close
చిరంజీవి కెరీర్‌లో ‘సైరా’ మైలురాయి!

ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి సినీ కెరీర్‌లో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం మైలురాయిలా నిలిచింది. ఇది అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిరు చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా అక్కడ 2.5 మిలియన్‌ డాలర్లకుపైగా రాబట్టినట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. అంతేకాదు ఈ చిత్రం 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్లకుపైగా వసూలు చేసినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమా మంచి వసూళ్లను రాబడుతోందని చెప్పారు.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ‘సైరా’ సినిమాను తెరకెక్కించారు. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మించారు. నయనతార, తమన్నా, అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శకులతోపాటు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంది. ‘సైరా’ పాత్రకు చిరు జీవం పోశారని మెచ్చుకున్నారు.


బాక్సాఫీసు వద్ద ‘సైరా’ పరుగులు!

ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

హైదరాబాద్‌: ‘సైరా నరసింహారెడ్డి’  బాక్సాఫీసు వద్ద పరుగులు తీస్తోంది. ఈ సినిమా కేవలం రెండు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.85 కోట్లు రాబట్టినట్లు తెలిపారు. దక్షిణాదిలో తొలి రోజున అత్యధిక వసూళ్లు రాబట్టిన ఐదో సినిమాగా ఇది నిలిచిందని తెలిపారు. ‘బాహుబలి 2’ రూ.214 కోట్లు, ‘సాహో’ రూ.127 కోట్లు, ‘2.ఓ’ రూ.94 కోట్లు, ‘కబాలి’ రూ.88 కోట్లు వసూలు చేశాయని పేర్కొన్నారు. ఇప్పుడు రూ.85 కోట్లతో ‘సైరా’ వాటి తర్వాత వరుసలో చేరిందన్నారు. రెండో రోజు రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిందని తెలిపారు.

‘సైరా’ తొలిరోజున ఆంధ్రప్రదేశ్‌లో రూ.47 కోట్లు, కర్ణాటకలో రూ.8.75 కోట్లు, తమిళనాడులో రూ. కోటి సాధించినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. మరోపక్క సినిమా అమెరికా బాక్సాఫీసు వద్ద మిలియన్‌ డాలర్లకు పైగా రాబట్టినట్లు సమాచారం. అక్టోబరు 2న ‘సైరా’తోపాటు హిందీ సినిమా ‘వార్’, హాలీవుడ్‌ సినిమా ‘జోకర్‌’ విడుదలయ్యాయి. దీంతో బాక్సాఫీసు వద్ద వీటికి పోటీ తప్పలేదు. అయినా సరే ‘సైరా’ మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ‘ధృవ’ తర్వాత సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఇది. మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ రోల్‌ పోషించారు. రామ్‌ చరణ్‌ నిర్మాత.


విదేశాల్లో ‘సైరా’ వసూళ్ల హవా!

హైదరాబాద్‌: ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విదేశాల్లో సత్తా చాటింది. ఈ చిత్రం అమెరికా, ఆస్ట్రేలియాలో బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. సినిమా అమెరికా ప్రీమియర్‌లో (కేవలం మంగళవారం) 308 లొకేషన్లలో 8,57,765 డాలర్లు (రూ.6.16 కోట్ల) రాబట్టినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఆస్ట్రేలియా (అక్టోబరు 2 ఉదయం 11ల వరకు) 39 లొకేషన్లలో A$ 189,237 సాధించినట్లు తెలిపారు. బుధవారంతో అమెరికాలో సినిమా వన్‌ మిలియన్‌ డాలర్ల మార్కును దాటుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అభిమాన హీరో సినిమా విడుదలతో అమెరికా థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీసిన ‘సైరా’ విమర్శకులతోపాటు ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. కథానాయకుడు చిరంజీవి, నిర్మాత రామ్‌ చరణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. చరణ్‌ తనపై నమ్మకం ఉంచారని అన్నారు.

హ్యూస్టన్‌లో ‘సైరా’ సందడి

హ్యూస్టన్‌: తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో గల హ్యూస్టన్‌లో మెగా అభిమానులు ‘సైరా’ ప్రమోషన్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెగా అభిమానులు రవి వర్రె, బద్రుద్దీన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఉయ్యాలవాడ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి ఆంగ్లేయులపై పోరాడిన ఉయ్యాలవాడ బుద్ధారెడ్డి మునిమనవడు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరంలో తమ కుటుంబం పాలుపంచుకున్న విషయాలను తెలిపారు. తమ తాత ముత్తాతల నుండి ఉయ్యలవాడ నరసింహారెడ్డి విన్న అనేక విశేషాలను వివరించారు. ఆ మహా యోధుడి వీరమరణం తర్వాత ఆయన తలను కొన్ని రోజుల పాటు కోట గుమ్మానికి వేలాడదీశారని.. శ్రీనివాసులు తెలిపారు. ఉయ్యాలవాడ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘సైరా’ చిత్రాన్ని తెరకెక్కించినందుకు ఆయన రామ్‌చరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం రవి మాట్లాడుతూ.. మెగా కుటుంబంతో తమకున్న అనుబంధంతోపాటు మరిన్ని విశేషాలను తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చిన్నప్పటి నుంచి వింటున్న విషయాలను బద్రుద్ధీన్‌ అందరికి తెలియచేశారు. అంతేకాకుండా సాగర్‌ లగిశెట్టి (అట్లాంటా), కృష్ణారెడ్డి బయన, గోపాల్‌ గూడపాటి, అన్నపూర్ణ, వెంకట్‌ శ్రీలం, సురేష్‌ పగడాల ‘సైరా’ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతంమయ్యేందుకు సహకరించిన ప్రతిఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. సురేష్ సత్తి, శ్రీనివాస్ కిమిడి, మనోజ్ తోట, నాగు కూనసాని, చైతన్య కూచిపూడి, జై కుమార్ తన్నీరు, మల్లేశ్వర్ ఏనుగు, కళ్యాణ్ ఉప్పు, సుబ్బారావు, గంగాధర్ మోసూరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు సాయం చేశారు.

‘సైరా’.. ఒకటి కొంటే మరొకటి ఉచితం!

అమెరికా ప్రీమియర్‌ ఆఫర్‌

హైదరాబాద్‌: స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబరు 1న ఈ సినిమా అమెరికాలో విడుదల కాబోతోంది. అక్కడి థియేటర్‌లో సినిమా భారీ సంఖ్యలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం థియేటర్ల జాబితాను షేర్‌ చేసింది. అంతేకాదు ఈ సినిమా ప్రీమియర్‌కు కొన్ని ఆఫర్లు కూడా ప్రకటించారు. ఒక్క టికెట్‌ కొంటే మరో టికెట్‌ ఉచితమని పేర్కొన్నారు. త్వరలోనే బుకింగ్‌ ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని అమెరికాలో స్నోఫ్లేక్‌ సినిమా, వీకెండ్‌ సినిమా యూఎస్‌, బిగ్‌ థింక్‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి.

మరోపక్క సోమవారం ‘సైరా’ సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చింది. సినిమాను చూసిన బోర్డు సభ్యులు ప్రశంసించినట్లు సమాచారం. సింగిల్‌ కట్‌ కూడా లేకుండా సినిమాను ఓకే చేయడం విశేషం. సురేందర్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మించారు. అమితాబ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. నయనతార, తమన్నా ఇందులో కథానాయికల పాత్రలు పోషించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

చైనా థియేటర్లలో రజనీ సందడి..!

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘2.0’ చిత్రం నేడు (సెప్టెంబర్‌ 06) చైనాలో విడుదలవుతోంది. ఈ విషయాన్ని సినీ నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్‌ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రం 2018లో భారత్‌లో విడుదలైంది. అయితే అదే సమయంలో చైనాలోని 48000 థియేటర్లలో విడుదల చేయాలనుకున్నప్పటికీ.. ‘ది లయన్‌ కింగ్‌’ విడుదల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. నేడు చైనా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డులను సృష్టిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది. 
రజనీ కాంత్ ఈ చిత్రంలో చిట్టి, వశీకరణ్ అనే పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ బాణీలు అందించారు. బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. నటి అమీ జాక్సన్ ఇందులో కథానాయిక. 2010లో వచ్చిన రోబో చిత్రానికిది కొనసాగింపుగా వచ్చింది.

