ్గా అదే సంవత్సరం లో తన తండ్రికి ఐఏఎస్‌లో బ్యాచ్‌మేట్‌ అయిన వేణుగోపాల్‌ కూతురు, అంతేగాక చిన్నప్పటి సహాధ్యాయైన అనుపమ ప్రియదర్శినిని పెళ్లాడారు. వీరికి ముగ్గురు పిల్లలు దివ్య, తారా, జైన్‌.

మైక్రోసాఫ్ట్‌ సారథి... సత్య నాదెళ్ల.. 

ఆసక్తులు: కవిత్వం, క్రికెట్‌, హాకీ, ఫిట్‌నెస్‌గా ఉండటం, పరిగెత్తడం 
అభిమానించే వ్యక్తులు: బిల్‌గేట్స్‌, సీహాక్స్‌ (ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు)స్ఫూర్తి: క్రికెట్‌ 
బలం: కుటుంబం 
చూడగానే కనిపించేది: చిరునవ్వు 
ఖాళీ సమయాల్లో: చదువుతూ..

బ్రిటిష్‌-ఇండియన్‌ ఆచార్యునికి నైట్‌హుడ్‌ 


బ్రిటిష్‌-ఇండియన్‌ ఆచార్యునికి నైట్‌హుడ్‌ 

లండన్‌: భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ ఆచార్యునికి అరుదైన గౌరవం దక్కింది. కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో వైద్య రసాయనశాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డీఎన్‌ఏ నిపుణులు శంకర్‌ బాలసుబ్రమణియన్‌ బ్రిటన్‌ అత్యున్నత పురస్కారమైన ‘నైట్‌హుడ్‌’ను అందుకున్నారు. ఆయనతో పాటు ఒలింపిక్‌ స్టార్స్‌ ఆండీ ముర్రే, ఎంవో ఫరాహ్‌లను కూడా క్వీన్‌ ఎలిజబెత్‌ 2 ఈ గౌరవంతో సత్కరించారు.

బాలసుబ్రమణియన్‌ కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో మెడిసినల్‌ కెమిస్ట్రీ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. డీఎన్‌ఏపై ఆయన చేసిన పరిశోధనలకు గానూ ఈ గౌరవానికి ఎంపికయ్యారు.

టెన్నిస్‌ స్టార్‌ ఆండీముర్రే రెండోసారి వింబుల్డన్‌, ఒలింపిక్‌ టైటిల్స్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. క్రీడల పరంగా దేశానికి ఆయన అందించిన విజయాలను గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపికచేశారు. 2012లో తొలిసారి ఒలింపిక్‌ టైటిల్‌ను దక్కించుకున్నప్పుడు ఆఫీసర్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ అంపైర్‌ సత్కారం అందుకున్నారు.

ఎంవో ఫరాహ్‌ ఈ ఏడాది రియో ఒలింపిక్స్‌లో 5000, 10వేల మీటర్ల పరుగు పందెంలో టైటిళ్లను సాధించారు.

ప్రవాసులకు అండాదండా... ప్రమీల 

ప్రవాసులకు అండాదండా... ప్రమీల 

అమెరికా చట్టసభలకు ‘వాషింగ్టన్‌ సెవెన్త్‌ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌’ ప్రతినిధిగా ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు ప్రమీలా జయపాల్‌. తమిళనాడులోని చెన్నైలో జన్మించిన ఆమె చదువుకోవడానికి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మహిళల హక్కులు, జాతి వివక్ష, ఆర్థిక సమానత్వం కోసం విస్తృతంగా ప్రజా పోరాటాలు జరిపి భిన్న ప్రజలు నివసించే వాషింగ్టన్‌ చట్టసభకు ఎన్నికైన ప్రమీల గురించి ప్రత్యేక కథనం.

