Second Wave భారత్‌లో ఓ విషాదమే..!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
Second Wave భారత్‌లో ఓ విషాదమే..!

అమెరికా సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి

వాషింగ్టన్‌: భారత్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణ ఒక విషాదకరమని ప్రవాస భారతీయ వైద్యుడు, అమెరికా సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంక్షోభ సమయంలో దేశాలు పరస్పరం సహాయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.

‘కొవిడ్‌ మనకు ఏదైనా నేర్పించిందంటే.. ఈ మహమ్మారి నుంచి బయటపడాలంటే ఒకరికొకరి సహకారం కావాలనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది. ప్రపంచానికి సరిపడా టీకా సరఫరా ఉందని, ప్రజలకు వైద్య సదుపాయాలతో పాటు పీపీఈ కిట్లు ఉన్నాయని తెలియజేయడంలో ప్రపంచ దేశాలు ముందడుగు వేయాలి. ఎందుకంటే, ప్రపంచంలో ఏ ఒక్క ప్రాంతాల్లో ముప్పు ఉన్నా.. అంతిమంగా ప్రతి దేశానికి ముప్పు ఉన్నట్లే’ అని ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్‌ మూర్తి పేర్కొన్నారు.

‘ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న పరిస్థితులు విషాదంగా ఉన్నాయి. రెండు, అంతకన్నా ఎక్కువ సవాళ్లనే భారత్‌ ఎదుర్కొంటోంది. ఇక వేరియంట్‌ల విషయానికొస్తే B117 వేరియంట్‌ ప్రభావం అత్యధికంగా ఉంది. గతేడాది అమెరికా చవిచూసిన వైరస్‌ కంటే 50శాతం లేదా అంతకంటే ఎక్కువగా వ్యాప్తి ఉంది’ అని వివేక్‌ మూర్తి తెలిపారు. ఇక 617 రకం వేరియంట్‌ తీవ్రత ఎలా ఉందనే విషయాన్ని అర్థం చేసుకునే పనిలో వైద్య నిపుణులు ఉన్నారని తెలిపారు. వైరస్‌ సంక్రమణ తగ్గినట్లయితే అవి మ్యుటేషన్‌ చెందే ఆస్కారం ఉండదని.. అందుచేత వైరస్‌ కట్టడిగా గట్టి చర్యలు ఎంతో అవసరమన్నారు.

భారత్‌లో ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితులను అమెరికా ఎదుర్కోవలసి వస్తే? అన్న ప్రశ్నకు.. అమెరికాలో అలా సంభవించదనే ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అలా జరగడానికి అవకాశం ఉందని.. వాటిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త వహిస్తామని అన్నారు. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత ముమ్మరం చేసే ప్రయత్నాలను కొనసాగిస్తామని వెల్లడించారు.


మరిన్ని