close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వీసాలపై ఆంక్షలు‌..రూ.7లక్షల కోట్ల నష్టం!

అంచనా వేసిన అమెరికా నిపుణుల బృందం

వాషింగ్టన్‌: ప్రత్యేక నైపుణ్యాల కింద విదేశీ నిపుణులు అమెరికా వచ్చే వీసాలపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రభావం వందల మంది భారతీయులపై పడే అవకాశమున్నట్లు ఇప్పటికే నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ నిర్ణయం వల్ల ఐటీ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లే అవకాశముందని అమెరికా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికన్‌ సంస్థలు దాదాపు రూ.7లక్షల కోట్లు (100 బిలియన్‌ డాలర్లు) నష్టపోయే ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నాయి. డిసెంబర్‌ 31వరకు కొత్తగా హెచ్‌-1బి, ఎల్‌ -1 వీసాల ఆంక్షలపై తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై జూన్‌ 22న ట్రంప్‌ సంతకం చేశారు.

ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయం ఫార్చున్‌-500 కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని.. ఈ నష్టం విలువ దాదాపు రూ.7లక్షల కోట్లకు సమానంగా ఉంటుందని అమెరికాకు చెందిన బ్రోకింగ్స్‌ ఇనిస్టిట్యూట్‌ అనే సంస్థ అంచనా వేసింది. వీసాల నిలిపివేత వల్ల దాదాపు 2లక్షల మంది విదేశీ నిపుణులు అమెరికా రాకుండా పోతారని హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌కు చెందిన పృథ్వీరాజ్‌ చౌదరీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన డేనీ బహాస్‌ర్‌ తాజా నివేదికలో పేర్కొన్నారు. ప్రత్యేక నైపుణ్యమున్న నిపుణుల ద్వారా కంపెనీల ఆదాయం, ఉత్పాదకత, పెట్టుబడి, ఆవిష్కరణల వంటి విషయాల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు రుజువుచేసే అంశాలను ఈ నివేదికలో పొందుపరిచారు. ట్రంప్‌ నిర్ణయం అమెరికా సంస్థలపై ప్రభావం చూపడమే కాకుండా కొవిడ్‌ తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం చేపడుతోన్న చర్యలు తాజా నిర్ణయంతో మందగిస్తాయని తమ నివేదికలో పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, విదేశీ నిపుణులు అమెరికాలో కొన్నాళ్లపాటు పనిచేసేందుకు ‘బి-1’ వీసా వీలు కల్పిస్తుంది. ‘హెచ్‌-1బి’కి ప్రత్యామ్నాయంగా దీన్ని కంపెనీలు భావిస్తుంటాయి. తమ ఉద్యోగులను ఆన్‌సైట్‌ విధుల కోసం తాత్కాలికంగా అమెరికాకు పంపించేందుకు కంపెనీలు ఈ వీసాను ఉపయోగించుకుంటుంటాయి. అయితే- కొన్ని సంస్థలు అమెరికా పౌరులను ఉద్యోగాల నుంచి తొలగించి మరీ బి-1 వీసాల మీద విదేశీ నిపుణులను రప్పించుకుంటున్నాయని.. ఫలితంగా స్థానికులు ఉపాధి కోల్పోతున్నారని తాము గుర్తించినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. తాజాగా ఈ వీసాల జారీ కూడా నిలిపివేయాలని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయించింది.



మరిన్ని