close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కారులో ఉంచే కరోనా పరీక్ష

న్యూయార్క్‌లో పరిస్థితి దారుణం
‘ఈనాడు’తో ప్రవాస భారతీయ వైద్య దంపతులు పోలవరపు అభిషేక్‌, సౌమిన్య

ఈనాడు, అమరావతి: ‘అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోగ లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేసేందుకూ వసతులు సరిపోవడం లేదు. అందుకే వాళ్లు తమ వాహనంలో ఆసుపత్రి వర్గాలు నిర్దేశించిన ప్రదేశానికి వస్తే కారులో ఉంచే వారి నోటి నుంచి దూదితో స్రావాన్ని తీసుకుని పంపేస్తున్నారు. 2, 3 రోజుల్లో ఏ ఫలితం వచ్చిందనేది తెలియజేస్తున్నారు’ అని న్యూయార్క్‌కు చెందిన ప్రవాస భారతీయ వైద్య దంపతులు పోలవరపు అభిషేక్‌, సౌమిన్య తెలిపారు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన సౌమిన్య న్యూజెర్సీలో సూక్ష్మ క్రిమికారక వ్యాధుల వైద్యురాలిగా, ఒంగోలుకు చెందిన అభిషేక్‌ న్యూయార్క్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. అక్కడి పరిస్థితులను  ‘ఈనాడు’కు వివరించారు.
‘న్యూయార్క్‌లో కరోనా రోగులను కేవలం జనరల్‌ మెడిసిన్‌ వైద్యులే కాకుండా కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, అనస్తీషియా.. ఇలా అన్ని విభాగాల వైద్యులు చూసేలా బాధ్యతలను అప్పగిస్తున్నారు. న్యూజెర్సీలో ప్రస్తుతానికి 11వేల కేసులుండగా, న్యూయార్క్‌లో 50వేల కేసులు నమోదయ్యాయి. ప్రయాణాలు చేసిన వారు, డ్రైవర్లు, ఫుడ్‌ డెలివరీ చేసినవారు.. ఇలా ఇటువంటి వారిలో ఎక్కువగా పాజిటివ్‌ వస్తోంది. న్యూయార్క్‌లో వేయి పడకల చొప్పున ఐదారు చోట్ల పెద్ద హాల్స్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత జావిడ్‌ సెంటర్‌లో వేయి పడకలతో ఓ కేంద్రాన్ని అత్యవసరంగా సిద్ధం చేశారు’ అని సౌమిన్య తెలిపారు.

తొలుత పాజిటివ్‌ వచ్చిన వారితో కాంటాక్టులో ఉన్న వారందరికీ పరీక్షలు చేయాలని భావించారు. కేసులు పెరిగిపోవడంతో ఇపుడు కేవలం రోగ లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేస్తున్నారు’ అని వివరించారు.‘వచ్చే 3 వారాల్లో న్యూయార్క్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు. కరోనా రోగులకు వైద్యం అందించేందుకు లక్ష పడకలు అవసరమవుతాయని భావిస్తున్నారు. ఐసీయూలోనే 40వేల వెంటిలేటర్లతో కూడిన పడకలు అవసరమని అంచనా. దాదాపు అన్ని ఆసుపత్రుల్లో సందర్శకులను నిలిపేశారు. కరోనా రోగులకే చికిత్స అందిస్తున్నారు.’ అని అభిషేక్‌ వెల్లడించారు.

Tags :

మరిన్ని