close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శవాల గుట్టల మధ్య భయం భయం..

దయచేసి మమ్మల్ని తీసుకెళ్లండి
ఇటలీలోని హైదరాబాద్‌ విద్యార్థుల ఆవేదన
‘ఈనాడు’కు ఫోన్‌ చేసిన బాధితులు
రక్షించాలని మంత్రి కేటీఆర్‌కు వేడుకోలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ‘భారత్‌ మా దేశం. అక్కడే పుట్టాం.. అక్కడే చస్తాం. దయచేసి మమ్మల్ని తీసుకెళ్లండి. ఈ దేశంలో కరోనా కరాళ నృత్యాన్ని చూస్తుంటే భయమేస్తోంది. ఇక్కడే చనిపోతే మృతదేహాలను కూడా ఇండియాకు తీసుకెళ్లరని వింటుంటేనే బాధగా ఉంది. ఇక్కడ మాకు వైద్య సేవలందించేందుకూ ప్రభుత్వం సుముఖంగా లేదు. మమ్మల్ని రక్షించండి.’

-ఇదీ ఇటలీలో చిక్కుకున్న హైదరాబాదీ విద్యార్థి కొలకూరి ఆదిత్య ఆవేదన ఇది.

 

వారంతా ఎన్నో కలలు కన్నారు.. వాటిని సాకారం చేసుకోడానికని ఉన్నత చదువుల కోసం ఇటలీ వెళ్లారు. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఉన్నట్టుండి కరోనా రక్కసి చుట్టుముట్టింది. చుట్టుపక్కల వేలాదిమందిని బలి తీసుకుంటోంది. ప్రపంచమే ఆ దేశాన్ని చూసి జాలిపడేలా మారిపోయింది. దేశమంతటా భయానక వాతావరణం.. శవాల గుట్టల మధ్య బతుకు వెళ్లదీస్తున్నారు కొందరు భారతీయ విద్యార్థులు. వారిలో తెలుగువారూ ఉన్నారు. బయటికెళ్తే ముంచుకొచ్చే మృత్యువును తలచుకుంటూ నాలుగు గోడల మధ్య బందీ అయ్యారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌కు చెందిన కొలకూరి ఆదిత్య, అన్షుమన్‌ ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అక్కడి పరిస్థితిని వివరిస్తూ ఆవేదన వ్యక్తంచేశారు.

ఎవరికి చెప్పుకోవాలో తెలీడంలేదు..
‘ఈ దేశ ప్రభుత్వం, పౌరుల నిర్లక్ష్యమే నిండా ముంచింది. కరోనా రోజురోజుకీ విస్తరిస్తోంది. వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. మరణాలూ అంతేస్థాయిలో ఉన్నాయి. ఎక్కడికక్కడ మృతదేహాలతో నిండిపోతోంది. వాటి మధ్య రోజూ భయపడుతూ బతకాల్సి వస్తోంది. మా చుట్టుపక్కల ఒక్కొక్కరికీ పాజిటివ్‌ వస్తుంటే భయంగా ఉంది. ఇక్కడ చనిపోతే మృతదేహాలను కూడా పంపరని తెలిసి..ఎవరికీ చెప్పుకోవాలో తెలియక కాలం గడుపుతున్నాం.

మెడికల్‌ కిట్లు సరిపోలేదు..
ఇక్కడ పరిస్థితిని కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. ఇక్కడున్న 250 మంది భారతీయ విద్యార్థుల కోసం మెడికల్‌ కిట్లు పంపించారు. అవి అందరికీ సరిపోలేదు. ఇంకో వందమంది దాకా ఉన్నాం. ఇండియన్‌ ఎంబసీలో నమోదు చేసుకోమని చెప్పారు. అలా చేసినా ఎలాంటి సాయం అందలేదు.

కేటీఆర్‌ సార్‌.. ఆదుకోండి
తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ట్విటర్‌ ద్వారా వేడుకున్నాం. ఇప్పుడు మాకున్న దిక్కు ఆయనే. మమ్మల్ని ఎలాగైనా ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి’ అని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.

Tags :

మరిన్ని