close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పాఠశాలకు కర్నూలు ఎన్‌.ఆర్‌.ఐ ఫౌండేషన్ భారీ విరాళం 

ఓర్వకల్లు: కర్నూలు ఎన్‌.ఆర్‌.ఐ. ఫౌండేషన్‍ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. సహాయ, సేవా కార్యక్రమాల్లో భాగంగా ఓర్వకల్లు మండలంలోని పొదుపు లక్ష్మీ ఐక్య సంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు రూ.10 లక్షలు విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‍ రెడ్డి ద్వారా ఈ విరాళం చెక్కును పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతికి అందజేశారు. బాలభారతిలో చదువుతున్న అనాధ విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకోవాలన్న ఉన్నత ఆశయంతో ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు కర్నూలు ఎన్‌.ఆర్‌.ఐ. ఫౌండేషన్‍ వ్యవస్థాపకులు రవి పొట్లూరి తెలిపారు. ఇక ముందుకూడా విద్యాభివృద్ధికోసం తమ ఫౌండేషన్‍ మరింతగా కృషి చేస్తుందని, ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్ళలో బాల భారతి పాఠశాలకు రూ. 50లక్షల విరాళంగా అందజేయనున్నట్టు తెలిపారు. కరోనా కష్టకాలంలో, లాక్‍డౌన్‍ సమయంలో ఈ ఫౌండేషన్‍ ఆధ్వర్యంలో అనేకచోట్ల లక్షలాది మందికి అన్నదానం చేసిన విషయం తెలిసిందే.

ఈ విరాళం చెక్కు అందజేసిన అనంతరం ఎమ్మెల్యే రాంభూపాల్‍ రెడ్డి మాట్లాడుతూ.. వివిధ దేశాల్లో ఉంటూ సొంత జిల్లా బాగుకోసం పాటుపడుతున్న ఎన్నారైల సేవా నిరతిని, కర్నూలు ఎన్‍.ఆర్‍.ఐ. ఫౌండేషన్‍ను అభినందిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రగతికోసం రవి పొట్లూరి చేస్తున్న సేవలను ప్రశంసించారు. కర్నూలు ఎన్నారై  ఫౌండేషన్‍ ద్వారా  కర్నూలు జిల్లాకు చెందిన ఎన్నారైల సహకారంతో విద్య, వైద్య రంగాల్లో సేవలు అందిస్తామని, నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించే విధంగా శిక్షణా శిబిరాలు, సదస్సులు నిర్వహిస్తామని, జిల్లాకు చెందిన కళాకారులను, మేధావులను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని ఫౌండేషన్‍ సమన్వయకర్త ముప్పా రాజశేఖర్‍ తెలిపారు.


మరిన్ని