close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమెరికాలో ఒక్కరోజే 10వేల కరోనా కేసులు!

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 10 వేల కరోనా కేసుల నమోదవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం బాధితుల సంఖ్య 54 వేలకు పెరిగింది. మరోవైపు మృతుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. నిన్న 150 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు అక్కడ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 775కు చేరింది. తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్‌ రాష్ట్రంలోనే మంగళవారం 53 మంది మృత్యువాతపడ్డారు. దీంతో అక్కడ మృతిచెందిన వారి సంఖ్య 201కి చేరింది. బాధితుల సంఖ్య 25వేలకు పెరిగింది. న్యూజెర్సీ, కాలిఫోర్నియా, మిషిగాన్‌, ఇల్లినాయిస్‌, ఫ్లోరిడాలోనూ వైరస్‌ తీవ్రత ఎక్కువగానే ఉంది. వైరస్ తొలుత విజృంభించిన వాషింగ్టన్‌లో మంగళవారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

మరోవైపు అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం ఈస్టర్‌ పర్వదినం ఏప్రిల్‌ 12 నాటికి పరిస్థితులు సాధారణ స్థితికి చేరకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందన్నారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. భారీ సంఖ్యలో గుమిగూడడం, సామాజిక దూరం పాటించడం, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వంటి చర్యలు తప్పక పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రజల ఆర్థిక ఇబ్బందులు తొలగించేలా ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి త్వరలో కాంగ్రెస్‌ ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇప్పటివరకు 3,70,000 మందికి పరీక్షలు నిర్వహించామని కరోనా వైరస్‌ కట్టడి కోసం శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యదళం అధికారి తెలిపారు. అయితే ఇంకా పరీక్షలు చేయాల్సిన కేసులు చాలా ఉన్నందున, వైరస్‌ సోకిన వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు.


మరిన్ని