close
నకిలీ వీసాలతో నయవంచన

పర్యాటకులుగా దుబాయికి... అక్కడి నుంచి కువైట్‌కు
21 మంది మహిళలను పంపిన ముఠా
ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు
ఈనాడు - హైదరాబాద్‌

కిలీ వీసాలతో మహిళలను కువైట్‌కు పంపిస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. ముందుగా పర్యాటక వీసాపై దుబాయికి, అక్కడి నుంచి కువైట్‌కు పంపిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటికే 21 మంది మహిళలను పంపి, మరికొందర్ని పంపించేందుకు యత్నిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ గురువారం విలేకరులకు వెల్లడించారు.

తీగ లాగితే శ్రీలంకలో కదిలిన డొంక
నకిలీ వీసాలను సృష్టించి దేశ సరిహద్దులు దాటిస్తున్నారనే సమాచారంతో అప్రమత్తమయ్యారు. కాశీ కుమారి (తూర్పుగోదావరి), బాలం నాగరత్నం (పశ్చిమగోదావరి), మైలబత్తుల స్వప్న (భీమవరం)ల ఫిర్యాదుతో శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారభించారు. ఇక్కడ తీగ లాగితే శ్రీలంకలో డొంక కదిలింది. ప్రధాన సూత్రధారులు పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన రేల్లు కుబేందర్‌ రావు అలియాస్‌ చిన్న(32), తమిళనాడులోని కుంభకోణానికి చెందిన షేక్‌ బషీర్‌ అహ్మద్‌(60), బాలు ప్రసాద్‌లను గురువారం తెల్లవారుజామున ఓ హోటల్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఏజెంట్లు పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలికి చెందిన కానపాల మోహన్‌రావు(41), నిడమర్రుకు చెందిన ఇదేంటి అగస్టీన్‌(40), కొవ్వూరుకు చెందిన కొల్లాటి రామకృష్ణ(35)లను అరెస్టు చేశారు. మరో ఇద్దరు ఏజెంట్లు సునీత, రూతమ్మ పరారీలో ఉన్నారు. 101 మంది మహిళలకు సంబంధించిన వివరాలు నిందితుల దగ్గర ఉన్నాయి.

తనిఖీల్లో పట్టుబడకుండా...
కువైట్‌కు వెళ్లాలంటే ఈసీఆర్‌ (పదో తరగతి చదవని వ్యక్తులు) పాస్‌పోర్టు కలిగి ఉన్న వ్యక్తులు ప్రొటెక్టర్‌ ఆఫ్‌ ఇమ్మిగ్రెంట్స్‌ (పీవోఈ) నుంచి పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ (పీసీసీ) తీసుకోవాలి. అది లేకపోతే కువైట్‌కు అనుమతించరు. ఒకసారి తిరిగొచ్చిన తర్వాత మళ్లీ కువైట్‌కు వెళ్లాలనుకునే మహిళలను ఏజెంట్లు గుర్తించి ఆ సమాచారాన్ని ప్రధాన నిందితుడు రేల్లు కుబేందర్‌రావుకు చేరవేస్తారు. ఆ మహిళల పాస్‌పోర్టులను అందిస్తారు. ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.లక్ష వసూలు చేసి, ఇమ్మిగ్రేషన్‌ తనిఖీల్లో పట్టుపడకుండా ఉండేలా మహిళలను పర్యాటక వీసాపై దుబాయికి పంపించారు. నకిలీ పీసీసీ, వీసా, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలతో అక్కడి నుంచి కువైట్‌కు పంపించారు. అక్కడ లక్ష్మి, శారద, శ్రీను, సారా అనే ఏజెంట్లు ఈ మహిళలకు ఉద్యోగాలు ఇప్పించారు. కమీషన్‌ కింద ఒక్కొక్కరి వద్ద రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేశారు.

ఆరో తరగతి.. వ్యవసాయ కూలీ..
ఆరో తరగతి వరకు చదువుకున్న ప్రధాన నిందితుడు కుబేందర్‌రావు మొదట్లో వ్యవసాయ కూలీగా పనిచేశాడు. ఆ తర్వాత గోనె సంచుల వ్యాపారం చేశాడు. సింగపూర్‌, దక్షిణాఫ్రికాలో 2007 నుంచి 2014 వరకు వెల్డర్‌గా పనిచేశాడు. స్వదేశానికి తిరిగొచ్చి 2016 వరకు గుంటూరు జిల్లా నర్సరావుపేటలో పచ్చళ్ల వ్యాపారం చేశాడు. తర్వాత మకాం హైదరాబాద్‌కు మార్చాడు. కుంభకోణానికి చెందిన ఎన్‌బీఎస్‌ ట్రావెల్స్‌ తరఫున విమాన టిక్కెట్లను బుక్‌ చేసి ప్రయాణికులను విదేశాలకు పంపించేవాడు. ఒక్కో ప్రయాణికుడికి రూ.300 చొప్పున కమీషన్‌ తీసుకునేవాడు. రెండేళ్ల తర్వాత నకిలీ పత్రాలను సృష్టించి విదేశాలకు పంపించడం మొదలు పెట్టాడు. ఎన్‌బీఎస్‌ ట్రావెల్స్‌లో టిక్కెట్‌ ఏజెంట్‌గా పనిచేసే రెండో నిందితుడు షేక్‌ బషీర్‌ అహ్మద్‌ సహకరించాడు. బషీర్‌ చెన్నైలో వస్త్రాలను కొనుగోలు చేసి శ్రీలంకలో విక్రయించేవాడు. ఆ క్రమంలోనే పరిచయమైన శ్రీలంకకు చెందిన కుమార్‌ కువైట్‌ రెవెన్యూ స్టాంపులు, నోటరీ స్టిక్కర్లు, ఇతర స్టాంపులను ఇచ్చేవాడు. బషీర్‌ వాటిని ప్రధాన నిందితుడికిచ్చేవాడు. మూడో నిందితుడు బాలు ప్రసాద్‌ పీసీసీ, ఇతర ధ్రువీకరణ పత్రాలను తయారు చేశాడు. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన శంషాబాద్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకట్‌ రెడ్డి, ఎస్‌ఐ కె.రాజేశ్వర్‌ రెడ్డిలను సీపీ సజ్జనార్‌ ప్రత్యేకంగా అభినందించారు.

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.