ప్రవాసుల హక్కుల కోసం... 
ప్రమీల చెన్నైలో జన్మించినా ఇండొనేషియా, సింగపూర్‌లో పెరిగింది. 1982లో కళాశాల విద్యకోసం అమెరికాలో అడుగుపెట్టింది. ఆర్థిక శాస్త్రం చదివేందుకు వెళ్లిన ఆమె ఇంగ్లిష్‌ మేజర్‌ ఎంచుకొన్నారు. నార్త్‌ వెస్ట్రన్‌ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేసి ఫైనాన్షియల్‌ అనలిస్టుగా పనిచేశారు.

వివాదాస్పద, ధైర్యంతో కూడిన అంశాలనే ప్రమీల ఎంచుకొంటారు. 2001లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రవాసులపైన దాడులు ఎక్కువవడంతో వాళ్ల హక్కుల కోసం పోరాడేందుకు ‘హేట్‌ ఫ్రీ జోన్‌’ సంస్థ ప్రారంభించారు. ఇమిగ్రేషన్‌ సంస్కరణలు, అరబ్‌, మధ్యప్రాచ్య, దక్షిణాసియా దేశాల పౌరుల రక్షణ కోసం నడుం బిగించారు. మహిళల హక్కుల కోసం పోరాడడంలో ఆమె ఎప్పుడూ ప్రథమ పంక్తిలో నిలిచేవారు. దేశవ్యాప్తంగా ఉన్న 4,000 మంది సోమాలీలను దేశం నుంచి వెళ్లగొట్టకుండా అడ్డుకొన్నారు. ఆ తర్వాత ‘హేట్‌ ఫ్రీ జోన్‌’ సంస్థ 2008లో ‘వన్‌ అమెరికా’గా రూపాంతరం చెందింది. 2013లో శ్వేతసౌధం ఆమెకు ‘ఛాంపియన్‌ ఆఫ్‌ ఛేంజ్‌’ పురస్కారం అందజేశారు.

ప్రతిచోటా ప్రజల మద్దతు... 
ప్రవాసుల కోసం జరిపిన పోరాటాలు ప్రమీలను రాజకీయాల్లో చేరేలా ప్రేరేపించాయి. సియాటెల్‌లో 15 డాలర్ల కనీస వేతనం కోసం ఏర్పాటు చేసిన మేయర్‌ సలహాదారుల కమిటీలో ఆమె సభ్యురాలు. ఆ తర్వాత మేయర్‌ పాలసీ చీఫ్‌ సెర్చ్‌ కమిటీకి వైస్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. రాష్ట్ర సెనేటర్‌ ఆడమ్‌ క్లినె 2014లో పదవీవిరమణ ప్రకటించడంతో ఆ పదవి చేపట్టేందుకు రేసులో నిలిచారు. సియాటెల్‌ మేయర్‌ ఎడ్‌ ముర్రే ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆరుగురు అభ్యర్థుల మధ్య జరిగిన పోటీలో ప్రమీల 51% ఓట్లతో గెలుపొందింది. సెనేట్‌కు ఎన్నికైన తర్వాత ఆమె మహిళలు, ఇతర వర్గాల కోసం 2015 జులైలో ప్రి అప్రెంటిస్‌ షిప్‌ ప్రోగ్రామ్‌ చట్టం తెచ్చారు. ఆమె సేవలకు 98% రేటింగ్‌ లభించింది.

ఇలా చట్టసభకు... 
కాంగ్రెస్‌ సభ్యుడు జిమ్‌ మెక్‌డెర్మాట్‌ విరమణ ప్రకటించడంతో జనవరి 2016లో వాషింగ్టన్‌ సెవెన్త్‌ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రతినిధి రేసులో నిలిచారు. డెమొక్రాట్‌ అధ్యక్ష అభ్యర్థి కోసం పోటీపడ్డ బెర్నీ శాండర్స్‌ ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ‘ది స్ట్రేంజర్‌’ పత్రిక సైతం ఆమెను బలపరిచింది. ఆగస్టు 2, 2016న జరిగిన టాప్‌-2 ప్రైమరీలో తొలి స్థానంలో నిలిచారు. నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో 56% ఓట్లతో చట్టసభకు ఎన్నికయ్యారు. మహిళగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె హిల్లరీకి మద్దతిస్తారని భావించినా విధానపరమైన వ్యతిరేకతతో బెర్నీకి మద్దతిచ్చారు.

