
అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆశాభావం
వాషింగ్టన్: ఈ ఏడాది చివరి నాటికి అమెరికాలో మునుపటి మాదిరి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అధ్యక్షుడు జో బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. లక్షల మంది పౌరులకు వ్యాక్సిన్లు ఇవ్వబోతున్నందువల్ల కరోనా ఛాయల నుంచి అప్పటికి బయటపడిపోతామని, గత క్రిస్మస్తో పోలిస్తే ఈ ఏడాది క్రిస్మస్ భిన్నంగా ఉంటుందని చెప్పారు. మిషిగన్‌లోని కలమాజూలో ఉన్న ఫైజర్ వ్యాక్సిన్ల తయారీ కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ‘‘ఏడాది చివరికి కరోనా పూర్తిగా అంతరిస్తుందని నేను మాట ఇవ్వలేను. ఈ వైరస్‌లో కొత్తకొత్త రకాలు వస్తున్నాయి. వ్యాక్సిన్ల ఉత్పాదకత ఎలా ఉంటుందో మనకింకా తెలియదు. అయితే పరిస్థితులు మారుతాయి. సైన్స్ చెబుతున్నదంతా మనం చేస్తున్నాం. ప్రజలూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. వ్యాక్సిన్లను తీసుకురావడం, వాటిని ప్రజలకు అందించడం అంత సులభం కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. ప్రస్తుతం వాతావరణం కూడా టీకాల పంపిణీకి ప్రతిబంధకంగా మారింది. జులై 29 నాటికి 60 కోట్ల డోసులు కావాలని ఆర్డరు చేశాం. అవి వచ్చాక పరిస్థితి మారుతుంది. ఫలానా తేదీ నాటికి కరోనా సంక్షోభం ముగిసిపోతుందని నేను చెప్పలేను. కానీ ఆ రోజు సాధ్యమైంత త్వరగా వచ్చేందుకు చేయాల్సిందంతా చేస్తున్నాం. కేవలం అమెరికా ప్రజలకే నయమైతే సరిపోదు. ప్రపంచమంతా దీనిలో పాల్గొనాలి. ఎందుకంటే మహమ్మారిని దూరంగా ఉంచడానికి ఒక గోడనో, కంచెనో నిర్మించలేం’’ అని బైడెన్ వివరించారు. ‘దాదాపు అమెరికా అంతటికీ వ్యాక్సిన్లు ఇవ్వాలనే ప్రణాళిక నాలుగు వారాల క్రితం వరకు లేదు. నాకంటే ముందున్న అధ్యక్షుడు (డొనాల్డ్ ట్రంప్) తగినన్ని వ్యాక్సిన్లు రప్పించడంలో, వాటిని అందజేసేలా చూడడంలో, ప్రత్యేక కేంద్రాల ఏర్పాటులో వైఫల్యం చెందారు. మేం అధికారంలోకి వచ్చాక అదంతా మారింది. ఇప్పుడు రోజుకు 17 లక్షల మందికి టీకాలు వేయిస్తున్నాం. 100 రోజుల్లో 10 కోట్ల మందికి ఇవ్వాలనే లక్ష్యం కంటే ఇది ఎక్కువ’ అని బైడెన్ చెప్పారు.
పారిస్ ఒప్పందంలోకి అమెరికా.. ప్రపంచానికి శుభ తరుణం : ఐరాస
ఐరాస: వాతావరణ మార్పులకు కళ్లెం వేయడానికి ఉద్దేశించిన పారిస్ ఒప్పందంలోకి అమెరికా మళ్లీ రావడం ప్రపంచానికి శుభ తరుణమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. కీలక భాగస్వామి లేకపోవడం గత నాలుగేళ్లలో లోటుగా ఉండేదని, చరిత్రాత్మక ఒప్పందం కాస్తా బలహీనపడినట్లయిందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చెప్పారు. శుక్రవారం అమెరికా లాంఛనంగా ఐరాస ఒప్పందంలో చేరింది. ఈ సందర్భంగా గుటెరస్ మాట్లాడుతూ అగ్రరాజ్యానికి, ప్రపంచానికి ఇది శుభవార్తేనని చెప్పారు. ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్నందువల్ల.. పారిస్‌లో చేసుకున్న ఒప్పందాన్ని సాకారం చేయడానికి జరగాల్సింది ఎంతో ఉందని అన్నారు. గత ఆరేళ్లలో అన్ని ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోయాయని గుర్తుచేశారు. దేశాలు తమ వైఖరిని మార్చుకోకపోతే ఈ శతాబ్దంలో ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీలకు పైగా పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఏడాది ఎంతో కీలకమైనదన్నారు.
ఉద్గారాల తగ్గింపునకు చైనా, భారత్ నడుం బిగించాలి: జాన్ కెర్రీ
అమెరికా అధ్యక్షుని ప్రత్యేక దూత జాన్‌కెర్రీ మాట్లాడుతూ- గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపు విషయంలో చైనా, భారత్, రష్యా, జపాన్ వంటి దేశాలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ దేశాలు భారీ పరిమాణంలో ఉద్గారాలు వెలువరిస్తున్నాయని చెప్పారు.