close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గాంధీజీ పక్కనే కూర్చొని మాట్లాడాలనిపించింది

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అనేక అంశాల్లో భారత్‌ది ఓ విజయగాథగా పరిగణించవచ్చని పేర్కొన్నారు. రాజకీయపరమైన వైరుధ్యాలు, వివిధ సాయుధ వేర్పాటువాద ఉద్యమాలు, అవినీతి కుంభకోణాలు ఉన్నప్పటికీ భారత్‌ని ఓ విజయవంతమైన దేశంగా చెప్పుకోవచ్చన్నారు. గాంధీ తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశారని పేర్కొన్నారు. గాంధీ పట్ల తనకున్న అభిమానం, ఆరాధనను ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ పేరిట రాసిన తాజా పుస్తకంలో ఒబామా ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

గాంధీ రచనలే నా భావాలకు స్వరాన్నిచ్చాయి..

‘‘అన్నింటి కంటే ముఖ్యంగా నాకు భారత్‌ పట్ల మక్కువ కలగడానికి కారణం మహత్మా గాంధీ. అబ్రహం లింకన్‌, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, నెల్సన్‌ మండేలాతో పాటు గాంధీ నా ఆలోచనల్ని ఎంతో ప్రభావితం చేశారు. ఓ యువకుడిగా ఆయన రచనలను అధ్యయనం చేస్తుంటే నాలోని లోతైన భావాలకు స్వరం ఇస్తున్నట్లు అనిపించేది. గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహం, సత్యనిష్ఠ, మనస్సాక్షిని కదిలించే అహింసామార్గం, మతపరమైన ఐక్యత, ప్రతిఒక్కరికీ సమాన గౌరవం దక్కేలా రాజకీయ, సామాజిక, ఆర్థికపరమైన ఏర్పాట్లు చేయాలన్న పట్టుదల నాలో ప్రతిధ్వనించేవి. ఆయన మాటల కంటే చేతలు నన్ను ప్రభావితం చేశాయి. జైలుకు వెళ్లడం, జీవితాన్నే పణంగా పెట్టడం, ప్రజా పోరాటాల్లో నిమగ్నమవడం ద్వారా ఆయన సిద్ధాంతాలకు ఆయనే పరీక్ష పెట్టుకునేవారు’’ అంటూ గాంధీ పట్ల తనకున్న అభిమానాన్ని.. ఆయన సిద్ధాంతాల పట్ల ఉన్న అవగాహనను ఒబామా తన పుస్తకంలో పేర్కొన్నారు. 

గాంధీజీ పోరాటం కేవలం భారత్‌కు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా యావత్తు ప్రపంచాన్నే ప్రభావితం చేసిందని ఒబామా గుర్తుచేశారు. అమెరికాలో నల్లజాతీయులు తమ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటానికి దారి చూపిందన్నారు. 2010లో భారత పర్యటనకు వచ్చినప్పుడు ముంబయిలోని గాంధీ నివాసం మణి భవన్‌లో గడిపిన క్షణాల్ని పుస్తకంలో ఒబామా కొంత ఉద్వేగంతో ప్రస్తావించారు. ‘‘చెప్పులు వదిలి మేం లోపలికి ప్రవేశించాం. ఆయన ఉపయోగించిన మంచం, చరఖాలు, పాత కాలపు ఫోన్‌, రాయడానికి ఉపయోగించిన బల్లను చూస్తూ ఉండిపోయాను. ఖాదీ దోతి ధరించి గోధుమ వర్ణంలో ఉన్న ఓ వ్యక్తి కాళ్లు ముడుచుకొని బ్రిటీష్‌ అధికారులకు లేఖ రాస్తున్నట్లు ఊహించుకునే ప్రయత్నం చేశాను. ఆ సమయంలో నాకు ఆయన పక్కన కూర్చొని మాట్లాడాలనే బలమైన కోరిక కలిగింది. అత్యంత తక్కువ వనరులతో ఇంత బలం, స్ఫూర్తి ఎక్కడ నుంచి పొందారని అడగాలనిపించింది. నిరాశ నుంచి ఎలా కోలుకునేవారో తెలుసుకోవాలనిపించింది’’ అంటూ గాంధీ పట్ల ఉన్న ఆరాధనను ఒబామా వ్యక్తపరిచారు.

