close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఐరోపాలో మృతులు 30 వేలు

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే క్లిష్టమైన సంక్షోభం: ఐరాస
రాబోయే రెండు వారాలు అమెరికాకు చాలా కష్టం: ట్రంప్‌

మాద్రీద్‌, వాషింగ్టన్‌: కరోనా కొత్త వైరస్‌ (కొవిడ్‌-19) ధాటికి ఐరోపా విలవిల్లాడుతోంది. ఇప్పటి వరకు ఒక్క ఐరోపాలోనే 30 వేల మందికి పైగా ప్రజలు ఈ వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఖండంలో ప్రతి నలుగురు మృతుల్లో ముగ్గురు ఇటలీ-స్పెయిన్‌లకు చెందినవారే. స్పెయిన్‌లో ఒక్కరోజులోనే 864 మంది చనిపోయారు. వైరస్‌కు కళ్లెం వేసే చర్యల్లో భాగంగా ప్రపంచంలో దాదాపు సగం జనాభా లాక్‌డౌన్‌లో ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సంక్షోభం ఇదేనని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. అనూహ్య పరిస్థితులు నెలకొనడం.. గత కొన్ని దశాబ్దాల శాంతికి ముప్పుగా పరిణమించిందని ఐరాస సెక్రటరీ జనరల్‌ గుటెర్రస్‌ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా మాంద్యం నెలకొనే ముప్పు ఉందన్నారు. అమెరికాలో కరోనా నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులతో లక్షల మంది తమ ఇళ్ల అద్దెలైనా చెల్లించలేని స్థితిలో ఉన్నారు. వారితో ఇతర బిల్లులను ఎలా చెల్లించాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాబోయే రెండు వారాలూ అత్యంత క్లిష్టమైనవని, బాధాకరమైనవని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గంభీర వదనంతో పేర్కొన్నారు. కఠోరమైన రోజుల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే పక్షంలో అమెరికాలో లక్ష నుంచి రెండు లక్షల మంది ప్రాణాలను ఈ వైరస్‌ బలి తీసుకోవచ్చని శ్వేతసౌధం అంచనా వేసిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు గమనార్హం. ఒక్క న్యూయార్క్‌లోనే మృతుల సంఖ్య వెయ్యి దాటింది. అమెరికా మొత్తం మీద మరణాల సంఖ్య 4000 దాటింది. ఇది 9/11 ఉగ్రదాడుల ప్రాణనష్టం కంటే ఎక్కువ.

బయటపడని కేసులు 1,541
బీజింగ్‌: కరోనా వైరస్‌ ఉన్నా లక్షణాలు బయటపడని కేసులను 1,541 గుర్తించినట్లు కొవిడ్‌-19 విజృంభణ అనంతరం చైనా తొలిసారిగా బుధవారం ప్రకటించింది. దీంతో మళ్లీ వైరస్‌ జడలు విప్పుతుందా అనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ మేరకు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) బుధవారం ఓ ప్రకటన విడుదలచేసింది.

Tags :

మరిన్ని