close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మ్యాథ్స్‌ మ్యాజిక్‌పై భానుప్రకాశ్‌తో నాట్స్‌ వెబినార్‌

ఎడిసన్ (న్యూజెర్సీ): అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా  మరో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.  వరల్డ్ ఫాస్టెస్ట్‌ హ్యూమన్ క్యాలిక్యులేటర్‌ నీలకంఠ భాను ప్రకాశ్‌తో వెబినార్ నిర్వహించింది. ఎంత పెద్ద లెక్కయినా చిటికెలో చెప్పేసే భాను ప్రకాశ్  మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్ ఆగస్ట్ 2020లో స్వర్ణ పతకం సాధించారు. నాలుగు ప్రపంచ రికార్డులు, 50 లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ సాధించిన ఘనతను సొంతం చేసుకున్నారు. టెడ్ ఎక్స్ స్పీకర్‌గా కూడా అంకెల రహస్యాలను చెప్పిన నీలకంఠ భాను ప్రకాశ్‌ దాదాపు 15 దేశాల్లో వర్క్‌షాపులు నిర్వహించి తన గణిత మేధస్సును ప్రపంచానికి చాటారు. ‘మ్యాథ్స్ మ్యాజిక్ విత్ భాను ప్రకాశ్‌’ పేరుతో నిర్వహించిన ఈ వెబినార్‌కు తెలుగువారి నుంచి విశేష స్పందన లభించింది.  విద్యార్థులు కూడా దీంట్లో చురుగ్గా పాల్గొని క్లిష్టమైన లెక్కల్ని అడగ్గా ఆయన క్షణాల్లోనే సమాధానాలు చెప్పడం అందరినీ అబ్బురపరిచింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్ధుల్లో లెక్కలంటే భయం పొగొట్టి.. అంకెలతో ఆడుకునేలా చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. మ్యాథ్స్ ద్వారా మన మేధస్సుకు ఎలా పదును పెట్టొచ్చు? మానసిక సామర్థ్యాన్ని పెంచుకోవడంలో మ్యాథ్స్‌ ఎలా ఉపయోగపడతాయనే విషయాలను వివరించారు. అలాగే, ప్రవాస భారతీయులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. 

ఈ కార్యక్రమానికి నాట్స్ బోర్డు డైరెక్టర్‌ గంగాధర్ దేసు, మురళీకృష్ణ మేడిచెర్ల సమన్వయకర్తలుగా వ్యవహరించారు. మహిత అప్పసాని,  సిద్ధార్థ జయంతి, సుచరిత జయంతి, భవిష్ గుమ్మడి ఉపయుక్తమైన ప్రశ్నలతో వెబినార్‌ను ఆసక్తికరంగా చేశారు. నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే ఈ వెబినార్‌ నిర్వహణకు సహాయ సహకారాలు అందించారు. భాను ప్రకాశ్‌ నిర్వహిస్తున్న ఎక్స్‌ప్లోరింగ్‌ ఇన్ఫినిటీస్‌ అనే సంస్థ ద్వారా, అమెరికాలో తెలుగువారికి సహాయపడేందుకు తమ వంతు కృషిగా నాట్స్‌ ఎప్పుడూ ముందుంటుందని ఛైర్మన్‌ శ్రీధర్‌ అప్పసాని, అధ్యక్షుడు శేఖర్‌ అన్నే తెలిపారు. ఆన్‌లైన్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు అడిగిన అనేక ప్రశ్నలకు భాను ప్రకాశ్‌ నాట్స్ వరల్డ్.ఆర్గ్ ద్వారా సందేహ నివృత్తి చేస్తారు. ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలను ఈ నెల నాట్స్ అక్షర దీపికలో చూడవచ్చని నిర్వాహకులు తెలిపారు.  

వార్తలు / కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు