వైరస్‌ వ్యాప్తిలో వారి తప్పిదమేమీ లేదు:ట్రంప్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
వైరస్‌ వ్యాప్తిలో వారి తప్పిదమేమీ లేదు:ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసియా అమెరికన్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందంటూ అమెరికా ప్రజలకు ట్రంప్‌ పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ను ‘చైనీస్‌ వైరస్‌’గా ఆయన అభివర్ణించిన తర్వాత అనేక దేశాల్లో ఆసియావాసులపై విద్వేష దాడులు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. వైరస్‌ వ్యాప్తిలో వారి తప్పిదమేమీ లేదని.. దాన్ని కట్టడి చేయడం కోసం వారు ఎంతగానో శ్రమిస్తున్నారని గుర్తుచేశారు. అందరం కలిసే దీన్ని ఎదుర్కోవాలని.. అప్పుడే విజయం సాధిస్తామని అభిప్రాయపడ్డారు. 

మరోవైపు అమెరికాలో వైరస్‌ బారిన పడ్డవారిలో సోమవారం 139 మంది మృతిచెందారు. దీంతో అక్కడ మృతుల సంఖ్య 550కి చేరింది. బాధితుల జాబితాలో మరో 10 వేల మంది చేరారు. దీంతో వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 43,700కి పెరిగింది. కీలక ఔషధాలు, మందుల విషయంలో కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో వైరస్‌కి న్యూయార్క్‌ రాష్ట్రం కేంద్రంగా మారింది. సోమవారం అక్కడ 5,085 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 157 మంది మృతిచెందారు. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో వైరస్‌ ప్రభావం తీవ్ర స్థాయిలో పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు.


మరిన్ని