కరోనా టీకా: అమెరికాలో ఆమె, కెనడాలో ఈమె!
close
కరోనా టీకా: అమెరికాలో ఆమె, కెనడాలో ఈమె!

కెనడాలో తొలి వ్యాక్సిన్‌ 89 ఏళ్ల వృద్ధురాలికి..

టొరాంటో: నేటి మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటున్నారు. విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర రంగాల్లో తాము ఏ మాత్రం తీసిపోమని నిరూపించుకుంటున్నారు. ఇక కరోనా వైరస్‌ మహమ్మారి కట్టడిలో కూడా స్త్రీల పాత్ర గణనీయమైనదే. ఈ నేపథ్యంలో వారికి సముచిత గౌరవం ఇస్తూ అగ్రరాజ్యం అమెరికా తమ ప్రతిష్ఠాత్మక కొవిడ్‌-19 నిరోధక వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని సాండ్రా లిండ్సే అనే మహిళా నర్సుతో ప్రారంభించింది. కాగా, కెనడా కూడా అగ్రరాజ్యాన్నే అనుసరిస్తూ.. 89 ఏళ్ల వృద్ధురాలితో తమ దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని మొదలుపెట్టింది.

ఈ బామ్మ తొలి వ్యాక్సిన్‌ గ్రహీత

ఇక్కడి క్యుబెక్‌ పట్టణంలోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటున్న గిసెలే లెవెస్కూ అనే బామ్మ తొలి వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఆమె ఫైజర్‌ టీకా తీసుకున్న సందర్భంగా అక్కడ ఉన్న ఆరోగ్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. అనంతరం టొరాంటోకు చెందిన అనితా క్విడాంజెన్‌ అనే వైద్యారోగ్య ఉద్యోగిని కరోనా టీకాను తీసుకున్నారు. కాగా, ఈ వీడియోను ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయటం విశేషం.

కెనడాలో వ్యాక్సిన్‌ పంపిణీ

కెనడాలో కరోనా మహమ్మారికి సంరక్షణా కేంద్రాల్లో ఉండే వృద్ధులు అత్యధికంగా బలయ్యారు. ఈ నేపథ్యంలో తొలి వ్యాక్సిన్‌ను అలాంటి వ్యక్తికి ఇవ్వటం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. చారిత్రక వ్యాక్సినేషన్‌ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా..  భారత సంతతికి చెందిన కెనడా ప్రజారోగ్య సేవల మంత్రి అనితా ఆనంద్‌ సామాజిక మాధ్యమాల ద్వారా అభినందనలు తెలిపారు. తమ దేశానికి తొలివిడతగా రెండు లక్షల 49 వేల ఫైజర్‌-బయోఎన్టెక్‌ వ్యాక్సిన్‌ డోసులు లభించనున్నాయని తెలిపారు. వాటిలో 30 వేల డోసుల పంపిణీ ఇప్పటికే పూర్తి కాగా, మిగిలినవి డిసెంబర్‌ 31లోగా అందనున్నాయన్నారు. దేశం అవసరాలకు సరిపడా డోసులు 2021 తొలి మూడునెలల్లోగా లభిస్తాయని మంత్రి అనితా ఆనంద్‌ తెలిపారు.

ఇవీ చదవండి ..

అమెరికాలో నర్సుకు తొలి కొవిడ్‌ టీకా

కరోనా టీకా.. అసలు నొప్పే లేదు



మరిన్ని