close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ నాలుకకు పదునెక్కువ చేతలకు దూకుడెక్కువ

‘భారత్‌ మమ్మల్ని సరిగా చూసుకోదు’’- అహ్మదాబాద్‌ గడ్డపై అడుగుపెట్టడానికి ఐదు రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలివి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్త కాదు. ట్రంప్‌ ఎప్పుడేం మాట్లాడినా అదో సంచలనమే. ఆయనదో విలక్షణ వ్యక్తిత్వం. సుసంపన్నుడు, విజయవంతమైన వ్యాపారవేత్త అయిన ట్రంప్‌ జీవితంలోని విశేషాలపై ప్రత్యేక కథనం..


మాటల్లో తెంపరి చేతల్లో ట్రంపరి

ఆయనదో  విలక్షణ జీవితం
రాజకీయ దృష్టితో చూసేవారికి వివాదాల పుట్ట
విలాసాల కోణంలో చూస్తే రంగేళీ రాజా
వ్యాపారపరంగా విశ్లేషిస్తే విజయవంతమైన రియల్టర్‌
సంపదే కొలమానమైతే  అపర కుబేరుడు
అమెరికా ప్రయోజనాల దగ్గరికి వచ్చేసరికి పక్కా లోకల్‌
నిర్ణయం తీసుకుంటే.. పెను సంచలనమే

ఆయన ఎప్పుడేం మాట్లాడతారో ఎవరికీ తెలియదు. కానీ ప్రతి మాటా తూటాలా పేలుతుంది. వివాదాల కుంపటి రాజేస్తుంది. అది కొందరి గుండెల్లో గునపమై గుచ్చుకుంటే.. ఇంకొందరు దాన్ని తెలివి తక్కువ ప్రేలాపనగా కొట్టిపారేస్తారు.. ఇలాంటి విలక్షణ వ్యక్తిత్వం డొనాల్డ్‌ ట్రంప్‌ సొంతం. అమెరికా 45వ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ట్రంప్‌ స్ఫురద్రూపి. తన హావభావాలు, మాటలు, చేతలతో నిత్యం వార్తల్లో నలుగుతూ ఉంటారు. పలు మీడియా సంస్థల వార్తలకు ఆయన ముడిసరుకు. ట్రంప్‌ భారత పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలపై ప్రత్యేక కథనం..

డొనాల్డ్‌ జాన్‌ ట్రంప్‌ 1946 జూన్‌ 14న న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో జన్మించారు. తండ్రి ఫ్రెడరిక్‌ ట్రంప్‌ ప్రముఖ స్థిరాస్తి వ్యాపారి. తల్లి మేరీ మెక్‌లీడ్‌, స్కాట్లాండ్‌లోని టోంగ్‌కు చెందినవారు. పరోపకారి, సామాజిక కార్యకర్త. వీరి ఐదుగురు సంతానంలో డొనాల్డ్‌ ట్రంప్‌ నాలుగో వ్యక్తి. చిన్నప్పటి నుంచీ చురుగ్గా ఉండే ట్రంప్‌ను ఆయన తండ్రి న్యూయార్క్‌ మిలిటరీ అకాడమీలో చేర్పించారు. తర్వాత ఫోర్దమ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో చదువుకున్నారు. 1968లో అర్థశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు.


ముగ్గురు భార్యలు, ఐదుగురు సంతానం

1. ఇవానా ట్రంప్‌: న్యూయార్క్‌ ఫ్యాషన్‌ మోడల్‌ ఇవానా ట్రంప్‌ను 1977లో ట్రంప్‌ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం.. డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌, ఇవాంక, ఎరిక్‌. విభేదాలతో 1992లో ట్రంప్‌, ఇవానాలు విడిపోయారు.
2. మార్లా మేపిల్స్‌: 1993లో నటి మార్లా మేపిల్స్‌ను ట్రంప్‌ రెండో వివాహం చేసుకున్నారు. వీరికి టిఫానీ అనే కుమార్తె. 1999లో 20 లక్షల డాలర్లు భరణంగా చెల్లించి మేపిల్స్‌ నుంచి ట్రంప్‌ విడాకులు తీసుకున్నారు.
3. మెలనియా: స్లొవేనియా మాజీ మోడల్‌, తనకన్నా 23 ఏళ్లు చిన్న అయిన మెలనియాను 2005లో ట్రంప్‌ మూడో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెతోనే ట్రంప్‌ కలిసి ఉంటున్నారు. వీరికి బారెన్‌ విలియం అనే కుమారుడు.
ట్రంప్‌ తనయులు డొనాల్డ్‌ జూనియర్‌, ఎరిక్‌, కుమార్తె ఇవాంకలు ట్రంప్‌ ఆర్గనైజేషన్‌కు ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షులు. తండ్రి వ్యాపారాల్ని తనయులు చూస్తుంటారు. ఇవాంక మాత్రం అధ్యక్షుడికి సహాయకారిగా వ్యవహరిస్తారు. ఇవాంక భర్త జేర్డ్‌ కుష్నర్‌ కూడా ట్రంప్‌కు సలహాదారు. 