తొలిరోజు సెంచరీ కొట్టిన ‘సాహో’!

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల జోరు

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లపై విడుదలైన తెలుగు సినిమా ‘సాహో’ తొలిరోజున బాక్సాఫీసు వద్ద సెంచరీ కొట్టింది. ఈ చిత్రం ఓపెనింగ్‌ రోజున రూ.100 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో రూ.42 కోట్లు సాధించిందని పేర్కొన్నారు. అమెరికాలో సినిమా మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో అడుగుపెట్టిందని తెలిపారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సాహో’ మంచి టాక్‌ అందుకుంది. ‘బాహుబలి’ హిట్‌ తర్వాత ప్రభాస్‌ నటించిన సినిమా ఇది. సుజీత్‌ దర్శకుడు. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది.

బాలీవుడ్‌లోనూ సత్తాచాటారు
ఈ సినిమా బాలీవుడ్‌లోనూ సత్తా చాటింది. అక్కడ శుక్రవారం రూ.24.40 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ క్రమంలో 2019 బాలీవుడ్‌లో దేశవ్యాప్తంగా తొలిరోజున అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితాలో ‘సాహో’ మూడో స్థానంలో చేరింది. రూ.42.30 కోట్లతో సల్మాన్‌ ఖాన్‌ ‘భారత్’ సినిమా ఈ వరుసలో ప్రథమ స్థానంలో ఉంది. ఆ జాబితాను ఓ సారి చూద్దాం..
1. భారత్’ రూ.42.30 కోట్లు
2. మిషన్‌ మంగళ్‌: రూ.29.16 కోట్లు
3. సాహో(హిందీ) : రూ.24.40 కోట్లు
4. కళంక్‌: రూ.21.60 కోట్లు
5. కేసరి: రూ.21.06 కోట్లు వసూలు చేశాయి.

 


అమెరికా కలెక్షన్స్‌.. నం.6లో ‘సాహో’

హైదరాబాద్‌: ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సాహో’ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా అమెరికా ప్రీమియర్‌లో 9,15,224 డాలర్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు తెలిపారు. అయితే పంపిణీదారులు చిత్రాన్ని భారీ మొత్తానికి కొనుగోలు చేశారని, ఈ వసూళ్లతో వారు షాక్‌ అయ్యారని పేర్కొన్నారు. అమెరికాలో ప్రీమియర్‌ వసూళ్ల పరంగా ‘సాహో’ ఆరో స్థానంలో నిలిచినట్లు తెలిపారు.

ప్రీమియర్స్‌లో ‘బాహుబలి 2’ 2.4 మిలియన్‌ డాలర్లు, ‘అజ్ఞాతవాసి’ 1.52 మిలియన్‌ డాలర్లు, ‘బాహుబలి’ 1.39 మిలియన్‌ డాలర్లు, ‘ఖైదీ నంబర్‌ 150’ 1.29 మిలియన్‌ డాలర్లు, ‘స్పైడర్‌’ 1.00 మిలియన్‌ డాలర్లు రాబట్టగా.. ‘సాహో’ 915 వేల డాలర్లతో ఆరో స్థానంలో నిలిచింది. దీని తర్వాత ‘భరత్‌ అనే నేను’ 850 వేల డాలర్లు, ‘అరవింద సమేత’ 789 వేల డాలర్లు, ‘రంగస్థలం’ 725 వేల డాలర్లు, ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ 616 వేల డాలర్లు రాబట్టి తర్వాతి ఐదు స్థానాల్లో ఉన్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ నటించిన సినిమా ఇది. సుజీత్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

చైనాలో భారత్‌ సినిమా రికార్డు!

సెప్టెంబరు 6న విడుదల కాబోతోన్న ‘2.ఓ’ 

బీజింగ్‌‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన ‘2.ఓ’ సినిమా చైనాలో రికార్డు సృష్టించింది. ఆ దేశంలో అత్యధిక స్క్రీన్లపై విడుదల కాబోతున్న విదేశీ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను సెప్టెంబరు 6న అక్కడ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 47 వేల కంటే ఎక్కువ త్రీడీ స్క్రీన్లపై చిత్రం విడుదల కాబోతున్నట్లు పేర్కొంది. ఈ స్థాయిలో చైనాలో విడుదల కాబోతున్న తొలి విదేశీ చిత్రం ‘2.ఓ’ అని తెలిపింది.

లైకా ప్రొడక్షన్స్‌.. హెచ్‌వై మీడియా సంస్థతో కలిసి సినిమాను చైనాలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తోంది. నిజానికి జులై 12న ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేయాలని నిర్మాత భావించారు. కానీ ఇదే సమయంలో హాలీవుడ్‌ సినిమా ‘ది లయన్‌ కింగ్‌’ విడుదల కాబోతుండటంతో ‘2.ఓ’ను వాయిదా వేశారట. 47 వేల కంటే ఎక్కువ స్క్రీన్లపై ప్రదర్శించబోతున్న ఈ ఇండియన్‌ భారీ బడ్జెట్‌ చిత్రం చైనాలో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించే అవకాశం ఉన్నట్లు విమర్శకులు అంచనా వేస్తున్నారు. ‘రోబో’కు సీక్వెల్‌గా తీసిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అమీ జాక్సన్‌ కథానాయికగా కనిపించారు. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా గత ఏడాది నవంబరులో విడుదలై రూ.800 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సమాచారం.

మిలియన్‌ డాలర్ల ‘బేబీ’ సమంత

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక సమంత సోలోగా అమెరికాలో మిలియన్‌ డాలర్లు రాబట్టేశారు. ఆమె టైటిల్‌ రోల్‌ పోషించిన సినిమా ‘ఓ బేబీ’. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 5న విడుదలై విజయం అందుకుంది. విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంది. బాక్సాఫీసు వద్ద కూడా విశేషమైన వసూళ్లు రాబడుతోంది. కాగా ఈ చిత్రం అమెరికాలో వన్‌ మిలియన్‌ డాలర్ల మార్కును దాటినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ వెల్లడించింది. సమంత సినిమా మిలియన్‌ డాలర్ల మార్కు చేరుకోవడం ఇది తొలిసారి కాదు. కానీ హీరో లేకుండా సోలోగా నటించిన ఈ చిత్రం అమెరికాలో ఈ ఘనత సాధించడం విశేషమని విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.35 కోట్లకుపైగా రాబట్టింది. ఇందులో నాగశౌర్య, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందించారు.

చిన్నారుల కోసం ప్రత్యేక స్క్రీనింగ్‌

సమంత స్థాపించిన ప్రత్యూష ఫౌండేషన్‌కు చెందిన చిన్నారుల కోసం శనివారం ‘ఓ బేబీ’ సినిమా ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశారు. పిల్లలు సినిమా చూసి, ఎంజాయ్‌ చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

|
యూఎస్‌లో ‘ఓ బేబీ’ రికార్డు కలెక్షన్లు

హైదరాబాద్‌: సమంత కీలక పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లక్ష్మి, రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా, అమెరికాలోనూ ఈ సినిమాకు విశేష స్పందన వస్తోందని చిత్ర బృందం తెలిపింది. దాదాపు 500లకు పైగా ప్రీమియర్‌ షోలను ప్రదర్శించారు. సినిమాకు మంచి టాక్‌ రావడంతో మరిన్ని షోలను పెంచినట్లు ఓవర్సీస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘మీ నుంచి వస్తున్న స్పందనకు నిజంగా ధన్యవాదాలు. మీ తల్లి, బామ్మలతో కలిసి ఈ సినిమా చూడండి. మిమ్మల్ని నిజంగా అలరిస్తుంది’ అని అన్నారు. ఇక గతంలో సమంత నటించిన ‘యూటర్న్‌’తో పోలిస్తే ఓపెనింగ్‌ కలెక్షన్లు 15రెట్లు ఎక్కువగా వసూలైనట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. 