ప్రమీల జయపాల్‌కి రెండువేల సంవత్సరంలో అమెరికా పౌర సభ్యత్వం లభించింది. ఆమె ‘పిలిగ్రిమేజ్‌: వన్‌ వుమన్‌ రిటర్న్‌ టు ఎ ఛేంజింగ్‌ ఇండియా’ పుస్తకం రాశారు. కొలంబియా సిటీ సమీపంలోని సియాటెల్‌లో భర్త స్టీవ్‌, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. తన మాతృభాష మలయాళం కన్నా హిందీని చక్కగా మాట్లాడగలరు. తండ్రికి ఇష్టం లేకున్నా తాను ఎంచుకొన్న ఇంగ్లిష్‌ మేజర్‌... ప్రజలతో అనుసంధానం కావడానికి ఉపయోగపడిందంటారామె.

యుద్ధం తెలిసిన వ్యక్తికే రక్షణ శాఖ బాధ్యతలు.. 

పంజాబ్‌ నుంచి కెనడా వరకు సజ్జన్‌ ప్రస్థానం 
యుద్ధం తెలిసిన వ్యక్తికే రక్షణ శాఖ బాధ్యతలు.. 

ఆ పదవి చేపట్టేంత వరకూ ఆయన ఎవరో ఆ దేశ ప్రజలకు పెద్దగా తెలియదు. అతి కీలకమైన మంత్రి పదవుల్లో ఒకటైన దేశ రక్షణ శాఖ మంత్రి పదవి ఆయన్ను వరించింది. దీంతో పలువురు ఆయన గురించి నెట్‌లో శోధించడం, ఆయన సైనికుడిగా ఉన్నప్పుడు సాధించిన విజయాల గురించి తెలుసుకోవడం ప్రారంభించారు.ఆయనే భారత సంతతికి చెందిన హర్‌జిత్‌ సింగ్‌ సజ్జన్‌. ప్రస్తుతం కెనడా రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సైన్యంలో పనిచేసి ఎన్నో విజయాలను సాధించిన ఆయన ఆ దేశ రక్షణ రంగానికి మార్గనిర్దేశం చేసే అత్యున్నత స్థాయికెదిగారు. యుద్ధతంత్రాలు తెలిసిన వ్యక్తే మంత్రిగా ఉండటం ఆ దేశ రక్షణ శాఖను మరింత బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదు.

సంప్రదాయాన్ని పక్కనబెట్టి.. 
కెనడాకు కొత్తగా ఎన్నికైన ప్రధాని జస్టిన్‌ ట్రుడేయు అప్పటివరకు ఉన్న సంప్రదాయాలను పక్కనబెట్టారు. అత్యంత కీలకమైన రక్షణ శాఖను సిక్కు కమ్యూనిటీకి చెందిన సజ్జన్‌కు అప్పగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. లక్షకు పైగా సైనిక శక్తి కలిగిన కెనడా రక్షణ శాఖ బాధ్యతలను మాజీ సైనికుడైన సజ్జన్‌కు అప్పగించారు. అప్పటివరకూ పెద్దగా రాజకీయ అనుభవం లేని సజ్జన్‌కు గురుతర బాధ్యతలు అప్పగించడమంటే.. ప్రధానికి సజ్జన్‌పై ఎంత నమ్మకముందో అర్థమవుతోంది.

కెనడా దేశ జనాభాలో 1 శాతం సిక్కుల జనాభా ఉంటుంది. సిక్కు కమ్యూనిటీ నుంచి సజ్జన్‌ కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టడాన్ని కెనడియన్లు కూడా స్వాగతించారు.