విజయవంతమైన  వ్యాపారవేత్త

చదువులు పూర్తయిన తర్వాత తన తండ్రి ఫ్రెడరిక్‌ బాటలోనే.. ట్రంప్‌ స్థిరాస్తి వ్యాపారాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. అమెరికాతో పాటు, మరికొన్ని దేశాల్లో అంచెలంచెలుగా విస్తరించారు. భారత్‌లోని పుణెలోనూ ట్రంప్‌నకు స్థిరాస్తి వెంచర్లున్నాయి. ఆయన వ్యాపార సామ్రాజ్యంలో - ‘ద ట్రంప్‌ ఆర్గనైజేషన్‌, ట్రంప్‌ టవర్‌, అట్లాంటిక్‌ సిటీలో కాసినోలు, ద అప్రెంటిస్‌(ఎన్‌బీసీ), మిస్‌యూనివర్స్‌ లాంటి టీవీ ఫ్రాంచైజీలు ముఖ్యమైనవి. జావిట్స్‌ సెంటర్‌, న్యూయార్క్‌లోని గ్రాండ్‌ హయత్‌ లాంటి అతిపెద్ద హోటళ్ల వ్యాపారంలోనూ ఆయనకు భాగస్వామ్యం ఉంది.
ఆస్తులు: ఫ్లోరిడాలో అతిపెద్ద గోల్ఫ్‌కోర్స్‌, పామ్‌బీచ్‌లో ఓ ఎస్టేట్‌, బోయింగ్‌ 757 విమానం, ఎస్‌-76 హెలికాప్టర్‌, విలాసవంతమైన నౌక, బంగారంతో చేసిన బైక్‌. ట్రంప్‌ తన పేరిట ఓ యూనివర్సిటీనీ స్థాపించారు. ట్రంప్‌ ఆస్తుల విలువ 310 కోట్ల డాలర్లు అని ఫోర్బ్స్‌ లెక్కగట్టింది. 870 కోట్ల డాలర్ల దాకా ఉండొచ్చని ఇంకొందరు చెబుతుంటారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎలా ఎదగాలో చెబుతూ.. ‘ఆర్ట్‌ ఆఫ్‌ ది డీల్‌’ పేరుతో ఆయనో పుస్తకం రాశారు. ట్రంప్‌ కంపెనీలపై పలు కేసులు కూడా ఉన్నాయి.


విలాసాల  గతం

అధ్యక్షుడు కాకముందు ట్రంప్‌ కాసినోలకు వెళ్లి జూదమాడేవారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ పోటీల్లో పందేలు కాసేవారు. రియాలిటీ టీవీ పర్సనాలిటీగా ఎందరో మహిళల మనసులు దోచుకున్నారు. సినీతారలు, మోడళ్లను బహిరంగ ప్రదేశాల్లోనే ముద్దాడుతూ తాకేవారని, పలువురు మహిళలతో    శారీరక సంబంధాలను నెరిపారని తీవ్ర స్థాయి ఆరోపణలు ఎదుర్కొన్నారు.     2019 జూన్‌ దాకా ట్రంప్‌పై మొత్తం 16 మంది మహిళలు అత్యాచార ఆరోపణలు చేశారు.


అనేక సార్లు పార్టీలు మారారు

ట్రంప్‌ 1987లో రిపబ్లికన్‌ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. రెండేళ్లకు స్వతంత్రుడిగా నమోదయ్యారు. 2000లో సంస్కరణల వేదిక పేరిట అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. తర్వాతి సంవత్సరం డెమోక్రటిక్‌ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 2009లో మళ్లీ రిపబ్లికన్‌ పార్టీలోకి వచ్చారు. మధ్యలో మరోసారి స్వతంత్రుడిగా నమోదై, 2012లో తిరిగి రిపబ్లికన్‌గా నమోదుచేసుకుని.. అధ్యక్ష అభ్యర్థి మిట్‌రోమ్నీని బలపరిచారు. అప్పట్నుంచి రిపబ్లికన్‌ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించారు. ‘అమెరికాలోని ఉద్యోగాలు అమెరికన్లకే’ అన్న ‘స్థానిక’ నినాదాన్ని ఎన్నికల్లో బలంగా వినిపించారు. 


అభిశంసన నుంచి బయటపడి..

అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న మూడో అధ్యక్షుడిగానూ ట్రంప్‌ గుర్తుండిపోతారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రష్యా సహకారం తీసుకున్నారని, 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి జో బిదెన్‌ను దెబ్బతీయడానికి ఉక్రెయిన్‌తో చేతులు కలిపి దేశ ద్రోహానికి పాల్పడ్డారనే కారణంపై ఆయనను డెమోక్రాట్ల ప్రాబల్యం కలిగిన ప్రతినిధుల సభ అభిశంసించింది. అయితే ఈ రెండు ఆరోపణలకు సంబంధించి సెనేట్‌ ఆయనకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. 


వివాదాస్పద నిర్ణయాలు.. చర్యలు

ట్రంప్‌ పాలన కాలంలో అనేక నిర్ణయాలు, చర్యలు వివాదాస్పదమయ్యాయి.
* మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం, నిధుల కేటాయింపు.
* 7 ముస్లిం దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం (ఈ నిర్ణయాన్ని కోర్టులు ఆ తర్వాత తప్పుబట్టాయి)
* పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి బయటికి రావడం
* ఒబామా తెచ్చిన ఆరోగ్య చట్టాన్ని నిర్వీర్యం చేయడం
* చైనాతో వాణిజ్య యుద్ధం
* ట్రాన్స్‌ పసిఫిక్‌ భాగస్వామ్యం నుంచి వైదొలగడం
* శత్రుదేశం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌తో రెండుసార్లు భేటీ కావడం
* సిరియాపై దాడుల్ని పునరుద్ధరించడం
* జెరూసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తించడం
* ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలగడం, ఇరాన్‌ సీనియర్‌ సైనిక కమాండర్‌ సులేమానిని చంపించడం
* ఐసిస్‌ అగ్రనేత అల్‌బగ్దాదీ, అల్‌ఖైదా గజ తీవ్రవాది అల్‌రిమిని అంతమొందించడం


- ఈనాడు ప్రత్యేక విభాగం

వార్తలు / కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.