
వాషింగ్టన్: మయన్మార్లో సైనిక కాల్పుల్లో అమాయక పౌరులను బలితీసుకోవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాన్ని సైన్యం తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు.
‘మయన్మార్లో పౌరులపై కాల్పులు భయానకమైన చర్య. అనవసరంగా భద్రతా దళాలు వంద మందికి పైగా పౌరులను పొట్టనబెట్టుకోవడం దారుణం’ అని బైడెన్ వెల్లడించారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ సైతం ఈ సైనిక చర్యను తప్పుబట్టింది. ఇలాంటి హింసాత్మక చర్యలను తాము ఎప్పటికీ అంగీకరించబోమని ఈయూ విదేశాంగ విధాన ప్రతినిధి జోసెఫ్ బోరెల్ ఓ ప్రకటనలో తెలిపారు. ‘మయన్మార్ సైన్యం శనివారం తమ సైనిక దినోత్సవ వేడుకలకు బదులుగా.. భయానక వాతావరణాన్ని సృష్టించి సిగ్గుపడేలా చేసింది’ అని బోరెల్ పేర్కొన్నారు.
మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన పౌరులపై భద్రతాదళాలు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో 114 మంది పౌరులు మృతి చెందినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ సైనిక దుశ్చర్యలను ఐరాస సహా అంతర్జాతీయ సమాజం తప్పుబట్టింది.