పంజాబ్‌ నుంచి.. 
హర్‌జిత్‌ సింగ్‌ సజ్జన్‌ సెప్టెంబర్‌ 6, 1970లో భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రం హోషియార్‌పుర్‌ జిల్లాలోని కుగ్రామం బాంబేలీలో జన్మించారు. తండ్రి కుందన్‌ సజ్జన్‌ పోలీసుగా పనిచేశారు. సజ్జన్‌ ఐదేళ్ల వయసులోనే తల్లి, సోదరితో కలిసి బతుకుదెరువు కోసం కెనడాకు వలసవచ్చారు. అప్పటికే ఆయన తండ్రి బ్రిటిష్‌ కొలంబియాలో రంపపు మిల్లులో పనిచేసేందుకు వెళ్లారు.

సజ్జన్‌ దక్షిణ వాంకోవర్‌లో పెరిగారు. 1996లో వైద్యురాలు అయిన కుల్జిక్‌ కౌర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం.

1989లో సజ్జన్‌ ది బ్రిటిష్‌ కొలంబియా రెజిమెంట్‌లో సైనికుడిగా చేరి లెఫ్టినెంట్‌ కల్నల్‌ స్థాయికి చేరారు. ఉత్తర అట్లాంటిక్‌ ఆర్గనైజేషన్‌ శాంతి పరిరక్షక ఒడంబడికలో భాగంగా 1997లో బోస్నియా, హెర్జెగోవినాలో పనిచేశారు. రెండేళ్ల అనంతరం వాంకోవర్‌ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరారు. పోలీసు డిటెక్టివ్‌గా పనిచేశారు. 2006లో ‘ఆపరేషన్‌ మెడుసా’లో భాగంగా సజ్జన్‌ను ఆఫ్గనిస్థాన్‌కు పంపించారు. పోలీసు విధులకు సెలవు పెట్టి ఆయన అక్కడికి వెళ్లారు. పంజాబీతో పాటూ ఉర్దూ కూడా మాట్లాడే సజ్జన్‌కు అక్కడ పనిచేయడం, అక్కడి వారి భాషను అర్థం చేసుకోవడం, వారితో కలిసిపోవడం సులువైంది. 2009, 2010లో కూడా సజ్జన్‌ ఆఫ్గాన్‌లో పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడు అక్కడి యువత తాలిబన్‌ ఉగ్రవాద సంస్థకు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. అలాంటివారిని గుర్తించి ఆఫ్గాన్‌ చేపట్టే ప్రభుత్వ పనుల్లో నియమించేవారు.

కాందహార్‌లో తాలిబన్‌ ప్రాబల్యాన్ని నీరుగార్చినందుకు సజ్జన్‌కు 2012లో మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్‌ లభించింది. దీనితోపాటూ తన సేవలతో కెనడియన్‌ పీస్‌ కీపింగ్‌ సర్వీస్‌ మెడల్‌, ఆర్డర్‌ ఆఫ్‌ మిలటరీ మెడల్‌ అవార్డు సాధించుకున్నారు. 2011లో కెనడా ఆర్మీ రిజర్వ్‌ రెజిమెంట్‌కు కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ బాధ్యతలు నిర్వర్తించిన తొలి సిక్కు వ్యక్తి ఆయనే.

సొంత గ్యాస్‌ మాస్క్‌.. 
పెద్ద గడ్డాలు, తలపాగాతో సైన్యంలో పనిచేసే సిక్కులకు కొన్ని ఇబ్బందులు ఉండేవి. మిలటరీ గ్యాస్‌ మాస్క్‌లు ధరించడానికి వీరి గడ్డాలు అడ్డుపడేవి. దీనికి విరుగుడుగా సజ్జన్‌ సిక్కుల కోసం గడ్డంపై ధరించే సరికొత్త గ్యాస్‌ మాస్క్‌ను రూపొందించారు. దీనికి 1996లో పేటెంట్‌ కూడా తీసుకున్నారు.

