close
నీ కమ్మని కబురు కోసం!

ట్రంప్‌ పర్యటనపై తెలుగురాష్ట్రాల్లో ఆసక్తి
గ్రీన్‌కార్డుతో ముడిపెట్టడంతో ఆందోళన
చాలామందిపై ప్రభావం చూపే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: ట్రంప్‌ భారత పర్యటన నేపథ్యంలో భాగ్యనగరంలో ఎంతో ఆసక్తి నెలకొంది. ఉన్నత చదువులు, ఐటీ కొలువుల కోసం అమెరికాకు పయనమయ్యే ఎంతోమంది యువత ట్రంప్‌ నుంచి మాట కోసం ఎదురు చూస్తున్నారు. మంగళవారం దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో జరిగే వాణిజ్య ఒప్పందాలపై భాగ్యనగరంలో సైతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ట్రంప్‌ నుంచి ఎలాంటి భరోసా దక్కుతుందోనని చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది యువత డాలర్ల కలలు నిజం చేసుకోవాలని భావిస్తుంటారు. చాలామందికి భాగ్యనగరమే వేదిక. ఇక్కడ పలు కోర్సుల్లో శిక్షణ తీసుకొని అమెరికాలో కొలువుల కోసం ప్రయత్నం చేస్తుంటారు. కొందరు తాత్కాలికంగా అక్కడ పనిచేసిన తర్వాత హెచ్‌1బీ వీసాల కోసం ఎదురు చూస్తుంటారు. ఈ వీసాలను పొందడం కష్టంగా మారడంతో ట్రంపు ఉంచి ఏదైనా భరోసా దక్కుతుందా... అని ఎదురు చూస్తున్నారు. 2011లో దరఖాస్తు చేసుకున్న వారికి సైతం హెచ్‌1బీ వీసాలు దక్కక పోవడం వల్ల వారంతా ఆందోళనలో ఉన్నారు.

గ్రీన్‌కార్డు కావాలంటే కష్టమే...
ఇటీవలి కాలంలో అమెరికాలో వలసదారులపై అక్కడ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమల్లోకి తేవాలని నిర్ణయించింది. అమెరికాలో శాశ్వత నివాస హోదా కోరే విదేశీయులెవరూ అక్కడి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై ఆధార పడకుండా నిషేధం విధించనుంది. ఈ క్రమంలో ఇప్పటికే హెచ్‌1బీ వీసాలపై ఉంటూ గ్రీన్‌కార్డు కోసం దీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న వేలమంది భారతీయులపై ఇది ప్రతికూల ప్రభావం చూపనుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటివరకు 11 శాతం నాన్‌ సిటిజన్‌ భారతీయ కుటుంబాలు విద్య, వైద్యం ఇతర సంక్షేమ పథకాలను అక్కడ పొందుతున్నారు. భాగ్యనగరం నుంచి కూడా ఎంతో మంది అక్కడ హెచ్‌1బీ వీసాలపై పనిచేస్తూ గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పర్యటనలో ట్రంప్‌ నుంచి ఏదైనా కమ్మని కబురు వస్తుందని వేయి కళ్లతో చూస్తున్నారు. అంతేకాక ఎంతోమంది వ్యాపార ప్రముఖులు అమెరికాలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అమెరికా ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో కూడా వీరి పాత్ర కీలకమే. అమెరికాలో వ్యాపారాలు చేసే ఎన్‌ఆర్‌ఐల కోసం ఏదైనా ప్రకటన ఉంటుందా అని ఆసక్తి నెలకొంది.


సామాజిక మాధ్యమాల్లో..

ట్రంప్‌ దిల్లీ చేరుకునే దగ్గర నుంచి ప్రతి క్షణం ట్రంపు పర్యటనపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ నడిచింది. కొన్ని సైట్లు ఆన్‌లైన్‌ క్విజ్‌ల్లాంటివి నిర్వహించాయి. ట్రంపు పూర్తి పేరు... ఆయన భార్య పేరు... కుమార్తె పేరు... ఇలా పలు ప్రశ్నలు వేసి నెట్‌జన్ల నుంచి సమాధానాలు రాబెట్టాయి. అంతకు ముందు భారత్‌ను సందర్శించిన అమెరికన్‌ అధ్యక్షుల ఫొటోలను నెట్‌జన్‌లు పంచుకున్నారు. అప్పటి అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ హైదరాబాద్‌ వచ్చిన సందర్భంలో అప్పటి చిత్రాలను చాలామంది ఫేస్‌బుక్‌, ట్విటర్‌లలో పంచుకున్నారు. ట్రంపుతో విందుకు దేశంలోని కొద్దిమంది ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఉండటంతో భాగ్యనగరానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. ఆ విషయాన్ని కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ట్రంపు కుమార్తె గతేడాది భాగ్యనగరాన్ని సందర్శించారు. ఇప్పుడు తండ్రితో కలిసి మరోసారి ఇండియాకు వచ్చారు. రెండోసారి తన పర్యటన సందర్భంగా ఆమె తన ఫేస్‌బుక్‌ ఖాతాలో భాగ్యనగర పర్యటన గుర్తుకు తెచ్చుకొని అభినందనలు తెలపడం విశేషం.


