close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాజన్‌-నాగేంద్ర జీవితం సంగీతానికి అంకితం

సంగీత ద్వయానికి నివాళులర్పించిన సినీప్రముఖులు

హ్యూస్టన్‌‌‌: ‘చినుకులా రాలి.. నదులుగా సాగి’, ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ’ అంటూ సాగే ఎన్నో అద్భుతమైన పాటలకు సంగీతం అందించి తెలుగువారి మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు సంగీత దర్శకులు రాజన్‌-నాగేంద్ర ద్వయం. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ అన్నదమ్ములు పలు భాషల్లో కొన్ని వందల చిత్రాలకు సంగీతం అందించారు. కన్నడ చిత్ర పరిశ్రమలో రాజన్‌-నాగేంద్ర ద్వయానికి మంచి గుర్తింపు ఉంది. అయితే, ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా రాజన్‌ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది’ అనే పేరుతో రాజన్‌కు పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.

శారదా ఆకునూరి, వంశీరామరాజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మురళీమోహన్‌, చంద్రమోహన్‌, భువనచంద్ర, రేలంగి నరసింహారావు, వై.వి.ఎస్‌.చౌదరి, వేటూరి రవిప్రకాశ్‌, ఎన్‌.బి.శాస్త్రి, రాధాకృష్ణరాజు, తెన్నేటి సుధాదేవి, శైలజ సుంకరపల్లి, రాము, ప్రవీణ్‌కుమార్‌ కొప్పొలు, ప్రసాద్‌ సింహాద్రి, తాతా బాల కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. రాజన్‌-నాగేంద్ర ద్వయంతో తమకున్న అనుబంధాన్ని ఇతరులతో పంచుకున్నారు.

‘రాజన్‌-నాగేంద్ర ద్వయం పేరుపొందిన గొప్ప సంగీత దర్శకులు. నేను నటించిన కొన్ని సినిమాలకు వాళ్లు సంగీతం అందించారు. నేను నటించిన ‘నాగమల్లి’ ‘మూడు ముళ్ళు’, ‘ఇంటింటి రామాయణం’ లాంటి చిత్రాలకు వాళ్లు సంగీత దర్శకులుగా వ్యవహరించారు. తెలుగువారైన రాజన్‌-నాగేంద్ర కన్నడ చిత్రపరిశ్రమలో సైతం గుర్తింపు తెచ్చుకోవడం సంతోషకరమైన విషయం. తెలుగు గాయనీ గాయకులు కొంతమందిని కన్నడ ప్రేక్షకులకు వాళ్లే చేరువ చేశారు. ‘అగ్గిపిడుగు’ అనే తెలుగు చిత్రాన్ని కన్నడలో రాజకుమార్‌తో రీమేక్‌ చేయగా ఆ సినిమాకి రాజన్‌-నాగేంద్ర సంగీతం అందించారు. ఆ సినిమా విజయం సాధించడంతో వీరిద్దరూ అక్కడ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ‘సౌభాగ్యలక్ష్మి’ చిత్రంతో తెలుగులో అవకాశం పొందిన ఈ సంగీత ద్వయానికి ఎంతో మంది అభిమానులున్నారు. ‘పూజ’, ‘అద్దాల మేడ’, ‘నాలుగు స్తంభాలాట’ సినిమాల్లోని పాటలంటే నాకెంతో ఇష్టం. నా సినిమాల్లోని పాటలకు గుర్తింపు రావడానికి బాలు కూడా ఓ కారణం. నా కెరీర్‌కు బాలు ఐదో ప్రాణం.’ -చంద్రమోహన్‌

‘రాజన్‌-నాగేంద్ర.. తమ జీవితాలను సంగీతానికే అంకితం చేశారు. ఉన్నత విద్యలు అభ్యసించకపోయినా, శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా తండ్రి దగ్గర నుంచే కొంత సంగీతాన్ని నేర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆయన్ని నేను వ్యక్తిగతంగా కలుసుకోలేదు కానీ ఆయన సంగీతం అందించిన పలు పాటలంటే నాకు బాగా నచ్చాయి. ఇటీవల రాజన్‌ మృతి.. సంగీతలోకానికి తీరనిలోటు.’- మురళీమోహన్‌