రాజకీయ జీవితం 
2015 ఫెడరల్‌ ఎన్నికల్లో దక్షిణ వాంకోవర్‌ ప్రాంతం నుంచి కెనడా లిబరల్‌ పార్టీ తరఫున పోటీ చేయాలని జస్టిన్‌ ట్రుడేయూ కోరారు. అప్పటి వరకూ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేని సజ్జన్‌ ఆయన కోరిక మేరకు పోటీ చేసి ఆ దేశ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన జస్టిన్‌ ట్రుడేయూ సజ్జన్‌ను తన కేబినెట్‌లోకి తీసుకొని కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలను అప్పగించారు. నవంబర్‌ 4, 2015లో రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

‘క్వీన్‌ ఆఫ్‌ ద ఎలక్ట్రిక్‌...’ పద్మశ్రీవారియర్‌ 

‘క్వీన్‌ ఆఫ్‌ ద ఎలక్ట్రిక్‌...’ పద్మశ్రీవారియర్‌ 


ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘క్వీన్‌ ఆఫ్‌ ద ఎలక్ట్రిక్‌ కార్‌ బిజ్‌’ అని ప్రముఖ ఫార్చ్యూన్‌‌ మేగజైన్‌ అభివర్ణించిన ప్రవాసాంధ్రురాలు పద్మశ్రీ వారియర్‌. అమెరికాలోని ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ కంపెనీ నెక్ట్స్‌ఈవీకి సీఈవోగా ప్రస్తుతం పనిచేస్తున్న ఆమె 2014లో ఫోర్బ్స్‌ వెలువరించిన ప్రపచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 71వ స్థానంలో నిలిచారు. గతంలో ఆమె మోటరోలా, సిస్‌కో సిస్టమ్స్‌ వంటి ప్రముఖ కంపెనీల్లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలుగువారు గర్వించేలా సాగుతున్న ఆమె ప్రయాణాన్ని ఓ సారి పరికిస్తే..

విజయవాడ నుంచి న్యూయార్క్‌ దాకా.. 
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన పద్మశ్రీ వారియర్‌ పాఠశాల చదువంతా చిల్డ్రన్స్‌ మాంటెస్సరీ పాఠశాల్లోనే సాగింది. అనంతరం మారిస్‌ స్టెల్లా కళాశాలలో కాలేజీ విద్యనభ్యసించారు. ప్రఖ్యాత దిల్లీ ఐఐటీ నుంచి 1982లో కెమికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రులయ్యారు. న్యూయార్క్‌లోని కార్నెల్‌ విశ్వవిద్యాలయం నుంచి 1984లో కెమికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ సాధించారు.

మోటరోలా నుంచి ప్రారంభమై.. 
మోటరోలాలో ఉద్యోగిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగింది. ఒక్కో మెట్టు ఎదుగుతూ తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ క్రమంలో కార్పోరేట్‌ ఉపాధ్యక్షురాలిగా, ఛీప్‌ టెక్నాలజీ అధికారిణిగా సేవలందించారు. 2003లోమోటరోలా సీటీవోగా నియమితులైన ఆమె 2005లో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు. ఆమె సీటీవోగా పనిచేసిన కాలంలోనే మోటరోలాకు అరుదైన గుర్తింపు లభించింది. అమెరికా అధ్యక్షుని చేతుల మీదుగా 2004లో నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ టెక్నాలజీని అందుకున్నారు. కంపెనీ చరిత్రలో ఈ గౌరవం పొందడం అదే ప్రథమం. అనంతరం ఆమె ప్రతిపాదించిన ‘సీమ్‌లెస్‌ మొబిలిటీ’ విధానాన్ని కంపెనీ చేపట్టలేదు. 2007 డిసెంబర్‌లో ఆమె మోటరోలాను వదిలి సిస్‌కో సిస్టమ్స్‌లో సీటీవోగా చేరారు. 2015లో అక్కడ్నుంచి నెక్ట్స్‌ఈ సంస్థలో సీఈవో పనిచేస్తున్నారు.

‘యంగ్‌ అండ్‌ పవర్‌ఫుల్‌’.. 
2005లో ఫార్చ్యూన్‌ పత్రిక ఆమెను రైజింగ్‌ స్టార్‌గా అభివర్ణించింది. హయ్యస్ట్‌ పెయిడ్‌, యంగ్‌ అండ్‌ పవర్‌ఫుల్‌ జాబితాలో ఆమెకు 10వ స్థానం లభించింది. ద ఎకనమిక్‌ టైమ్స్‌ సైతం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రభావశీల భారతీయుల జాబితాలో ఆమెకు 11వ స్థానమిచ్చింది.

