బైడెన్‌ దారిలో భారత సంతతి వైద్యులు!
close
బైడెన్‌ దారిలో భారత సంతతి వైద్యులు!

బహిరంగంగానే వ్యాక్సిన్‌ తీసుకుంటున్న ఇండో-అమెరికన్లు

న్యూయార్క్‌: కరోనా విజృంభణతో వణికిపోతోన్న అమెరికాలో అత్యవసర వినియోగం కింద ఇప్పటికే రెండు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్‌పై అక్కడి ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, భయాలను తొలగించేందుకు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడితో పాటు ఎందరో ప్రముఖులు బహిరంగంగానే వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. ఇదే దారిలో అమెరికాలోని భారత సంతతి వైద్యులు కూడా బహిరంగంగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. కరోనా పోరులో మనల్ని రక్షించే ఆయుధం ఇదేనని చెబుతూ ఇతరులను ప్రోత్సహిస్తున్నారు.

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా ఇప్పటికే ఫైజర్‌, మోడెర్నా టీకాలను అమెరికా పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే లక్షల మందికి తొలి డోసును అందించింది. వ్యాక్సిన్‌ తీసుకుంటున్నవారిలో భారత సంతతికి చెందిన వైద్యులు కూడా ముందున్నారు. ‘మేమందరం వ్యాక్సిన్‌ తీసుకుంటాము. వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తోందని.. ప్రస్తుతం కరోనానుంచి కాపాడేది టీకా మాత్రమే’ అని అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌(AAPI) అధ్యక్షుడు డా.సురేష్‌ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఫైజర్‌ వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు వెల్లడించిన ఆయన, ప్రస్తుతానికి ఎటువంటి ప్రతికూల ఫలితం చూపలేదని స్పష్టంచేశారు. అవకాశం వచ్చిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు.

తక్కువ సమయం, ఎక్కువ పనిగంటల వల్లే..
టెక్సాస్‌కు చెందిన మరో భారతీయ వైద్యుడు డాక్టర్‌ జయేష్‌ షా కూడా ఈ మధ్యే ఫైజర్‌ వ్యాక్సిన్‌ను బహిరంగంగా తీసుకున్నట్లు వెల్లడించారు. భారీ సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోవాలని, కనీసం 70శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకున్నట్లుయితే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించే ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు. టెక్సాస్‌ మెడికల్‌ అసోసియేషన్‌ బోర్డు సభ్యుడిగా ఉన్న ఆయన, నిజానికి కరోనా వ్యాక్సిన్‌ శాస్త్రీయ ఆశిర్వాదమని అభివర్ణించారు. అత్యంత తక్కువ సమయంలోనే వ్యాక్సిన్‌ తయారు చేయడంపై కొందరికి అనుమానాలున్నాయని అభిప్రాయపడ్డారు. అయితే, సాధారణంగా వ్యాక్సిన్‌ తయారీకి పట్టే పనిగంటలను తక్కువ సమయంలో కృషిచేయడం వల్లే శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయగలిగారని స్పష్టం చేశారు. భారీ స్థాయిలో నిధులు లభ్యం కావడంతో కావడం కూడా స్వల్ప కాలంలో వ్యాక్సిన్‌ అభివృద్ధికి దోహదపడిందని జయేష్‌ షా పేర్కొన్నారు. అందుకే, వ్యాక్సిన్‌లపై అనుమానాలు అవసరం లేదని.. వీటిపై నమ్మకముంచి ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక అమెరికాలోని బిహార్‌, ఝార్ఖండ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న హృద్రోగ నిపుణులు డాక్టర్‌ అవినాష్‌ గుప్తా కూడా కరోనా వ్యాక్సిన్‌ను బహిరంగంగానే తీసుకున్నారు. సామాన్యులకు వ్యాక్సిన్‌ తొందరలోనే అందుబాటులోకి వస్తుందని.. అప్పటివరకు నిర్లక్ష్యం చేయకుండా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని అమెరికాలోని భారత సంతతి వైద్యులు సూచిస్తున్నారు.

ఇదిలాఉంటే, అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫైజర్‌, మోడెర్నా టీకాలను భారీ స్థాయిలో పంపిణీ చేస్తున్నారు. ఈ సంవత్సరం ముగిసే నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5కోట్ల డోసులను అందిస్తామని ఫైజర్‌ ప్రకటించింది. 2021 చివరినాటికి దాదాపు 130కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందించనున్నట్లు పేర్కొంది. ఇక మరో సంస్థ మోడెర్నా మాత్రం ఈ సంవత్సరం ముగింపు నాటికి అమెరికాలో 2కోట్ల డోసులను అందిస్తామని వెల్లడించింది. వచ్చే ఏడాది తొలి అర్థవార్షికంలో మరో 10 నుంచి 20 కోట్లు, అనంతరం మరో పదికోట్ల డోసులను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.

ఇవీ చదవండి..
ఇటలీలో మృత్యుఘోష: కారణాలు ఏంటంటే..!
కొత్తరకం కరోనాతో వణుకుతోన్న దేశాలు..


మరిన్ని