‘ఇంటర్‌లో ఉన్నప్పుడు నా ప్రాణ స్నేహితుడు ప్రమాదవశాత్తు కన్నుమూశాడు. ఆ సమయంలో ఎంతో బాధపడ్డాను. బాగా ఏడ్చాను. ఆ  తర్వాత ఎన్నో సందర్భాల్లో బాధగా అనిపించింది కానీ కన్నీరు బయటకు రాలేదు కానీ గుండెలోనే ద్రవించింది. సామాన్య మానవుడు సైతం పాడుకునే విధంగా సంగీతాన్ని అందించగలిగిన వ్యక్తులు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఆకాశంలో ఉన్నటువంటి సంగీతాన్ని నేలమీదకు దింపి ఇంటింటికి, ప్రతి ఒక్కరికీ చేరువ చేసింది తెలుగు సినిమా పరిశ్రమ. తనువును కదిలించేది తాళం. మనసును కదిలించేది రాగం. సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు.. ఈ ముగ్గరు పాటకు త్రిమూర్తులు. ఏ తరం వారినైనా ఆకట్టుకునే గొప్ప పాటలను రాజన్‌-నాగేంద్ర అందించారు. చనిపోయినప్పటికీ తాము సృష్టించిన కళల రూపంలో కళాకారులు ఎప్పటికీ బతికే ఉంటారు. ‘అప్పుల అప్పారావు’ సినిమా కోసం మొదటిసారి ఈవీవీ సత్యనారాయణ కలిసి పనిచేశాను. పాటకు సంబంధించిన సందర్భం చెప్పగానే ట్యూన్‌ పాడి వినిపించాను. ఇంతకీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరు అని అడగగా.. ‘రాజన్‌-నాగేంద్ర‌’ అని ఈవీవీ అన్నారు. నాకెంతో సంతోషంగా అనిపించింది. నా జీవితంలో ఓ సంతోషకరమైన రోజది. రాజన్‌-నాగేంద్ర కంపోజ్‌ చేసిన పాటలు.. ‘సాంగ్స్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’. ఎప్పటికీ అవి అలాగే మిగిలిపోయి ఉంటాయి.’ - భువనచంద్ర

రాజేంద్ర - నాగేంద్ర వీనుల విందైన పాటలకు తాను దాసోహం అయ్యానని మాంచెస్టర్‌ నుంచి డాక్టర్‌ నగేశ్‌ చెన్నుపాటి అన్నారు. తొలినాళ్లలో వీళ్లిద్దరూ ఒకరేనని భ్రమ పడేవాడినని చెప్పారు. తాను కాలేజీలో చదువుకున్న రోజుల్లో ఈ జోడి నుంచి వచ్చిన పాటలను వినేందుకు సినిమాలను పదే పదే చూసేవాడినని అన్నారు. ‘పంతులమ్మ’, ‘నాగమల్లి’, ‘ఇంటింటి రామాయణం’ పాటలను పదే పదే విని రికార్డులు అరగ్గొట్టేశావాళ్లమంటూ ఆ నాటి రోజులను గుర్తుచేసుకున్నారు. వారి పాటలు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు.

ఈ సందర్భంగా అమెరికా గాన కోకిల శారద ఆకునూరి మాట్లాడుతూ.. 2018లో హైదరాబాద్‌లో రాజన్‌ గారిని జీవి సాఫల్య పురస్కారం, సద్గురు ఘంటసాల స్వర్ణపతకంతో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య సత్కరించారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు ‘ఆరు దశాబ్దాల రాజన్‌- నాగేంద్ర సినీ వైభవం’ పేరిట ఆయన స్వరపరిచిన అద్భుతమైన పాటలతో సంగీత విభావరి ఆయన సమక్షంలో చెయ్యడం తన అదృష్టం అని పేర్కొన్నారు. ఆమెతో పాటు గాయకులు బాల కామేశ్వరరావు, రాము, ప్రవీణ్‌, బెంగళూరు నుంచి రాజన్‌ కుమారుడు అనంత్ తదితరులు నివాళిని వీక్షించారు.

వార్తలు / కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.