పెళ్లిలో కరోనా బుసలు.. 177మందికి వైరస్‌!
close
పెళ్లిలో కరోనా బుసలు.. 177మందికి వైరస్‌!

మిల్లినోకేట్‌: అగ్రరాజ్యం అమెరికాను కరోనా వణికిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక పాజిటివ్‌ కేసులు, మరణాలు ఇక్కడే నమోదయ్యాయి. అమెరికాలో ఈ మహమ్మారి‌ తీవ్రత గతంలో కన్నా కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనబడుతున్నప్పటికీ.. తాజాగా జరిగిన ఓ పెళ్లి వేడుకలో కరోనా బుసలు కొట్టింది. అమెరికాలోని మైన్‌ రాష్ట్రం మిల్లినోకేట్ పట్టణంలో జరిగిన ఓ పెళ్లి వేడుక సూపర్‌ స్ప్రెడర్‌గా మారింది. ఆగస్టులో జరిగిన ఈ వివాహ వేడుక ద్వారా 177మందికి వైరస్‌ సోకగా.. వారిలో ఏడుగురు మృతిచెందినట్టు వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) అధికారులు వెల్లడించారు. మిల్లినోకెట్‌ పట్టణంలోని ఓ చర్చిలో వివాహం జరగ్గా.. దానికి సమీపంలోని బిగ్‌ మూస్‌ ఇన్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. అయితే, ఈ పెళ్లి వేడుకకు 50మంది వరకే పాల్గొనేందుకు అధికారులు అనుమతి ఇచ్చినప్పటికీ.. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి 65మంది హాజరయ్యారు. ఇది జరిగిన పది రోజుల తర్వాత దాదాపు 24మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు పేర్కొన్నారు. 

ఒక్కసారిగా ఇన్ని కేసులు రావడంతో రంగంలోకి దిగిన అధికారులు.. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ వేడుక ద్వారా మొత్తం 177 మందికి వైరస్ బారినపడినట్టు నిర్ధారించారు. అలాగే, కరోనా సోకినవారిలో ఏడుగురు మరణించారనీ.. వీరికి అసలు ఆ పెళ్లితోనే సంబంధం లేదని మైన్‌ సీడీసీ డైరెక్టర్‌ నీరవ్‌ షా వెల్లడించారు. కేవలం ఈ వేడుకకు హాజరైనవారి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందడం వల్లే ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ వేడుకకు హాజరైనవారి ద్వారా దాదాపు 370 కి.మీల దూరంలో ఉన్న ప్రాంతాల వారికీ ఈ వైరస్‌ వ్యాప్తి చెందడం గమనార్హం. దీనిపై సమాచారం తెలియగానే అధికారులు అప్రమత్తమయ్యారు. నగరాన్ని మరోసారి మూసివేసినట్టు తెలిపారు. ఈ వివాహం నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు, మైన్‌ గవర్నర్‌ జెనెట్‌ మిల్స్‌ అక్కడి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.


మరిన్ని