close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అనిశ్చితిలో ఉన్నాం

కష్టమైనా ఇంట్లోనే ఉంటున్నాం
ఉపాధి భయమూ వెన్నాడుతోంది
ఈనాడు.నెట్‌తో ప్రవాస భారతీయుల ఆవేదన

ఉద్యోగం పోయింది. వీసా పొడిగిస్తారో లేదో తెలియకుంది. మున్ముందు కొత్త ఉద్యోగాలు దొరకడంపై అనుమానంగా ఉంది. నేను అమెరికాలో ఉండగా కుటుంబం ఇండియాలో ఆగిపోయింది. నేను భారత్‌లోనే చిక్కుకున్నా... భార్యాపిల్లలు అమెరికాలో ఉండిపోయారు. మరోవైపు మేముంటున్న దేశాల్లో కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి. మరణాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం నిత్యావసరాలు అందుతున్నా మున్ముందు ఎలా ఉంటుందో తెలియదు. ఇవన్నీ ప్రవాస భారతీయుల కష్టాలు. తమ సమస్యలు, అనుభవాలను ఈనాడు.నెట్‌ ద్వారా పంచుకోవాలని పిలుపునివ్వగా పలువురు స్పందించి, తమ దీన పరిస్థితిని వివరించారు. అదేసమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సోదర తెలుగువారికి సూచిస్తున్నారు. ఇవీ వివరాలు...


అమెరికాలో మరణ మృదంగం
-అగినాటి శ్రీనివాస్‌, అమెరికా

మాది అనంతపురంలోని ధర్మవరం మండలం ఎలుకుంట్ల. షికాగోలో రెండేళ్లుగా ఉంటున్నాం. ఇక్కడ పరిస్థితి భయానకంగా ఉంది. వందల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. ఏప్రిల్‌ 30 వరకు ఇళ్ల నుంచే పనిచేయాలనే ఆదేశాలున్నాయి. ఇంకా పొడిగిస్తారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు లాక్‌డౌన్‌ను పక్కాగా అనుసరించడం లేదని మా బంధువులు చెబుతున్నారు. దయచేసి ప్రభుత్వాలు ఏమి చెబితే అదే చేయండి. కరోనా ఎంత భయంకరమైందో ఇక్కడ మేం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం.


మా ప్రణాళికలు నాశనం
-ప్రసన్న కుమార్‌, జార్జియా

మాది శ్రీకాకుళం. 3నెలల క్రితమే అమెరికాలోని ఆల్ఫారెట్ట(జార్జియా)లో పని చేయడానికి వచ్చా. అన్నీ సమకూర్చుకున్నాక కుటుంబాన్ని తీసుకెళ్లాలని అనుకున్నా. కరోనా మా ప్రణాళికలను నాశనం చేసింది. ఇప్పుడు ఇంట్లో ఉండే పనిచేస్తున్నా. బాధితుల సంఖ్య లక్ష దాటగానే దుకాణాలన్నీ మూతపడ్డాయి. నిత్యావసరాలకు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే మరుసటి రోజు వెళ్లి తెచ్చుకోవడానికి అనుమతి ఇస్తున్నారు.


ఆరోగ్య భద్రతపై ఆందోళనగా ఉంది
-బీవీ రమేష్‌బాబు, అమెరికా

మాది ఏపీలోని మార్కాపురం. షికాగోలో హెచ్‌-1బీ వీసాపై పనిచేస్తున్నా. వీసా గడువు పొడిగింపునకు ఫిబ్రవరి 23న ఇండియా వచ్చా. అనుమతి లభించింది. మార్చి 8న తిరిగి వెళ్లాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో వీసా అందలేదు. లాక్‌డౌన్‌ వచ్చింది. నా భార్య, చిన్నారి కూతురు అమెరికాలోనే ఉండిపోయారు. నిత్యావసరాల కోసం ఇద్దరూ బయటికి వెళ్లాల్సి వస్తోంది. వారి ఆరోగ్య భద్రతపై భయంగా ఉంది. నాకేమో ఇంటి నుంచి పనిచేయడానికీ అనుమతి లభించలేదు. 


నా భార్య ఉద్యోగం పోయింది
-నర్ర శ్రీనివాస్‌, ఆస్ట్రేలియా

మేం ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో ఉంటున్నాం. ప్రపంచమంతా ఉన్న పరిస్థితే ఇక్కడా ఉంది. నేను ఇంటి నుంచే పనిచేస్తున్నా... నా భార్య ఉద్యోగం కోల్పోయింది. చాలామంది స్థానికులదీ ఇదే పరిస్థితి. ఆంక్షలు ఎత్తేసిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. 


ఇంకా ఆఫీసులకు వెళుతున్నాం
-సాయిక్రిష్ణ బాలాజీ, యూఏఈ

అరబ్‌ ఎమిరెట్లలో ఒకటైన అజ్మన్‌లో సివిల్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నా. కరోనా కట్టడికి ఇక్కడ ఏర్పాట్లు కనిపించడం లేదు. దుకాణాలు, మాల్స్‌ తెరిచే ఉంటున్నాయి. మేం ఆఫీసుల్లోనే పనిచేస్తున్నాం. రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు రాకపోకలపై ఆంక్షలు విధించారు. అప్పుడు వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా పనులు జరుగుతున్నాయి. భయంగానే ఉంది.


బయటికి వస్తే జరిమానా
-మహ్మద్‌ఫయాజ్‌, సౌదీ అరేబియా

సౌదీ అరేబియాలో 55 అంతకంటే ఎక్కువ వయసున్న వారిని ఉద్యోగాలకు రావద్దని స్పష్టం చేశారు. ఎవరైనా బయటికి వస్తే జరిమానాలు విధిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలపై ప్రభుత్వం కఠినంగా ఉంటోంది. అన్ని ప్రైవేటు కంపెనీలు ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించేశాయి.


కువైట్‌లో కట్టుదిట్టం
-అబ్దుల్‌ రహమాన్‌ షేక్‌, కువైట్‌

కువైట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నా. తొలి కరోనా కేసు ఫిబ్రవరి 24న నమోదైంది. ఇది చాలా చిన్న దేశం కావడంతో ఎంతో భయపడ్డాం. వెంటనే ప్రభుత్వం విమానాశ్రయాల్లో ధర్మల్‌ స్కానింగ్‌తోపాటు ఫిబ్రవరిలో దేశానికి వచ్చిన అందరికీ పరీక్షలు చేసింది. క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటుకు దేశంలోని 3, 5 నక్షత్రాల హోటళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రజలు ప్రభుత్వం ఏమి చెబితే అది చేస్తున్నారు.

Tags :

మరిన్ని