
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన మరో మహిళకు బైడెన్ ప్రభుత్వంలో కీలక స్థానం దక్కింది. వాతావరణం, ఇంధన నిపుణురాలైన బిదిశా భట్టాచార్యను అమెరికా ప్రభుత్వంలోని ఫార్మ్ సర్వీస్ ఏజెన్సీకి సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. భారత సంతతికి చెందిన ఈ యువతి గతంలో మూడేళ్ల పాటు భారత్‌లో సౌర శక్తి వాడకాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో పాల్గొన్నారు.
మిన్నెసోటాలోని సెయింట్ ఒలాఫ్ కాలేజీలో డిగ్రీ చేసిన బిదిశ.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. ఇటీవలి వరకు సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ సంస్థలో క్లైమేట్ అండ్ ఎనర్జీ పాలసీ డైరక్టర్‌గా సేవలందించారు. అంతకు ముందు ‘విలేజ్ క్యాపిటల్’ అనే పెట్టుబడుల సంస్థలో ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ క్రమంలో భారత్‌తో సహా మెక్సికో, తూర్పు ఆఫ్రికా తదితర దేశాల ప్రతినిధులతో కూడిన బృందానికి నేతృత్వం వహించారు. భారత్‌లో ‘సింపా నెట్వర్క్స్’ అనే అంకుర సంస్థతో కలసి పల్లె ప్రాంతాల్లో సౌరశక్తి వాడకాన్ని పెంపొందించే కార్యక్రమంలో పాల్గొన్నారు.