close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమెరికా: ఎన్నికల ముందు వ్యాక్సిన్‌ కష్టమేనా..?

మోడెర్నా సీఈఓ తాజా ప్రకటన

వాషింగ్టన్‌: అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఎన్నికల ముందే వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. అయితే, నవంబర్‌ 3న జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. తాజాగా అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ చేసిన తాజా ప్రకటన దీనికి బలాన్ని చేకూరుస్తోంది.

‘మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్‌ తుది ప్రయోగాలు కొనసాగుతున్నాయి. అయితే, వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కింద నవంబర్‌ 25 కన్నా ముందు ఎలాంటి అనుమతి తీసుకోబోమని మోడెర్నా సీఈఓ స్టీఫేన్‌ బాన్సెల్‌ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. సురక్షితమైందని నిరూపించే సమాచారాన్ని రూపొందించే ప్రక్రియలో నిమగ్నమయ్యామని, వ్యాక్సిన్‌ సమర్థవంతంగా, సురక్షితమైందని భావించిన తర్వాతే ఈ సమాచారాన్ని ఎఫ్‌డీఏకు అందజేస్తాం. దానికి నవంబర్‌ 25 సమయం పట్టొచ్చు’ అని స్టీఫేన్‌ బాన్సెల్‌ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా తుది దశ ప్రయోగాలకు చేరుకున్న వ్యాక్సిన్లలో మోడెర్నా తయారుచేసిన mRNA-1273 వ్యాక్సిన్‌ కూడా ఒకటి. వృద్ధులపై జరిపిన మొదటిదశ ప్రయోగ మధ్యంతర ఫలితాలను మెడెర్నా ఇటీవలే విడుదల చేసింది.

అయితే, తాము తయారుచేసిన వ్యాక్సిన్‌ సమర్థతపై అక్టోబర్‌ నాటికి స్పష్టమైన సమాధానం వస్తుందని మరో కంపెనీ ఫైజర్‌ ఇటీవలే వెల్లడించింది. ఫైజర్‌ సీఈఓ ప్రకటన చేసిన వెంటనే దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వ్యాక్సిన్‌ సమర్థత, సురక్షితమైనది నిరూపించే సమాచారం అక్టోబర్‌లోగా సిద్ధం కాకపోవచ్చని నిపుణులు అనుమానం వ్యక్తంచేశారు. కానీ, ఫైజర్‌ యాజమాన్యం మాత్రం వ్యాక్సిన్‌పై ఆశాజనకంగానే ఉంది.

వ్యాక్సిన్‌ కంపెనీల ప్రతిజ్ఞ..

ఇదిలాఉంటే, అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం ఎన్నికల ముందే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని పదేపదే ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రత్యర్థి జో బైడెన్‌తో జరిగిన ముఖాముఖి చర్చలోనూ ఇదే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పారు. నవంబర్‌ 1నాటికి దీనికి సమాధానం వస్తుందని అన్నారు. ట్రంప్‌ చేస్తోన్న ప్రకటనలతో వ్యాక్సిన్‌ కంపెనీలపై రాజకీయ ఒత్తిడి పెరిగిందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా, యూరప్‌కు చెందిన తొమ్మిది వ్యాక్సిన్‌ కంపెనీలు ఇప్పటికే ప్రతిజ్ఞ చేశాయి. ముఖ్యంగా ఉన్నత స్థాయి నైతిక ప్రమాణాల ప్రకారమే వ్యాక్సిన్‌ ప్రయోగాలు చేపడుతామని ఒప్పందంపై సంతకం చేశాయి. అంతవరకు ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గకుండా ప్రభుత్వ అనుమతులను తీసుకోమని స్పష్టంచేశాయి. వీటిలో మోడెర్నాతోపాటు ఆస్ట్రాజెనికా, బయోఎన్‌టెక్‌, ఫైజర్‌, నొవావాక్స్‌, సఫోని, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌, జాన్సన్‌&జాన్సన్‌, మెర్క్‌ కంపెనీలు ఉన్నాయి.


మరిన్ని