close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టీకా పంపిణీ: ఇలా ఐతే సంవత్సరాలే..!

అమెరికాలో మందకొడిగా సాగుతుందన్న జో బైడెన్‌

వాషింగ్టన్‌: కరోనా తీవ్రత అధికంగా ఉన్న అమెరికాలో అత్యవసర వినియోగం కింద కొవిడ్‌ టీకా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ 21లక్షల మందికి వ్యాక్సిన్‌ తొలిడోసు అందించారు. మరో కోటి 14లక్షల డోసులను వివిధ రాష్ట్రాలకు పంపించినట్లు ఫెడెరల్‌ అధికారులు వెల్లడించారు. అయితే, వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఆశించిన మేరకు టీకా పంపిణీ జరగడం లేదని అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన జో బైడెన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే వ్యాక్సిన్‌ పంపిణీకి కొన్ని సంవత్సరాలు పడుతుందని.. ఈ విషయంలో ట్రంప్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. దేశంలో కరోనా తీవ్రత దృష్ట్యా రానున్న కాలంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికన్లు సిద్ధంగా ఉండాలని జోబైడెన్‌ సూచించారు.

‘కరోనా ధాటికి వణికిపోతోన్న అమెరికాలో వ్యాక్సిన్‌ వచ్చినప్పటికీ పరిస్థితులు మరింత దిగజారే పరిస్థితి కనిపిస్తోంది. రానున్న కొన్ని వారాలు, నెలలు మరింత తీవ్రమైనవి. కరోనా మహమ్మారి విజృంభణ మొత్తం కాలంలో దేశానికి ఇదే అత్యంత కఠినమైన సమయం’ అని జో బైడెన్‌ అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌ పంపిణీ, నిర్వహణపై గతకొంత కాలంగా హెచ్చరిస్తున్నప్పటికీ ట్రంప్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బైడెన్‌ విమర్శించారు. ఈ సంవత్సరం చివరినాటికి 2కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ఇప్పటివరకు కేవలం 21లక్షల మందికే టీకా తొలి డోసు అందించారని అన్నారు. పరిస్థితి ఇలా కొనసాగితే వ్యాక్సిన్‌ పంపిణీకి కేవలం నెలలు కాదు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

తిప్పికొట్టిన ట్రంప్‌
వ్యాక్సిన్‌ పంపిణీపై బైడెన్‌ చేసిన విమర్శలను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తిప్పికొట్టారు. వ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు చేరవేయడం వరకే ఫెడరల్‌ అధికారులు బాధ్యతని.. పంపిణీ చేపట్టేది మాత్రం రాష్ట్రాలేనని స్పష్టంచేశారు. నిధులు సమకూర్చి అత్యంత తక్కువ సమయంలోనే వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసేందుకు కృషి చేశామని ట్రంప్‌ ట్విటర్‌లో సమాధానమిచ్చారు. 

ఇదిలాఉంటే, అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న జోబైడెన్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం భారీఎత్తున టీకా పంపిణీని చేపట్టాలని ఇప్పటికే అధికారులకు సూచించారు. కేవలం బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే పదికోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందించాలనే లక్ష్యాన్ని అధికారులకు నిర్దేశించారు. ఇదే సమయంలో వ్యాక్సిన్‌పై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు జో బైడెన్‌ బహిరంగంగానే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌ కూడా తాజాగా వ్యాక్సిన్‌ను బహిరంగంగా తీసుకున్నారు.

ఇవీ చదవండి..
టీవీ లైవ్‌లో టీకా తీసుకున్న కమలా హ్యారిస్‌
అమెరికాలో మున్ముందు మరిన్ని చీకటి రోజులు!


మరిన్ని