 

‘కబీర్‌ సింగ్‌ బాక్సాఫీస్‌ బ్లాక్‌బస్టర్‌’

అమెరికాలో భారీ డిమాండ్‌.. 45 సెంటర్ల పొడిగింపు

హైదరాబాద్‌: తెలుగు హిట్‌ ‘అర్జున్‌ రెడ్డి’కి హిందీ రీమేక్‌గా వచ్చిన ‘కబీర్‌ సింగ్‌’ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లో (దేశవ్యాప్తంగా) రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. సీబీఎఫ్‌సీ దగ్గర ‘ఎ’ సర్టిఫికెట్‌ పొంది, సాధారణ టికెట్‌ ధరతో, ఎటువంటి సెలవులు లేకుండా, ప్రపంచ కప్‌ జరుగుతున్న సమయంలో విడుదలైన చిత్రం ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం విశేషమని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇది ‘బాక్సాఫీస్‌  బ్లాక్‌బస్టర్‌’ అని పేర్కొన్నారు. ఈ చిత్రం తొలి రోజున రూ.20.21 కోట్లు (శుక్రవారం), శనివారం రూ.22.71 కోట్లు, ఆదివారం రూ.27.91 కోట్లు, సోమవారం రూ.17.54 కోట్లు రాబట్టినట్లు తెలిపారు.

స్క్రీన్ల పెంపు..

అమెరికాలో ఈ సినిమాకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో రెండో వారం నుంచి (జూన్‌ 28న) 45 సెంటర్లను పొడిగించారు. విదేశాల్లోనూ ఈ సినిమా విశేషమైన వసూళ్లు రాబడుతోందని విశ్లేషకులు వెల్లడించారు.

‘కబీర్‌ సింగ్‌’కు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ జంటగా నటించారు. ఈ సినిమా హీరో షాహిద్‌ కపూర్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ సాధించిన చిత్రంగా నిలిచింది. అదేవిధంగా ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్‌ సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది. రూ.42.30 కోట్లతో (ఓపెనింగ్‌) ‘భారత్’ మొదటి స్థానంలో ఉంది. ‘కళంక్‌’ రూ.21.60 కోట్లు, ‘కేసరి’ రూ.21.06 కోట్లు రాబట్టి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

రూ.175 కోట్ల ‘మహర్షి’

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’ సినిమా బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం కేవలం 18 రోజుల్లో రూ.175 కోట్లు (గ్రాస్‌) రాబట్టిందని చిత్ర బృందం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేసింది. ‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’ సినిమాల తర్వాత రూ.150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన మహేశ్‌ మూడో సినిమా ఇది కావడం విశేషం. ఇప్పటి వరకు ఏ హీరోకు ఈ ఘనత (రూ.150 కోట్ల క్లబ్‌లో చేరిన మూడు సినిమాలు ఉండటం) దక్కలేదని విశ్లేషకులు అంటున్నారు.

రైతులు, వ్యవసాయం నేపథ్యంలో దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో ‘వీకెండ్‌ వ్యవసాయం’ అనే హ్యాష్‌ట్యాగ్‌ బాగా ట్రెండ్‌ అయ్యింది. తాజాగా ఓ మహిళ తన కుమార్తెకు ‘మహర్షి’ సినిమా వల్ల వ్యవసాయంపై అవగాహన కల్గిందని ట్వీట్‌ చేశారు. అంతేకాదు చిన్నారి తన అభిప్రాయాల్ని కూడా రాసిందని చెప్పారు. దీన్ని చూసిన మహేశ్‌.. ‘‘మహర్షి’ ఎఫెక్ట్‌’ అని పోస్ట్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

‘మహర్షి’లో పూజా హెగ్డే కథానాయిక పాత్ర పోషించారు. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూర్చారు. దిల్‌రాజు, ప్రసాద్‌ వి పొట్లూరి, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు. మే 9న విడుదలైన ఈ సినిమాకు ప్రశంసలు లభించాయి. ఓ మంచి సందేశం ఇచ్చారని అందరూ మెచ్చుకున్నారు.

‘పదరా పదరా..’ వంద కోట్లు దాటి పదరా!

బాక్సాఫీసు వద్ద ‘మహర్షి’ పరుగులు!

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమా బాక్సాఫీసు వద్ద పరుగులు తీస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లు (గ్రాస్‌) రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. తొలి వారాంతంలో రూ.100 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేయడం విశేషమని పేర్కొన్నారు. మహేశ్‌ సినీ కెరీర్‌లో ఇది మైలురాయి కాబోతోందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ సినిమా నైజాంలో నాన్‌-‘బాహుబలి’ రికార్డును సృష్టించిందని ఇప్పటికే విశ్లేషకులు తెలిపారు. ఈ సినిమా నాలుగో రోజున నైజాంలో రూ.3.46 కోట్లు రాబట్టిందట. తొలి వారాంతంలో నైజాంలో రూ.16 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా చెన్నైలోనూ సినిమా విశేషమైన కలెక్షన్స్‌ సాధిస్తోంది.

‘మహర్షి’ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూర్చారు. దిల్‌రాజు, ప్రసాద్‌ వి పొట్లూరి, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు. మే 9న విడుదలైన ఈ సినిమాకు ప్రశంసలు లభించాయి. రైతులు, వ్యవసాయం విలువ తెలిసేలా ఓ మంచి సందేశం ఇచ్చారని మెచ్చుకున్నారు. అంతేకాదు సినిమాలోని ‘వీకెండ్‌ వ్యవసాయం’ ఇప్పుడు నిజంగా సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.
ఈ సినిమా విజయం పట్ల పూజ ఆనందం వ్యక్తం చేశారు. సంతోషంతో చిందులేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ‘‘మహర్షి’పై మీరు చూపించిన ప్రేమ నాతో డ్యాన్స్‌ చేయిస్తోంది. ఇది మరిచిపోలేని విజయం. బాక్సాఫీసు వద్ద సినిమా దూసుకుపోతోంది. అందరికీ ధన్యవాదాలు. ‘పాలపిట్ట’ పాట షూట్‌లో తీసిన వీడియో మీ కోసం’ అని ట్వీట్‌ చేశారు.

|
అమెరికాలో ‘మహర్షి’ దూకుడు!

 మిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటింది

హైదరాబాద్‌: ‘మహర్షి’ సినిమా అమెరికా బాక్సాఫీసు వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా అక్కడ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటినట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. బుధవారం జరిగిన ప్రీమియర్‌ షోలో 516,441 డాలర్లు (232 లొకేషన్లలో), మొదటి రోజున (గురువారం) 176,657 డాలర్లు (225 లొకేషన్లలో), రెండో రోజు 232,325 డాలర్లు (224 లొకేషన్లలో), మూడో రోజు 78,372 డాలర్లు (120 లొకేషన్లలో) మొత్తం 1,003,795 డాలర్లు రాబట్టినట్లు అంచనా వేశారు. ఇది మహేశ్‌ తొమ్మిదో మిలియన్‌ డాలర్ల చిత్రమని పేర్కొన్నారు.
‘మహర్షి’ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. మహేశ్‌ స్నేహితుడిగా అల్లరి నరేష్‌ నటించారు. పూజా హెగ్డే కథానాయిక. మీనాక్షి దీక్షిత్‌, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌ రాజ్‌, పోసాని, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దిల్‌రాజు, అశ్వినీ దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మించారు. మే 9న  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. మహేశ్‌ మరోసారి మంచి సందేశం అందించారంటూ నెటిజన్లు, పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు. 

‘అవెంజర్స్‌’ దెబ్బకు బాక్సాఫీసు బద్దలు!

