close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమెరికాలో లక్ష దాటిన కరోనా కేసులు..!

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట లేకుండా పోయింది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం నాటికి చైనా, ఇటలీని దాటేసి అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో తొలి స్థానంలో నిలిచిన అమెరికా.. లక్ష మార్క్‌ దాటిన తొలి దేశంగా నేడు రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు ఏ దేశంలోనూ లక్ష కేసులు నమోదైన దాఖలాలు లేవు. అలాగే ఇప్పటివరకు 1500 మంది వైరస్ బారిన పడి మరణించారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ.. మహమ్మారిని మట్టుబెట్టేందుకు పాలకపక్షం అన్ని చర్యలు తీసుకుంటోందని పునరుద్ఘాటించారు. వీలైనంత ఎక్కువ మందికి చికిత్స అందించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

అమల్లోకి డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ యాక్ట్‌...

కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు దేశవ్యాప్తంగా ఆస్పత్రులు నిర్మించాలని సైన్యంలోని ఇంజినీర్ల బృందాన్ని ట్రంప్‌ రంగంలోకి దించారు. ఇప్పటికే అన్ని మార్గాల్ని అన్వేషించి ఆచరణలోకి తెచ్చిన శ్వేతసౌధం.. ఆఖరి అస్త్రాల్లో ఒకటైన డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ యాక్ట్‌ని కూడా తాజాగా అమల్లోకి తెచ్చిందంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో తెలుస్తోంది. అరుదుగా ప్రయోగించే ఈ చట్టం ద్వారా దఖలు పడే అధికారాలతో ప్రముఖ వాహన తయారీ సంస్థ జనరల్‌ మోటార్స్‌ను.. ఆపత్కాలంలో రోగగ్రస్థులకు ఊపిరి పోసే వెంటిలేటర్ల తయారీకి ఆదేశించింది. ఇదే బాటలో ఫిలిప్స్‌, మెడ్‌ట్రోనిక్‌, హామిల్టన్‌, జోల్‌, రెడ్‌మెడ్‌తోనూ ఒప్పందం కుదుర్చుకొంది. రానున్న వారం రోజుల్లో లక్ష యూనిట్లను అందుబాటులోకి తేనున్నామని అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు.

కార్పొరేట్‌ సంస్థల సహకారం..

కరోనా బాధితులకు దేవుళ్లుగా మారిన వైద్య సిబ్బందికి ముఖ రక్షక కవచాలు అందించేందుకు ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ ముందుకువచ్చింది. దేశవ్యాప్తంగా వైద్య సామగ్రి, మందులు పంపిణీ చేసేందుకు తమ వద్ద ఉన్న అతి పెద్ద కార్గో విమానం డ్రీమ్‌ లిఫ్టర్‌ను ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. దాదాపు 63వేల పౌండ్ల బరువు మోయగల మూడు విమానాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ప్రముఖ గ్యాడ్జెట్‌ తయారీ సంస్థ యాపిల్‌ సైతం సీడీసీ, ఫెమా భాగస్వామ్యంతో కొత్త కరోనా వైరస్‌ కట్టడిలో ఉపయోగపడే  కొత్త టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

2 ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన పథకం...

కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు ఘోర పతనాన్ని చవిచూస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా దేశాలు అనేక ఉద్దీపన పథకాల్ని ప్రవేశపెడుతున్నాయి. తాజాగా అమెరికా సైతం అదే దిశగా చర్యలు చేపట్టింది. ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో ఆ ప్రతికూల ప్రభావ తీవ్రత నుంచి సామాన్య ప్రజలు, వ్యాపార వర్గాలకు ఊరట కలిగించేలా 2 ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన పథకాన్ని అమల్లోకి తెచ్చింది. చట్టరూపంలో తెచ్చిన ఈ చరిత్రాత్మక దస్త్రంపై శుక్రవారం ట్రంప్‌ సంతకం చేశారు. దీంతో అక్కడ ఒక్కో కుటుంబానికి దాదాపు 3,400 డాలర్లు అందనున్నాయి. 


మరిన్ని