పలు కీలక సంస్థల్లోనూ ఆమె బోర్డు మెంబర్‌గా ఆమె బాధ్యతలు నిర్వహించారు. 2005-2008 మధ్య కాలంలో కోరింగ్‌ ఇన్‌కార్పోరేటడ్‌ సంస్థలో బోర్డు డైరెక్టర్‌గా ఉన్నారు. 2013 నుంచి గ్యాప్‌ సంస్థలోనూ, 2015 నుంచి ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్‌లోనూ బోర్డు ఆఫ్‌ డెరెక్టర్స్‌లో ఒకరిగా ఉన్నారు.

ఆమె పలు సందర్భాల్లో చెప్పిన స్ఫూర్తివాక్యాలు.. 
‘తెరిచి ఉన్న ఓ ద్వారం మీకు ఎదురైనప్పుడు మరో ఆలోచన చేయొద్దు.. నేరుగా లోపలికి నడిచివెళ్లండి’

‘నేర్చుకునే సామర్థ్యమే నాయకుడిలో ఉండాల్సిన ప్రధాన లక్షణం’

‘ చాలా మందికి నా పేరు చివరి పదం గుర్తుండిపోతుంది. ఎందుకంటే అది విభిన్నంగా ఉంటుంది కాబట్టి.. సమావేశాల్లో నన్ను చాలా మంది గుర్తుపడతారు ఎందుకంటే నేను మహిళను కాబట్టి మిగిలిన వారికి భిన్నంగా నా వస్త్రధారణ ఉంటుంది. ఇలాంటి అంశాలే మీకు అవకాశాల్ని ఇస్తాయి. అంద‌రి దృష్టి మీ మీద ప‌డేలా చేస్తాయి. కాబట్టి వీటిని మీ సామర్ధ్యాన్ని, తెలివితేటలను ప్రదర్శించేందుకు అనుకూలంగా ఉపయోగించుకోండి’

వ్యాపారంలో.. వ్యవహారాల్లో ‘రాజా’ధిరాజ! 

వ్యాపారంలో.. వ్యవహారాల్లో ‘రాజా’ధిరాజ! 


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రాష్ట్రాల నుంచి హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నికైన భారత సంతతికి చెందిన తొలి హిందూ వ్యక్తి రాజాకృష్ణమూర్తి. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఇల్లినాయిస్‌ రాష్ట్రం నుంచి అమెరికా కాంగ్రెస్‌కు వెళ్తున్న తొలి తమిళ వ్యక్తి కూడా ఆయనే. తొలిసారి ఎన్నికల్లో ఓటమితో కుంగిపోకుండా.. రెండో ప్రయత్నంలోనే విజయాన్ని సొంతం చేసుకుని అమెరికాలో భారతదేశం ఖ్యాతిని మరోసారి చాటారు రాజాకృష్ణమూర్తి.

తమిళనాడులో 1973 జులై 19న జన్మించిన కృష్ణమూర్తి.. వూహ తెలీని వయసులో అమెరికాలో అడుగుపెట్టారు. ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా తీసుకున్నారు. హార్వర్డ్‌ లా స్కూల్‌ నుంచి జ్యూరిస్‌ డాక్టరేట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ‘శివనందన్‌లాబొరేటరీ’, ‘ఏపీ సోలార్‌’ సంస్థలను నిర్వహిస్తున్నారు. ఆయన భార్య ప్రియ డాక్టర్‌గా సేవలందిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు విజయ్‌, విక్రమ్‌. కుమార్తె సోనియా.