వేల కోట్లు కొల్లగొట్టింది

లాస్‌ ఏంజెల్స్‌: ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్‌’ దెబ్బకు బాక్సాఫీసు బద్దలైంది. ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్లు వసూలు చేసింది. ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీవార్‌’కు కొనసాగింపుగా ఏప్రిల్‌ 26న విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లో 1.2 బిలియన్‌ డాలర్లు (రూ.8,384 కోట్లు) కొల్లగొట్టి, చరిత్ర సృష్టించింది. అనేక దేశాల్లో పాత రికార్డులను చెరిపేసింది.
కేవలం అమెరికా, కెనడాలో గురువారం రాత్రి నుంచి ఆదివారం వరకు 350 మిలియన్‌ డాలర్లు రాబట్టినట్లు డిస్నీ నిర్మాత సంస్థ అంచనా వేసింది. అదేవిధంగా చైనా, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, ఈజిప్ట్‌, దక్షిణాఫ్రికా, ఇతర 38 దేశాల్లో సినిమా వసూళ్ల పరంగా చరిత్ర సృష్టించింది. చైనాలో ‘ఎండ్‌గేమ్‌’ 330.5 మిలియన్‌ డాలర్లు సాధించింది. ‘సినిమాలోని పాత్రలపై తమకున్న ఇష్టాన్ని ప్రేక్షకులు మళ్లీ నిరూపించారు. ఈ అద్భుతమైన కథ ఎలా ముగుస్తుందో తెలుసుకోవాలని ఉత్సాహం చూపారు’ అని డిస్నీ హెడ్‌ ఆఫ్‌ థియేట్రికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ కేథలీన్‌ టఫ్‌ మీడియాతో అన్నారు.
‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ భారత్‌లో మూడు రోజుల్లో రూ.157.20 కోట్లు (2845 స్క్రీన్లు) రాబట్టింది. శుక్రవారం రూ.53.10 కోట్లు, శనివారం రూ.51.40 కోట్లు, ఆదివారం రూ.52.70 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇవి ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీవార్‌’ (భారత్‌లో) వసూళ్ల కంటే 66.07 శాతం ఎక్కువ కావడం విశేషం. ఆంటోని రుస్సో, జో రుస్సో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాబర్ట్‌ డౌనీ జూనియర్, క్రిస్‌ హెమ్స్‌వర్త్, మార్క్‌ రఫెలో, క్రిస్‌ ఇవాన్స్, స్కార్లెట్‌ జొహాన్సన్‌, విన్‌ డీసిల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

 

అమెరికాలో ‘జెర్సీ’ వసూళ్ల హవా!

మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో నాని ఆరో చిత్రం

హైదరాబాద్‌: కథానాయకుడు నాని నటించిన ‘జెర్సీ’ సినిమా అమెరికా బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా అక్కడ మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో అడుగుపెట్టినట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ మైలురాయిని చేరుకున్న నాని ఆరో సినిమా ఇదని తెలిపారు. ఈ నెల 19న విడుదలైన చిత్రం అమెరికా ప్రీమియర్‌లో 144,687 డాలర్లు, తొలి రోజున 262,732 డాలర్లు, రెండో రోజున 325,923 డాలర్లు, మూడో రోజున 179,391 డాలర్లు, నాలుగో రోజున 43,381 డాలర్లు, ఐదో రోజున 43,220 డాలర్లు మొత్తం 1,000,025 డాలర్లు రాబట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
‘జెర్సీ’ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికగా నటించారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. అనిరుధ్‌ బాణీలు అందించారు. ఇందులో నాని ‘అర్జున్‌’ అనే క్రికెటర్‌గా కనిపించి అందరి ప్రశంసలు పొందారు.

అర్ధ మిలియన్‌ డాలర్ల మార్క్‌ దాటిన ‘మజిలీ’

ప్రపంచ వ్యాప్తంగా రూ.21 కోట్లు..!

హైదరాబాద్‌: నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘మజిలీ’ సినిమా అమెరికాలో అర్ధ మిలియన్‌ డాలర్ల మార్కు దాటింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకులు సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. సినిమా శనివారం అక్కడ 132 లొకేషన్లలో 197,273 డాలర్లు రాబట్టినట్లు పేర్కొన్నారు. శుక్రవారం, శనివారంతో కలిపి మొత్తం 509,572 డాలర్లు వసూలు చేసినట్లు చెప్పారు. త్వరలోనే మిలియన్‌ డాలర్ల మార్కును చేరుకోనున్నట్లు అంచనా వేశారు. తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.7 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండు రోజుల్లో రూ.21 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకులు తెలిపారు.
శివ నిర్వాణ ‘మజిలీ’ సినిమాకు దర్శకత్వం వహించారు. దివ్యాన్ష కౌశిక్‌ మరో కథానాయిక. షైన్‌ స్క్రీన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్‌ బాణీలు అందించారు. తమన్‌ నేపథ్య సంగీతం సమకూర్చారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి విశేషమైన స్పందన లభించింది.

భావోద్వేగాల ‘మజిలీ’.. ఎన్నికోట్లు రాబట్టిందంటే?

హైదరాబాద్‌: ‘మజిలీ’ సినిమా తొలిరోజున చక్కటి వసూళ్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.7.10 కోట్లు (షేర్‌) సాధించినట్లు చిత్ర బృందం పేర్కొంది. బ్లాక్‌బస్టర్‌ జర్నీ ప్రారంభమైందని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.5.22 కోట్లు, అమెరికాలో రూ.0.88 కోట్లు, కర్ణాటకలో రూ.0.73 కోట్లు రాబట్టినట్లు తెలిపింది. మంచి టాక్‌ అందుకున్న నేపథ్యంలో వసూళ్లు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు.
నాగ చైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. దివ్యాన్ష కౌశిక్‌ మరో కథానాయిక. షైన్‌ స్క్రీన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్‌ బాణీలు అందించారు. తమన్‌ నేపథ్య సంగీతం సమకూర్చారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి విశేషమైన స్పందన లభించింది. సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు, ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘‘మజిలీ’ని ఇష్టపడ్డ ప్రతి శక్తిమంతమైన మహిళకు, సున్నితమైన పురుషులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా స్నేహితులు నాగచైతన్య, సమంత, షైన్‌ స్క్రీన్స్‌ నిర్మాతల పట్ల చాలా సంతోషంగా ఉన్నా’ అని ఈ సందర్భంగా శివ నిర్వాణ ట్వీట్‌ చేశారు.

అమెరికా ప్రేక్షకులకు నాగచైతన్య సందేశం

హైదరాబాద్‌: యువ కథానాయకుడు నాగచైతన్య అమెరికాలోని తెలుగు ప్రేక్షకులకు సందేశం పంపారు. ఆయన నటించిన ‘మజిలీ’ సినిమా ఏప్రిల్‌ 5న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 4న అమెరికాలో ప్రీమియర్‌ షోలు నిర్వహించబోతున్నారు. కాగా సినిమా ప్రీమియర్‌ను ఉద్దేశించి చైతన్య మాట్లాడారు. తన సినీ కెరీర్‌లోనే ఎక్కువ స్క్రీన్లపై ప్రీమియర్‌ షోలు ప్రదర్శించబోతున్న సినిమా ఇదని తెలిపారు. ‘మూన్‌ షైన్‌ సినిమాస్‌ ‘మజిలీ’ని అమెరికాలో విడుదల చేయబోతోంది. ఏప్రిల్‌ 4న ఉదయం ఆరు గంటలకు అమెరికాలో మొదటి షో ప్రారంభం కాబోతోంది. నా కెరీర్‌లోనే అతి ఎక్కువ స్క్రీన్లపై (ప్రీమియర్‌) ప్రదర్శించబడుతోన్న సినిమా ఇది. మూన్‌ షైన్‌ సినిమాస్‌కు ధన్యవాదాలు‌. పైరసీని ప్రోత్సహించొద్దు. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని కచ్చితంగా చెబుతున్నా. మేం ఎంత ఇష్టంగా సినిమాను చేశామో.. అలా మీరూ దాన్ని ఇష్టపడుతారు’ అని చైతన్య చెప్పారు.
‘మజిలీ’లో సమంత, దివ్యాన్ష కౌశిక్‌ కథానాయికల పాత్రలు పోషించారు. ‘నిన్నుకోరి’ ఫేం శివ నిర్వాణ దర్శకుడు. షైన్‌ స్క్రీన్స్‌ సంస్థ నిర్మించింది. గోపీ సుందర్‌ బాణీలు అందించారు. ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. దీంతో చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి.