బాల్యంలో మహాభారతం, రామాయణం వినేవాణ్ని..

తన చిన్నతనంలో రామాయణ, మహాభారత కథలు విన్నట్లు ఒబామా పుస్తకంలో రాసుకొచ్చారు. మలేషియాలో ఉన్నప్పుడు విన్న ఆ పురాణ గాథల వల్లే భారత్‌కు తన మదిలో ఓ ప్రత్యేక స్థానం ఏర్పడిందన్నారు. అధ్యక్ష పదవి చేపట్టక ముందు భారత్‌ను ఎన్నడూ సందర్శించనప్పటికీ.. ఈ దేశంపై ప్రత్యేక గౌరవం ఉండేదన్నారు. మహాభారత, రామాయణ కథలు వినడమో, తూర్పు దేశాల మతవిశ్వాసాలపై ఆసక్తి వల్లనో కాలేజీలో భారత్‌-పాకిస్థాన్‌ మిత్రులు నేర్పిన దాల్‌, కీమా వంటకాల కారణంగానో భారత్‌పై ప్రత్యేక అభిమానం కలిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

భారత ఆర్థిక పురోగతికి మన్మోహన్‌ ఓ చిహ్నం.. 

1991లో విపణి ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశగా చేపట్టిన సంస్కరణలు భారత్‌ను కొత్త పుంతలు తొక్కించాయని ఒబామా అభిప్రాయపడ్డారు. ఆ చర్యలే సాంకేతికాభివృద్ధి, వృద్ధి రేటు పరుగులు, మధ్యతరగతి జనాభా పెరుగుదలకు కారణంగా నిలిచాయని విశ్లేషించారు. భారతదేశ ఆర్థిక పరివర్తను ప్రధాన కారకుడిగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను అభివర్ణించిన ఒబామా.. ఆయన దేశ పురోగతికి ప్రధాన చిహ్నంగా కనిపిస్తారని కొనియాడారు. అత్యంత నిరాదరణకుగురైన సిక్కు మైనారిటీ వర్గానికి చెందిన మన్మోహన్‌.. దేశంలోనే అత్యున్నత పదవి చేపట్టే స్థాయికి ఎదిగారని తెలిపారు. అలాగే, ప్రజారంజక పథకాలతో మభ్యపెట్టకుండా.. ప్రజల జీవనప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా వారి అభిమానాన్ని చూరగొన్నారని ప్రశంసించారు. చిన్న అవినీతి మరక కూడా లేకపోవడం ఆయనకు ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టిందన్నారు. తొలి పరిచయంలోనే అసాధారణ ప్రతిభగల నిరాడంబర వ్యక్తిగా ఆయన కనిపించారని తెలిపారు. 2010లో ఒబామా తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. అప్పటికి ప్రధానిగా మన్మోహన్‌ ఉన్న విషయం తెలిసిందే. 

ఆఫ్‌ ది రికార్డ్‌లో మన్మోహన్‌ తనతో అన్న కొన్ని ఆసక్తికరమైన మాటల్ని ఈ పుస్తకంలో ఒబామా ప్రస్తావించారు. ‘‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌.. అనిశ్చితి నెలకొన్న సమయంలో జాతి, మతపరమైన అంశాలకు సంఘీభావం తెలపడం వల్ల అది ప్రజలపై ఓ మత్తులా పనిచేసే అవకాశం ఉంది. ఇలాంటి స్థితిని భారత్‌లోగానీ, మరే దేశంలోనైనా రాజకీయ నాయకులు స్వప్రయోజనాలకు వాడుకోవడం అంత కష్టమైన అంశం ఏమీ కాదు’’ అని మన్మోహన్‌ తనతో అన్నట్లు ఒబామా గుర్తుచేసుకున్నారు.

వార్తలు / కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.