ప్రచారంలో దిట్ట 
ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రజలను ఆకట్టుకోవాలి. అద్భుతమైన ప్రసంగాలతో ‘మన’ అన్న భావన కలిగించాలి. అన్ని వేళలా అండగా ఉంటాం అన్న భరోసా ఇవ్వాలి. మాటల్లోనే కాదు... చేతల్లోనూ వాటన్నిటినీ ఆచరించాలి. ఈ విషయంలో రాజా కృష్ణమూర్తికి మంచి మార్కులు పడతాయి. ఎన్నికల వ్యూహాల అమలులోనూ ఆయనెంతో దిట్ట. రెండువేల సంవత్సరంలో అమెరికా చట్టసభలకు ఒబామా పోటీ చేసినప్పుడు కృష్ణమూర్తి ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2004లోనూ ఆయనకు సహాయకుడిగా వ్యవహరించారు. ఎన్నికల ప్రసంగాలు రాసిచ్చారు. సెనేట్‌కు ఎన్నికయ్యే సమయంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఒబామాకు తెలియజేశారు.

ఒకవైపు తన వ్యాపార బాధ్యతలను మోస్తూనే.. మరోవైపు ఎన్నికలపైనా దృష్టి పెట్టారు. నాలుగేళ్ల క్రితం ఇల్లినాయిస్‌ 8వ కాంగ్రెస్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి పీటర్‌ డికియానీపై గెలుపొందారు. అంతకుముందు మార్చిలో నిర్వహించిన ప్రాథమిక ఎన్నికల్లో 57 శాతం ఓట్లు సాధించారు. కొంతకాలం ఇల్లినాయిస్‌లో అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌గా సేవలందించారు. దీంతో పాటు ఇల్లినాయిస్‌ హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలో ఆడిట్‌ కమిటీకి నేతృత్వం వహించారు. రెండేళ్లపాటు ఇల్లినాయిస్‌ డిప్యూటీ ట్రెజరర్‌గానూ సేవలందించారు.

ఒబామా ప్రచారం.. 
కృష్ణమూర్తి గెలుపు కోరుతూ అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా ప్రచారం నిర్వహించారు. తన ఇండో-అమెరికన్‌ మిత్రుడు కృష్ణమూర్తికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. దీనికి సంబంధించి 30 సెకన్ల నిడివి గల ప్రచార వీడియోను రూపొందించారు.

సేవా గుణం 
అటు వ్యాపారంలోనూ, రాజకీయాల్లోనూ రాణిస్తున్న కృష్ణమూర్తి పలువురికి సాయపడుతూ తన ఉదారతను చాటుకుంటున్నారు. సోలార్‌ టెక్నాలజీలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ‘ఇన్‌స్పైర్‌’ అనే స్వచ్ఛంద సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నారు. జికా వైరస్‌ నుంచి గర్భిణులను, పిల్లలను కాపాడేందుకకు, వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం ‘క్లీన్‌ యాంటీ జికా ఫండింగ్‌ బిల్లు’ కోసం పోరాడారు.

సాంకేతిక స్వాప్నికుడు.. సుందర్‌పిచాయ్‌ 


సాంకేతిక స్వాప్నికుడు.. సుందర్‌పిచాయ్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతికతను కొత్త పుంతలు తొక్కిస్తూ అంతర్జాలాన్ని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకునేలా చేస్తోంది ప్రముఖ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌. ఈ ప్రతిష్టాత్మక సంస్థకు ఈ సీఈవోగా సుందర్‌ పిచాయ్‌ అనే ఓ భారతీయుడు ఎంపిక కావడం భారతీయుల్లో ఆనందాన్ని నింపింది. ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోగా రికార్డు సృష్టించిన ఆయన ఖరగ్‌పూర్‌ ఐఐటీ నుంచి ఇంజనీరింగ్‌ డిగ్రీ పట్టాపొందారు. అనంతరం ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్‌ చేశారు. 2004లో గూగుల్‌లో చేరిన ఆయన ఆ సంస్థ సీఈవోగా నియమితులయ్యారు. ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచే ఆయన ప్రస్థానంలో విశేషాలెన్నో...