ఓవర్సీస్‌ రైట్స్‌ వింటే ‘సాహో’ అనాల్సిందే!

హైదరాబాద్‌: యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌, థ్రిల్లర్‌ ‘సాహో’. శ్రద్ధాకపూర్‌ కథానాయిక. సుజీత్‌ దర్శకుడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. కాగా, ‘సాహో’ ఓవర్సీస్‌ రైట్స్‌ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయని సమాచారం. దాదాపు రూ.42కోట్లకు ఫర్ ‌ఫిల్స్మ్‌ ఈ హక్కులను దక్కించుకుందట. గ్రేట్‌ ఇండియా ఫిల్స్మ్‌ ఈ సినిమాను అమెరికాలో విడుదల చేయనుంది.

‘బాహుబలి’ చిత్రాల తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో అభిమానులను అలరించేలా సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా హాలీవుడ్‌ నిపుణుల పర్యవేక్షణలో యాక్షన్‌ సన్నివేశాలను తీర్చిదిద్దుతున్నారు. దాదాపు రూ.150కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ను యూవీ క్రియేషన్స్ ‌నిర్మిస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం యోచిస్తోంది.

 

‘f2’ కలెక్షన్ల జోరు.. అంతేగా.. అంతేగా..!

ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

‘f2’ కలెక్షన్ల జోరు.. అంతేగా.. అంతేగా..!

హైదరాబాద్‌: వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా తెరకెక్కిన మల్టీస్టారర్‌ ‘f2’ సినిమా బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రాణిస్తోంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా తొలివారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.61.43 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసిందని అంచనా వేశారు. సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోందని, వసూళ్లు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. రూ.30 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు సమాచారం. అంతేకాదు ఈ చిత్రం అమెరికా బాక్సాఫీసు వద్ద రెండు మిలియన్‌ డాలర్ల వైపు పరుగులు తీస్తోందని చిత్ర బృందం పేర్కొంది.

అనిల్‌ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తమన్నా, మెహరీన్‌ కథానాయికల పాత్రలు పోషించారు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్‌రాజ్‌, నాజర్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.‌ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు. భార్యాభర్త, ప్రేయసి- ప్రియుడు మధ్య జరిగే చిలిపి తగాదాల నేపథ్యంలో అత్యంత వినోదాత్మకంగా ఈ సినిమాను అనిల్‌ రావిపూడి తీశారు. గత ఏడాది కొన్ని సినిమాల వల్ల నష్టపోయానని ఇటీవల దిల్‌రాజు ఓ సందర్భంలో అన్నారు. ఇప్పుడు ‘f2’ సినిమా మంచి వసూళ్లతో దిల్‌రాజు బ్యానర్‌లో మరో సూపర్‌హిట్‌ను చేర్చింది.

మూడు రోజుల్లో మిలియన్‌ డాలర్లు!

మూడు రోజుల్లో మిలియన్‌ డాలర్లు!

ఇంటర్నెట్‌డెస్క్‌: భార్యా బాధితులుగా వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌లు తెలుగు రాష్ట్రాల వారినే కాదు.. ప్రవాసులనూ తెగ నవ్వించేస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వీరిద్దరూ కథానాయకులుగా నటించిన చిత్రం ‘ఎఫ్‌2: ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. సంక్రాంతికి థియేటర్‌కు వచ్చిన ఈ అల్లుళ్లు వెండితెరపై తెగ సందడి చేస్తున్నారు. భార్యల వల్ల వాళ్లు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతూ ప్రేక్షకులకు ఫన్‌ పంచుతున్నారు.

జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎఫ్‌2’ ఓవర్సీస్‌లో మంచి టాక్‌ను తెచ్చుకుంది. మూడు రోజుల్లోనే మిలియన్‌ డాలర్లను వసూలు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. కుటుంబ కథా చిత్రాలు అందునా, కామెడీ, ఫీల్‌గుడ్‌ చిత్రాలకు ఓవర్సీస్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది. ఆ కోవలోనే తెరకెక్కిన ‘ఎఫ్‌2’ను కూడా అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వెంకటేష్‌, వరుణ్‌, తమన్నా, మెహరీన్‌ల నటన... అనిల్‌ రావిపూడి సినిమాను తెరకెక్కించిన విధానం అందర్నీ అలరిస్తోంది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత పాత వెంకటేష్‌ను చూశామని, ఆయన కామెడీ చేస్తే ఎలా ఉంటుందో మరోసారి ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు రుచి చూపించారని అభిమానులు అంటున్నారు.

‘ఎఫ్‌2’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించారు. రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ, బ్రహ్మాజీ, రఘుబాబు, అన్నపూర్ణ, వై.విజయ, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

 

ఓవర్సీస్‌లో ‘పేట’కు భారీ ఓపెనింగ్స్‌ కానీ..

ఓవర్సీస్‌లో ‘పేట’కు భారీ ఓపెనింగ్స్‌ కానీ..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎల్లలులేని అభిమానం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సొంతం. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘పేట’. సంక్రాంతి సందర్భంగా గురువారం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా రజనీ అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. చాలా రోజుల తర్వాత రజనీ స్టైల్‌, మేనరిజమ్స్‌తో అదరగొట్టేశారు. కాగా, విదేశాల్లో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. అమెరికాలో 220 లొకేషన్లలో ‘పేట’ విడుదలైంది. ప్రీమియర్‌ షోల ద్వారా ఇప్పటి వరకూ తెలుగు, తమిళ భాషల్లో 5,45,000 డాలర్లు(సుమారు రూ.3.84కోట్లు) వసూలు చేసినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా పూర్తి కలెక్షన్ల వివరాలు రావాల్సి ఉంది.

అయితే, రజనీ నటించిన ‘కబాలి’, ‘2.ఓ’ చిత్రాల ఓపెనింగ్స్‌తో పోలిస్తే, ఇది చాలా తక్కువట. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండగకు ‘యన్‌.టి.ఆర్‌: కథానాయకుడు’, అజిత్‌ ‘విశ్వాసం’(తమిళం) చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీంతో థియేటర్ల కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. శుక్ర, శనివారాల్లో ‘వినయ విధేయ రామ’, ‘ఎఫ్‌2’ చిత్రాలు ఉండటంతో కలెక్షన్ల ప్రభావం అన్ని చిత్రాలపైనా చూపే అవకాశం ఉందని, ఇది చాలా సహజంగా జరిగే ప్రక్రియ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

‘పేట’లో సిమ్రన్‌, త్రిష, విజయ సేతుపతి, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూర్చారు. సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ ఈ సినిమాను నిర్మించగా, తెలుగులో అశోక్‌ వల్లభనేని విడుదల చేశారు.