సంప్రదాయాన్ని మరవకుండా ట్రెండ్‌ను అనుసరిస్తుంది
- స్వరూపారెడ్డి, ఫ్యాషన్‌ డిజైనర్‌

అమెరికా ప్రథమ మహిళ కావడంతో ఆమె ఏది చేసినా దాని ప్రభావం అక్కడి మహిళలతోపాటు ఇతర దేశాల మహిళలపై ఉంటుంది. స్వతహాగా ఫ్యాషన్‌ డిజైనర్‌ కావడంతో ఆమె ట్రెండ్‌ను అనుసరిస్తుంది. అయితే సంప్రదాయాన్ని మాత్రం మరవకపోవడం ఆమె ప్రత్యేకత అని చెప్పాలి. ప్రస్తుత ఫ్యాషన్‌ ట్రెండ్‌ను అనసరిస్తూ తనకు సౌకర్యవంతంగా ఉండే దస్తులపట్ల ఆమె ఆసక్తి చూపుతోంది. సౌకర్యవంతమైన దుస్తులు వేసుకోవడానికి వయసుతో సంబంధం లేదని చెప్పకనే చెబుతోంది. ఫ్యాషన్‌కు ఆమె ఒక ప్రతీకగా చెప్పవచ్చు. సందర్భాన్నిబట్టి రంగు దుస్తులు వేసుకుంటుంది. భారత పర్యటనకు వచ్చిన ఆమె మొదటిరోజు ధరించిన శ్వేతరంగు దస్తులు స్నేహాన్ని, శాంతి భావాన్ని కాంక్షకు నిదర్శనంగా చెప్పవచ్చు. కొంతకాలంగా ఆమె ధరిస్తున్న దుస్తులను పరిశీలిస్తే ఆమె బోల్డ్‌ ఫ్యాషన్‌ వైపు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.


పక్కా పొలిటికల్‌ ఫ్యాషన్‌ ఫాలో అవుతున్నారు
- శిరీషారెడ్డి, ఫ్యాషన్‌ డిజైనర్‌

మెలనియా ట్రంప్‌ పక్కా పొలిటికల్‌ ఫ్యాషన్‌ని ఫాలో అవుతున్నారు. అమెరికా సంస్కృతిని ప్రతిబింబిస్తూ తాను హాజరయ్యే ప్రతి కార్యక్రమానికి ఫార్మల్‌ డ్రెసింగ్‌ ఎక్కువగా ధరిస్తుంది. అక్కడి వాతావరణానికి అనువైన రంగులతో కూడిన వస్త్రాలను ధరించి ట్రెండ్‌ను అనుకరిస్తుంటారు. తాను ఏ దుస్తులు ధరించినా ఆత్మవిశ్వాసం నిండిన మహిళలా కనిపిస్తారు. భారత్‌కు వచ్చిన ఆమె తెల్లటి జంప్‌సూట్‌లో కనిపించారు. ఆ డ్రస్సుకు గ్రీన్‌ అండ్‌ గోల్డ్‌ కాంబినేషన్‌తో ఉన్న సిల్క్‌బెల్ట్‌ నడుముకు కట్టుకున్నారు. పట్టు మన దేశపు సంప్రదాయమే కదా. అలా సందర్భాన్నిబట్టి వారి సంస్కృతి, స్టైలింగ్‌తోపాటు మన సంప్రదాయాన్ని కూడా ప్రతిబింబింపజేశారు. ఇంకా ప్రభావం అనేది వ్యక్తిగత విషయం. చూసిన కళ్లనుబట్టి, అర్థం చేసుకునే వాళ్లనుబట్టి ఉంటుంది. ఎక్కడి వాళ్లు అక్కడ తమకు అనుకూలమైన వస్త్రాలను ధరించడం సహజం. ఆమె సంప్రదాయ ఫ్యాషన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందనే చెప్పాలి.

- మాదాపూర్‌ న్యూస్‌టుడేవార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.