close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ట్రంప్‌నకు చికిత్స పూర్తి‌..ఎప్పుడు బయటకొస్తారంటే?

 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు అందించాల్సిన కొవిడ్‌-19 చికిత్స పూర్తయినట్లు శ్వేతసౌధం వైద్యడు డాక్టర్‌ సియాన్‌ కాన్లే వెల్లడించారు. నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో గడిపిన ఆయన సోమవారం శ్వేతసౌధం చేరుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ట్రంప్‌ అక్కడే చికిత్స కొనసాగించారు. ఇక ఆయన ప్రజల ముందుకు రావడం సురక్షితమేనని వైద్యులు అభిప్రాయపడ్డారు. గత శుక్రవారం నుంచి ఆయనలో ఎటువంటి లక్షణాలు లేవని వెల్లడించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘వైద్యుల సూచన ప్రకారం ఈరోజుతో ట్రంప్‌ కొవిడ్‌ చికిత్స పూర్తి చేసుకున్నారు. శ్వేతసౌధం చేరుకున్న నాటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వ్యాధి లక్షణాలు కనిపించలేదు. చికిత్సకు బాగా స్పందించారు. ఇచ్చిన మందుల వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా కనిపించలేదు. ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యి శనివారంతో 10 రోజులు పూర్తవుతుంది. వైద్య బృందం నిర్వహిస్తున్న అధునాతన పరీక్షల ఆధారంగా.. అధ్యక్షుడు అదే రోజు ప్రజల ముందుకు సురక్షితంగా తిరిగి వస్తారని భావిస్తున్నాను’’ అని కాన్లే ప్రకటనలో స్పష్టం చేశారు.   

ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ట్రంప్‌ అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం ‘చాలా బాగుంది’ అని వ్యాఖ్యానించారు. తనకు అందించిన ఔషధాల్లో రీజెనరాన్‌ యాంటీబాడీ డ్రగ్‌ బాగా పనిచేసిందని ట్రంప్‌ అన్నారు. దాని వల్లే కోలుకున్నానని వ్యాఖ్యానించారు. స్వర్గం నుంచి వచ్చిన బహుమతిగా ఆయన దాన్ని అభివర్ణించడం విశేషం.


మరిన్ని