 

బే ఏరియాలో ‘ఎన్టీఆర్‌’ సందడి 

బే ఏరియాలో ‘ఎన్టీఆర్‌’ సందడి 

కాలిఫోర్నియా: తెలుగు ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసి స‌గ‌ర్వంగా త‌లెత్తుకునేలా చేసిన మ‌హోన్న‌త నాయ‌కుడు నందమూరి తారక రామారావు. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఎన్టీఆర్-కథానాయకుడు’. ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైన ఈ చిత్రాన్ని అమెరికాలోని పలు ప్రాంతాల్లో ప్రవాసులు తిలకించారు. కాలిఫోర్నియా బే ఏరియాలోని థియేటర్‌లో అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం, తెదేపా నేత మన్నవ సుబ్బారావు అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం కోమటి జయరాం మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను తిరుగులేని నటుడిగా నిరూపించిన చిత్రాలను ఈ సినిమాలో కళ్లకు కట్టారన్నారు. ఎన్టీఆర్‌ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటించి తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచారని కొనియాడారు. చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు క్రిష్‌కు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన మహానటుడు ఎన్టీఆర్‌ అన్నారు. భావితరాలకు ఆయన ఆదర్శప్రాయుడని చెప్పారు. ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ పరకాయ ప్రవేశం చేశారని కొనియాడారు. దర్శకుడు క్రిష్‌ కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెంకట్‌ కోగంటి, చందు మల్లెల, యశ్వంత్‌ కుదరవల్లి, రజనీ కాకర్ల, గంగా కోమటి, శ్రీకాంత్‌ దొడ్డపనేని, హరి నల్లమల, బబ్బూరి సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

‘గౌతమిపుత్ర..’ను బీట్‌ చేసిన ‘యన్‌టిఆర్‌’

అమెరికాలో ప్రీమియర్‌ షో వసూళ్లు ఎంతంటే..

‘గౌతమిపుత్ర..’ను బీట్‌ చేసిన ‘యన్‌టిఆర్‌’


వాషింగ్టన్‌: నందమూరి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. అలనాటి నటుడు ఎన్టీ రామారావు జీవితాధారంగా తెరకెక్కిన ‘యన్‌టిఆర్‌: కథానాయకుడు’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. కాగా.. అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమా ప్రీమియర్‌ షోను మంగళవారం ప్రదర్శించారు. నిన్నటి నుంచి ఈరోజు ఉదయం వరకు వేసిన షోలతో ‘యన్‌టిఆర్‌’ చిత్రం 4,40,000 డాలర్లు (రూ. 3,09,87,000) రాబట్టినట్లు సినీ విశ్లేషకులు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు.

ఈ మేరకు బాలయ్య నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రీమియర్‌ షో వసూళ్లను ‘యన్‌టిఆర్‌’ చిత్రం బీట్‌ చేసిందని అంటున్నారు. అమెరికాలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రీమియర్‌ షో ద్వారా తొలి రోజు 3,75,000 డాలర్లు (రూ.2, 64,14,812) వసూళ్లు రాబట్టింది. ‘యన్‌టిఆర్‌’ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ‘యన్‌టిఆర్‌: కథానాయకుడు’, ‘యన్‌టిఆర్‌: మహానాయకుడు’గా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ‘యన్‌టిఆర్‌: మహానాయకుడు’ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

న్యూజెర్సీలో ‘యన్‌టిఆర్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక

అతిథిగా హాజరైన తారక రత్న

న్యూజెర్సీలో ‘యన్‌టిఆర్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక

న్యూజెర్సీ: విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కిన ‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఎన్టీఆర్‌ అభిమానులు ఆదివారం ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు ఎన్టీఆర్‌ మనవడు, సినీ నటుడు తారక రత్న ముఖ్య అతిథిగా విచ్చేసి అభిమానులతో సందడి చేశారు.

న్యూజెర్సీలో ‘యన్‌టిఆర్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక

ఈ సందర్భంగా అభిమానులు ఆయన్ను సన్మానించి కేక్‌ కట్‌ చేయించారు. కేక్‌పై ‘యన్‌టిఆర్‌: కథానాయకుడు’ అని రాసున్న పోస్టర్‌ను డిజైన్‌ చేయించి దానిపై ‘ఎన్‌బీకే ఆర్మీ, న్యూజెర్సీ’ అని ప్రింట్‌ చేయించడం ఆకట్టుకుంటోంది. 9న బయోపిక్‌లోని తొలి భాగమైన ‘కథానాయకుడు’ చిత్రం విడుదల కాబోతోంది. 8న అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల కోసం ప్రీమియర్‌ షోను వేయనున్నారు. ఫిబ్రవరిలో రెండో భాగమైన ‘యన్‌టిఆర్‌: మహానాయకుడు’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఎన్టీఆర్‌కు నివాళిగా..

తెలుగు రాష్ట్రాల్లో ‘యన్‌టిఆర్’ సినిమాను విడుదల చేస్తున్న అన్ని థియేటర్ల ఎదుట ప్రేక్షకుల సందర్శనార్థం నందమూరి తారాక రామారావు విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. మంగళవారం తిరుపతిలోని పీజేఆర్‌ థియేటర్‌లో తొలి విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఈ విగ్రహాన్ని బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ ఆవిష్కరించనున్నారు.

న్యూజెర్సీలో ‘యన్‌టిఆర్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక

‘యన్‌టిఆర్’ ప్రయాణాన్ని వీక్షించండి

అమెరికాలోని తెలుగువారికి కల్యాణ్‌రామ్‌ సందేశం

‘యన్‌టిఆర్’ ప్రయాణాన్ని వీక్షించండి

హైదరాబాద్‌: విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కిన ‘యన్‌టిఆర్‌’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తొలి భాగమైన ‘యన్‌టిఆర్‌: కథానాయకుడు’ చిత్రం జనవరి 9న విడుదల కాబోతోంది. అయితే అమెరికాలో ఉన్న తెలుగువారి కోసం 8న ప్రీమియర్‌ షోను ప్రదర్శించనున్నారట. ఈ విషయాన్ని ఎన్టీ రామారావు మనవడు, సినీ నటుడు కల్యాణ్‌ రామ్‌ వీడియో ద్వారా వెల్లడించారు.  

‘అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు. ‘యన్‌టిఆర్’ సినిమా జనవరి 8న అమెరికాలో ప్రీమియర్‌ షో ద్వారా మీ ముందుకు రాబోతోంది. చాలా అద్భుతమైన గొప్ప సినిమా చూడబోతున్నారు. ఆ కాన్ఫిడెన్స్‌ నాకుంది. మీరు చూసి ఎంజాయ్‌ చేస్తారన్న నమ్మకం కూడా ఉంది. అమెరికాలో ఉన్న తెలుగువారి ద్వారా సినిమా విడుదల కాబోతోంది. కాబట్టి.. ఎన్టీఆర్‌ ప్రయాణం మొత్తాన్ని థియేటర్‌లో వీక్షించండి. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటించారు. ఎన్‌బీకే ఫిల్స్మ్‌ పతాకంపై బాలకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సహ నిర్మాతలు. ఎంఎం కీరవాణి స్వరాలు అందించారు. రెండో భాగం ‘యన్‌టిఆర్‌: మహానాయకుడు’ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.


‘2.ఓ’.. మెగా బ్లాక్‌బస్టర్‌

‘2.ఓ’.. మెగా బ్లాక్‌బస్టర్‌

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఉన్న స్టార్‌డమ్‌ మరోసారి నిరూపితమైంది. తలైవా స్టైల్‌, శంకర్‌ విజన్‌ కలగలిపి వచ్చిన ‘2.ఓ’ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసినట్లు చిత్ర బృందం పేర్కొంది. ‘‘2.ఓ’ చరిత్ర సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసింది. ఇది కేవలం బ్లాక్‌బస్టర్‌ మాత్రమే కాదు.. మెగా బ్లాక్‌బస్టర్‌’ అంటూ లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఆనందంతో ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా చిన్ని 3.ఓ ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు.

‘2.ఓ’ హిందీ వెర్షన్‌లో ఆదివారానికి రూ.95 కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు. తొలిరోజుతో పోల్చితే నాలుగో రోజు వసూళ్లు 41.67 శాతం పెరిగాయని అన్నారు. ఈ సినిమా గురువారం (విడుదల రోజు) రూ.19.50 కోట్లు, శుక్రవారం రూ.17.50 కోట్లు, శనివారం రూ.24 కోట్లు, ఆదివారం 34 కోట్లు మొత్తం రూ.95 కోట్లు (హిందీ) సాధించినట్లు తెలిపారు.

