close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వచ్చే 4-6 నెలలు కరోనా మరింత తీవ్రం: గేట్స్‌

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వచ్చే నాలుగు నుంచి 6 నెలల్లో మరింత తీవ్రంగా మారే అవకాశముందని, అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ సూచించారు. అయితే నిబంధనలు కచ్చితంగా పాటిస్తే కొవిడ్‌ ముప్పును అరికట్టవచ్చని అన్నారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘విచారకరమైన విషయమేంటంటే.. రానున్న 4-6 నెలల్లో కరోనా ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ అంచనాల మేరకు మరో 2లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందన్నారు. అయితే మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలను కచ్చితంగా పాటిస్తే ఈ మరణాల శాతాన్ని తగ్గించవచ్చు. ఇలాంటి మహమ్మారి గురించి 2015లోనే నేను హెచ్చరించాను. మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పాను. అయితే అమెరికా సహా ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలపై కొవిడ్‌ ప్రభావం నేను అంచనా వేసినదానికంటే తక్కువగానే ఉండటం ఆనందకరం’ అని బిల్‌గేట్స్‌ చెప్పుకొచ్చారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాల కోసం బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ సంపూర్ణ సహకారం అందిస్తోందని గేట్స్‌ ఈ సందర్భంగా తెలిపారు. 

బహిరంగంగానే టీకా తీసుకుంటా..

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ బుష్‌, బరాక్‌ ఒబామాల్లాగే తాను కూడా బహిరంగంగానే టీకా తీసుకుంటానని బిల్‌గేట్స్‌ చెప్పారు. వైద్యపరమైన అవసరాల వల్లే టీకా తీసుకుంటున్నామని, అంతేగానీ ఇందులో సంపన్న, బీద తేడాలేమీ లేవని తెలిపారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ అమెరికన్లు చాలా జాగ్రత్తగా ఉండాలని గేట్స్ సూచించారు. మాస్క్‌ ధరించడం పెద్ద ఖర్చేమీ కాదని, నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు. 

ప్రస్తుతం అమెరికాలో అధికార మార్పిడి జరుగుతున్నందున కరోనా మహమ్మారిపై పోరు కొంచెం సవాలుగా మారిందని గేట్స్ అభిప్రాయపడ్డారు. అయితే కొత్త ప్రభుత్వంలో పరిస్థితులు మారొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్న విషయం తెలిసిందే. పండగల నేపథ్యంలో ప్రజలు నిబంధనలను నిర్లక్ష్యం చేయడంతో వైరస్‌ తీవ్రమైందని నిపుణులు వెల్లడించారు. అమెరికాలో ఇప్పటివరకు దాదాపు 3లక్షల మంది కొవిడ్‌కు బలయ్యారు. కోటి మందికి పైగా కరోనా బారిన పడ్డారు. 

ఇవీ చదవండి..

అమెరికా.. ఊపిరి పీల్చుకో

శ్వేతసౌధ సిబ్బందికి ముందే టీకా!


మరిన్ని