close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అగ్రరాజ్యానికి అతి పెద్ద విపత్తు

తీవ్రతను అంచనా వేయలేకపోవడమే కారణం
బాధిత భారతీయులకు ప్రాణాపాయం లేదు
వైద్యుల కొరత... పరికరాలూ చాలవు
అమెరికాలో భారత ఫిజీషియన్స్‌ సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ సురేశ్‌రెడ్డి

ఈనాడు హైదరాబాద్‌: ‘కరోనా తీవ్రతను అమెరికా ప్రభుత్వం సరిగా అంచనా వేయలేకపోయింది. ఫలితంగా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడం కష్టంగా మారింది. ఇక్కడ పరిస్థితి భయంకరంగా ఉంది. అమెరికాకు అతి పెద్ద విపత్తు ఇదే’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఇండియా (ఎఎపిఐ) అధ్యక్షుడు డాక్టర్‌ సురేశ్‌రెడ్డి. సుమారు లక్ష మంది వైద్యులు సభ్యులుగా గల ఈ సంఘం అమెరికాలో కరోనా నుంచి బయటపడడానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అనేక ఆసుపత్రుల్లో భారతీయులు, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకు చెందిన వైద్యులు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. అక్కడి ప్రస్తుత పరిస్థితిని డాక్టర్‌ సురేశ్‌రెడ్డి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధితో పంచుకున్నారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

వైరస్‌ విజృంభణ తీవ్రం
అమెరికాలో కరోనా విజృంభణ తీవ్రంగా ఉంది. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. ప్రభుత్వం ఇంతటి తీవ్రతను అంచనా వేయలేకపోయింది. దీంతో వైద్యులకు సూట్లు, మాస్కులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. అమెరికా అన్నిటికీ చైనా మీద ఆధారపడేది. మాస్కులు, ఇతర పరికరాలన్నీ అక్కడి నుంచే వచ్చేవి. ప్రస్తుతం వీటికి కొరత ఉంది. అమెరికాలో అతి పెద్ద విపత్తు ఇదే. దీన్ని ఎదుర్కోవడంలో ఇప్పటికీ వెనుకబడే ఉన్నాం.

మృతుల సంఖ్య లక్షకు చేరుతుందేమో!
న్యూయార్కులో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అక్కడ అందరికీ పరీక్షలు చేయడం మానేశారు. లక్షణాలున్న వారికి మాత్రమే చేస్తున్నారు. దూరం పాటించడం, మాస్కులు ధరించడం లాంటివి చాలా ఆలస్యంగా ప్రారంభించారు. అమెరికాలో నాలుగు వేల మంది చనిపోవడం అంటే చాలా పెద్ద విషయం. అలాంటిది లక్ష మంది వరకు మరణించవచ్చని అంచనా. వ్యాధి అదుపులోకి రావడానికి మూడు, నాలుగు వారాలు పట్టొచ్చు. ఈ సమయంలోనే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఎంత అన్నది అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది. కొవిడ్‌ బాధితులను చూసే ఆసుపత్రులు మాత్రమే రద్దీగా ఉన్నాయి. మిగిలినవి ఖాళీగా ఉన్నాయి.

తెలుగు వైద్యుల సేవాపథం
ఇక్కడ పని చేసే ప్రతి ఆరుగురు డాక్టర్లలో ఒకరు భారతీయుడే. ఇందులోనూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువ. చాలా మంది వైద్యులు కరోనా బాధితులకు వైద్య సేవలందించడంలో ముందున్నారు. ఒకవైపు భయంగా ఉన్నా, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది దీన్ని సవాలుగా తీసుకుని పనిచేస్తున్నారు. భారతీయులు... తెలుగువారిలో కూడా చాలా మందికి పాజిటివ్‌ వచ్చింది. అయితే వారికి ప్రాణాపాయం లేదు. మేం హెల్ప్‌లైన్‌ పెట్టి వైద్య సేవలందిస్తున్నాం. ఇందులో 300 నుంచి 500 మంది డాక్టర్లు పాల్గొంటున్నారు. భారతీయులకు అవసరమైన సహాయం చేస్తున్నాం. ఆరోగ్య బీమా లేని వారికి వైద్యసేవలు అందిస్తున్నాం.

డాక్టర్లు దొరకడంలేదు
రానున్న రెండు, మూడు వారాల్లో మరింత తీవ్రంగా ఉంటుంది. నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. రోజువారీ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. న్యూయార్కు, చికాగో, అట్లాంటా, కాలిఫోర్నియా ఇలా అనేక ప్రదేశాల్లో డాక్టర్లు దొరకడం లేదు. రెసిడెన్సీ కోసం ప్రయత్నిస్తున్న వారిని అసిస్టెంట్‌ డాక్టర్స్‌గా తీసుకోమని విజ్ఞప్తి చేశాం. కొన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. ఇదొక సానుకూల అంశం.

యువత కూడా బాధితులే
బాధితుల్లో 30-40 శాతం వరకు 50 ఏళ్ల లోపు వారే. చైనాలో యువతకు కరోనా సోకలేదు. అమెరికాలో యుక్తవయస్కులకూ వ్యాపించింది. రెండు, మూడు వారాల కిందట వైరస్‌ సోకిన వారు ఇప్పుడు ఆసుపత్రులకు వస్తున్నారు. మలేరియా కోసం వినియోగించే మందు తీసుకోమని అమెరికా ప్రభుత్వం చెప్పింది. ఇది వాడుతుంటే, రోగి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటోంది. మధుమేహం, రక్తపోటు, ఉబ్బసం లేని వాళ్లకు కూడా కరోనా సోకితే తీవ్రమైన సమస్యలు వస్తున్నాయి. ఈ వైరస్‌కు ఉన్నది అనుబంధ వైద్యం (సపోర్టివ్‌ ట్రీట్‌మెంట్‌) మాత్రమే.

Tags :

మరిన్ని