2010లో వచ్చిన సూపర్‌హిట్‌ ‘రోబో’ సీక్వెల్‌ ‘2.ఓ’. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అమీ జాక్సన్‌ కథానాయిక. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సినిమాను నిర్మించింది.

 

2 మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో ‘అరవింద..’

2 మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో ‘అరవింద..’

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘అరవింద సమేత’ సినిమా బాక్సాఫీసు వద్ద చక్కగా రాణిస్తోంది. ఈ చిత్రం అమెరికాలో 2 మిలియన్‌ డాలర్ల మార్కును చేరినట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. బుధవారం (ప్రీమియర్‌ షోలు)+గురువారం (ఓపెనింగ్‌ డే) కలిపి 1,011,892 డాలర్లు, శుక్రవారం 275,325 డాలర్లు, శనివారం 357,420 డాలర్లు, ఆదివారం 164,527 డాలర్లు, సోమవారం 29,897 డాలర్లు, మంగళవారం 80,101 డాలర్లు, బుధవారం 17,059 డాలర్లు, గురువారం 12,473 డాలర్లు మొత్తం 1,974,447 డాలర్లు (రూ.14.49 కోట్లు) రాబట్టినట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే కథానాయిక. ఈషారెబ్బా, సునీల్‌, జగపతిబాబు, నాగబాబు, ఈశ్వరీరావు ప్రధాన పాత్రలు పోషించారు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకులతోపాటు ప్రముఖుల ప్రశంసలు లభించాయి.

‘అరవింద సమేత’ కోట్లు కొల్లగొట్టింది!

ఎన్టీఆర్‌ నాన్‌ ‘బాహుబలి’ రికార్డు

‘అరవింద సమేత’ కోట్లు కొల్లగొట్టింది!

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘అరవింద సమేత’ చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రం నాన్‌ ‘బాహుబలి’ రికార్డును సృష్టించినట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. ‘బాహుబలి’ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన చిత్రమిదని తెలిపారు. సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజున రూ.60 కోట్లు కొల్లగొట్టిందని విశ్లేషకులు చెప్పారు. ఇది సరికొత్త రికార్డని పేర్కొన్నారు. ఈ చిత్రం కేవలం తెలంగాణలో మొదటి రోజున రూ.8.30 కోట్లు (గ్రాస్‌) రాబట్టినట్లు సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు చేశారు.

అంతేకాదు ఈ చిత్రం విదేశాల్లోనూ అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. అమెరికాలో ఇప్పటికే మిలియన్‌ డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా రెండు మిలియన్‌ డాలర్లవైపు అడుగులు వేసింది. చిత్రం ఆస్ట్రేలియాలో టాప్‌-10 జాబితాలో చేరింది. గురువారం అక్కడ 35 లొకేషన్లలో రూ.67.63 లక్షలు రాబట్టిందని విశ్లేషకులు తెలిపారు. వారాంతంలో సినిమా అధిక కలెక్షన్స్‌ రాబట్టే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘అరవింద సమేత’. పూజా హెగ్డే కథానాయిక. జగపతిబాబు, సునీల్‌, ఈషా రెబ్బా, నాగబాబు, సితార, రావు రమేశ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. తమన్‌ బాణీలు అందించారు. ‘వాడిదైన రోజున ఎవ‌డైనా కొట్ట‌గ‌ల‌డు. అస‌లు గొడ‌వ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు’ అనే పాయింట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది. విమర్శకులతోపాటు సినీ ప్రముఖులు సైతం చిత్ర బృందాన్ని ప్రశంసించారు.

‘జై లవకుశ’ను బీట్‌ చేసిన ‘వీర రాఘవ’

అమెరికాలో సత్తా చాటుతున్న ‘అరవింద సమేత’

‘జై లవకుశ’ను బీట్‌ చేసిన ‘వీర రాఘవ’

హైదరాబాద్‌: ‘యంగ్‌ టైగర్‌’ ఎన్టీఆర్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఆయన కథానాయకుడుగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందుతోంది. ఇప్పటికే అడ్వాన్స్‌‌ బుకింగ్‌ భారీ స్థాయిలో జరిగింది. అమెరికాలోనూ ‘వీర రాఘవ’ సత్తాచాటుతున్నాడు. అక్కడ మొత్తం 194 ప్రాంతాల్లో విడుదలైంది.

అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ చిత్రం 707,698 డాలర్ల వసూళ్లు రాబట్టి తారక్‌ నటించిన ‘జైలవకుశ’ సినిమాను బీట్‌ చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ‘జైలవకుశ’ అమెరికాలో తొలి రోజు 589,219 డాలర్లు రాబట్టింది. ఇక ‘జనతా గ్యారేజ్‌’ 584,000 డాలర్లు రాబట్టింది. తారక్‌ కెరీర్‌లో అమెరికాలో ఇంత స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రం ‘అరవింద సమేత’ అని విశ్లేషకులు అంటున్నారు. మరి ఎన్ని రోజుల్లో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందో వేచి చూడాలి. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటించారు. హారిక-హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించారు.

‘దేవదాస్‌’ ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

అమెరికాలో వసూళ్ల సందడి

‘దేవదాస్‌’ ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

హైదరాబాద్‌: నాగార్జున, నాని కథానాయకులుగా నటించిన చిత్రం ‘దేవదాస్‌’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మించారు. రష్మిక, ఆకాంక్ష సింగ్‌ కథానాయికలుగా నటించారు. సెప్టెంబరు 27న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. అంతేకాదు చిత్రం బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబడుతోంది.

ఈ సినిమా అమెరికాలో అర్ధ మిలియన్‌ డాలర్ల మార్కును అధిగమించిందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. సినిమా శనివారానికి (సెప్టెంబరు 29) 558,592 డాలర్లు (రూ.4.05 కోట్లు) వసూలు చేసినట్లు చెప్పారు. త్వరలోనే మిలియన్‌ డాలర్ల మార్కును అందుకుంటుందని అభిప్రాయపడ్డారు.

మరోపక్క మణిరత్నం ‘నవాబ్‌’ సినిమా కూడా విదేశాల్లో సత్తా చాటింది. ఈ సినిమా అమెరికాలో అర్ధ మిలియన్‌ డాలర్ల మార్కు‌ దాటింది. సెప్టెంబరు 27న విడుదలైన చిత్రం 29వ తేదీకి 592,319 డాలర్లు (రూ.4.30 కోట్లు) రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. ఈ చిత్రంలో అర‌వింద స్వామి, జ్యోతిక‌, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్, త్యాగ‌రాజ‌న్, అదితి రావు‌ హైదరి త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్‌ బాణీలు అందించారు. మణిరత్నం నిర్మించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది.

విదేశాల్లో ‘నవాబ్‌’ హవా!

ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

విదేశాల్లో ‘నవాబ్‌’ హవా!

హైదరాబాద్‌: మణిరత్నం తెరకెక్కించిన ‘నవాబ్‌’ సినిమా విదేశాల్లో అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, యూకే బాక్సాఫీసుల వద్ద సత్తా చాటిందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. మిగిలిన చిత్రాలకు ఇది గట్టిపోటీగా నిలిచిందని అన్నారు. గురువారం (సెప్టెంబరు 27) విడుదలైన ఈ సినిమా శనివారానికి అమెరికాలో 542,277 డాలర్లు (రూ.3.93 కోట్లు), యూఏఈలో రూ.2.42 కోట్లు, ఆస్ట్రేలియాలో 170,682 డాలర్లు (రూ.88.07 లక్షలు), యూకేలో రూ.60.40 లక్షలు, న్యూజిలాండ్‌లో రూ.26.12 లక్షలు రాబట్టడం అద్భుతమని పేర్కొన్నారు.

ఈ చిత్రంలో అర‌వింద స్వామి, జ్యోతిక‌, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్, త్యాగ‌రాజ‌న్, అదితి రావు‌ హైదరి త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్‌ బాణీలు అందించారు. మణిరత్నం నిర్మించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. మణిరత్నం ఇప్పటికే మాఫియా క‌థ‌ల‌పై అనేక సినిమాలు చేశారు. ఆయ‌న మ‌రోసారి ఆ నేప‌థ్యాన్ని ఎంచుకుని.. దానికి కుటుంబ ఆధిప‌త్య పోరుని మేళ‌వించి చేసిన ప్ర‌య‌త్న‌మే ఈ చిత్రం.

అమెరికా బాక్సాఫీసు వద్ద ‘నవాబ్‌’ గర్జన

మణిరత్నం మ్యాజిక్‌ చేశారు

అమెరికా బాక్సాఫీసు వద్ద ‘నవాబ్‌’ గర్జన

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘నవాబ్‌’ చిత్రంతో తన మార్కును మరోసారి ప్రేక్షకులకు చూపించారు. చక్కటి కథతో రూపొందించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిన తీరు చక్కగా ఉందని విమర్శకులు ప్రశంసించారు.

అరవింద స్వామి, శింబు, జ్యోతిక, అరుణ్‌ విజయ్‌, ఐశ్వర్యా రాజేశ్‌, విజయ్‌ సేతుపతి, ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, అదితి రావు హైదరి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. మణిరత్నం, శివ ఆనంది నిర్మించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సమర్పించింది. ఎ.ఆర్‌. రెహమాన్‌ బాణీలు అందించారు. మాఫియా కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది.

ఈ సినిమా అమెరికా బాక్సాఫీసు వద్ద గర్జించిందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. మణిరత్నం మళ్లీ మ్యాజిక్‌ చేశారని అన్నారు. బుధవారం నిర్వహించిన ప్రీమియర్స్‌లో 79,258 డాలర్లు, గురువారం (తొలిరోజు) 87,970 డాలర్లు, మొత్తం 167,228 డాలర్లు (రూ.1.21 కోట్లు) రాబట్టిందని తెలిపారు. ఒక్క రోజులో ఇంత మంచి కలెక్షన్స్‌ రాబట్టడం విశేషమని పేర్కొన్నారు.

‘యూటర్న్‌’ ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

‘యూటర్న్‌’ ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

హైదరాబాద్‌: ‘యూటర్న్‌’ సినిమా తెలుగుతోపాటు తమిళంలోనూ చక్కటి టాక్‌ అందుకుంది. వినాయక చవితి సందర్భంగా గురువారం విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.12 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ సినిమా కేవలం తమిళనాడులో (నాలుగు రోజుల్లో) రూ.3.6 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.95 కోట్లు సాధించినట్లు పేర్కొన్నారు. అమెరికాలో రూ.1.58 కోట్లు, ఆస్ట్రేలియాలో రూ.16.50 కోట్లు, ఇతర దేశాల్లో రూ.25 లక్షలు రాబట్టినట్లు విశ్లేషకులు చెప్పారు.

అగ్ర కథానాయిక సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యూటర్న్‌’. ఆది పినిశెట్టి, భూమిక, రాహుల్‌ రవీంద్రన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. పవన్‌ కుమార్‌ దర్శకుడు. కన్నడ హిట్‌ ‘యూటర్న్‌’కు తెలుగు, తమిళ రీమేక్‌ ఇది. శ్రీనివాస్‌ చిట్టూరి, రాంబాబు బండారు నిర్మాతలు. సంగీతం.. పూర్ణచంద్ర. ‘రంగస్థలం’, ‘మహానటి’ తర్వాత సమంత ఈ ఏడాది ‘యూటర్న్‌’తో మరో హిట్‌ అందుకున్నారు.

‘కేరాఫ్‌ కంచరపాలెం’ వసూళ్ల సందడి

అమెరికాలో ఎంత రాబట్టిందంటే?

‘కేరాఫ్‌ కంచరపాలెం’ వసూళ్ల సందడి

హైదరాబాద్‌: ‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమా అమెరికాలో చక్కటి వసూళ్లు రాబడుతోంది. వెంకటేశ్‌ మహా దర్శకత్వం వహించిన చిత్రమిది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రానా దగ్గుబాటి సినిమాను సమర్పించారు. వైజాగ్‌ సమీపంలోని కంచరపాలెం నేపథ్యంలో సాగే కథ ఇది. అందరూ నూతన నటీనటులే. విజయ ప్రవీణ పరుచూరి నిర్మాత. స్వీకర్‌ అగస్థి సంగీతం అందించారు. ఈ నెల 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ చిత్రం అమెరికాలో మూడు రోజుల్లో రూ.1.32 కోట్లు రాబట్టిందని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్ ట్వీట్‌ చేశారు. మౌత్ టాక్‌ వల్లా సినిమా వసూళ్లు రోజు రోజుకూ పెరుగుతున్నాయని అన్నారు. సినిమా శుక్రవారం (ఓపెనింగ్‌) 53,835 డాలర్లు, శనివారం 82,709 డాలర్లు, ఆదివారం 45,963 డాలర్లు మొత్తం 182,507 డాలర్లు (రూ.1.32 కోట్లు) రాబట్టినట్లు ఆయన ట్వీట్‌ చేశారు.‌

ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా ప్రశంసించారు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి, క్రిష్‌, మహేశ్‌బాబు, సుకుమార్‌, నాని, సమంత, రాశీఖన్నా తదితరులు యూనిట్‌ను మెచ్చుకున్నారు. సినిమాను తప్పక చూడండని ప్రేక్షకులను కోరారు.

 

‘వీరరాఘవ’ వసూళ్ల వేట

హిందీ సినిమాలను బీట్‌ చేస్తున్నాయి

‘వీరరాఘవ’ వసూళ్ల వేట

హైదరాబాద్‌: విదేశాల్లో హిందీ సినిమాల వసూళ్లను తెలుగు చిత్రాలు అధిగమిస్తున్నాయి. 2018లో విడుదలైన ‘రంగస్థలం’ (మార్చి), ‘భరత్‌ అనే నేను’ (ఏప్రిల్‌), ‘అరవింద సమేత’ (అక్టోబరు) ఆస్ట్రేలియాలో అద్భుతమైన వసూళ్లు రాబట్టాయని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో విడుదలౌతున్న మిగిలిన భారతదేశ భాషా చిత్రాల కంటే తెలుగు సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. ప్రత్యేకించి ఇవి హిందీ, పంజాబీ సినిమాలను కూడా బీట్‌ చేస్తున్నాయని ప్రశంసించారు.

ఇటీవల విడుదలైన ‘అరవింద సమేత’ అమెరికాలో 1.5 మిలియన్‌ డాలర్ల మార్కును చేరుకుందని విశ్లేషకులు చెప్పారు. రెండు మిలియన్‌ డాలర్ల క్లబ్‌ వైపు పరుగులు తీస్తోందని పేర్కొన్నారు. బుధవారం (సెప్టెంబరు 10) ప్రీమియర్ షో‌+గురువారంతో కలిపి 1,011,935 డాలర్లు, శుక్రవారం 275,345 డాలర్లు (178 లొకేషన్లలో) మొత్తం 1,287,280 డాలర్లు (రూ.9.48 కోట్లు) రాబట్టినట్లు ట్వీట్లు చేశారు. అంతేకాదు ఆస్ట్రేలియాలో గురువారం 128,740 డాలర్లు(ఆస్టేలియా), శుక్రవారం 69,666 డాలర్లు, శనివారం 57,574 డాలర్లు (34 లొకేషన్లలో) మొత్తం 255,980 డాలర్లు (రూ.1.34 కోట్లు) రాబట్టినట్లు తెలిపారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అరవింద సమేత’. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. పూజా హెగ్డే కథానాయిక. జగపతిబాబు, ఈషా రెబ్బా, సునీల్‌, రావు రమేశ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తమన్‌ బాణీలు అందించారు. ఇందులో ఎన్టీఆర్‌ ‘వీరరాఘవ’ పాత్రలో, పూజా హెగ్డే ‘అరవింద’ పాత్రలో సందడి చేశారు. అక్టోబరు 11న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది.

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.