పెగాసస్‌ దుర్వినియోగంపై దర్యాప్తు
పెగాసస్‌ దుర్వినియోగంపై దర్యాప్తు

 లైసెన్సుల జారీపైనా సమీక్ష
 ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసిన ఇజ్రాయెల్‌

జెరూసలెం:పెగాసస్‌ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్పైవేర్‌ దుర్వినియోగమవుతోందంటూ వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. పెగాసస్‌ లైసెన్సుల జారీ ప్రక్రియనూ సమీక్షించనున్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించింది. దర్యాప్తు పూర్తయ్యాక.. అవసరమైతే స్పైవేర్‌ వినియోగంతో పాటు లైసెన్సుల జారీ ప్రక్రియలకు సవరణలు చేపడతామని పేర్కొంది. తాజా కమిటీ ఏర్పాటును పెగాసస్‌ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ స్వాగతించింది.భారత్‌ తీరు ఆందోళనకరం: పాక్‌ పెగాసస్‌ సాయంతో తమ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ సహా పలువురు విదేశీ ప్రముఖులపై భారత్‌ నిఘా పెట్టిందంటూ వస్తున్న వార్తలపై పాకిస్థాన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఐక్యరాజ్య సమితికి విన్నవించింది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ స్వప్రయోజనాల కోసం భారత్‌ విస్తృత స్థాయిలో గూఢచర్యానికి పాల్పడుతోందని పాక్‌ ఆరోపించింది. అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించడం ద్వారా ఈ అంశాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొంది. పాక్‌ విదేశాంగ శాఖ శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Tags :

మరిన్ని