సుందర్‌రాజన్‌ నుంచి.. సుందర్‌ పిచాయ్‌ దాకా 
చెన్నైకి చెందిన తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1972లో సుందర్‌ జన్మించారు. సుందర్‌ తండ్రి రఘనాథ పిచాయ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌, తల్లి స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేవారు. మధ్యతరగతి కుటుంబం కావడంతో చాలా కాలం పాటు ఇంట్లో టీవీ గానీ కారు గానీ ఉండేది కాదు. ఎటైనా వెళ్లాలంటే స్కూటర్‌పై వెళ్లేవారు. వనవాణి మెట్రిక్యులేషన్‌ స్కూల్లో పదోతరగతి దాకా చదివారు. చైన్నైలోని జవహర్‌ విద్యాలయంలో ఇంటర్మీడియట్‌ అభ్యసించారు. అనంతరం ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బీటెక్‌ చేశారు. 1993లో అమెరికా వెళ్లిన సుందర్‌ స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చేశారు. వార్టన్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ కూడా చేశారు. 2004లో గూగుల్‌ ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌గా చేరారు. గూగుల్‌లో క్రోమ్‌ బౌజర్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను రూపొందించిన బృందానికి సారథ్యం వహించారు. ఇక సెర్చింజన్‌లో టూల్‌బార్‌ రూపకల్పనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. గూగుల్‌లో చేరడానికి ముందు మెకిన్సే, అప్లైడ్‌ మెటీరియల్స్‌ వంటి సంస్థల్లో పనిచేశారు. గూగుల్‌ చేస్తుండగా మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో అవకాశం వచ్చినప్పటికీ వెళ్లలేదు. వాస్తవానికి సుందర్‌ అసలు పేరు పి సుందర్‌రాజన్‌ కాగా అమెరికాకు వెళ్లిన తర్వాత పేరును కుదించి సుందర్‌ పిచాయ్‌గా మార్చుకున్నారు.ప్రస్తుతం గూగుల్‌లో సుందర్‌ ఏడాదికి రూ.310 కోట్ల జీతభత్యాలు పొందుతున్నారు.

కొంచెం సిగ్గరి.. 
స్వతహగా సుందర్‌ సిగ్గరి. గూగుల్‌లో సహ ఉద్యోగులు ఆయన్ను అందరికీ ఆత్మీయుడిగా అభివర్ణిస్తారు. చురుకైన విద్యార్థి అయినప్పటికీ అనవర పాండిత్య ప్రదర్శన చేసేవాడు కాదని ఆయన ఐఐటీ గురువులు చెబుతారు.

క్రికెటర్‌ కావాలనుకుని.. 
క్రికెట్‌ అంటే ప్రాణం పెట్టే సగటు భారతీయ యువకుల్లాగానే సుందర్‌కి కూడా ఒకప్పుడు క్రికెట్‌ అంటే పిచ్చి. తాను కూడా క్రికెటర్‌ కావాలనుకున్నా అని.. సచిన్‌ గవాస్కర్‌లను ఇష్టపడేవాడినని ఓ సందర్భంలో చెప్పారు. ‘ నా దృష్టిలో టెస్టు క్రికెట్‌ అత్యుత్తమం. 1986లో చైన్నైలో ఒక టెస్ట్‌మ్యాచ్‌ చూశాను. సమయం దొరికితే టెస్ట్‌లతో పాటు వన్డేలు కూడా చూస్తాను. కానీ టీ20లు ఎందుకో అంతగా నచ్చవు’ అని చెప్పారు. ఇక ఫుట్‌బాల్‌లో తాను బార్సిలోనా జట్టుకు అభిమానినని చెప్తుంటాడు. లియొనెల్‌ మెస్సీ ఆట చూసేందుకు ఇష్టపడతానని ఆ సందర్భంలో చెప్పారు.

సుందర్‌ భార్య పేరు అంజలి. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. పాఠశాల రోజుల నుంచి సుందర్‌, అంజలికి పరిచయం ఉండేది. అది కొన్నాళ్లకు ప్రేమ వివాహానికి దారి తీసింది.

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.