ఆయుర్దాతలకు ప్రాణగండం
close
ఆయుర్దాతలకు ప్రాణగండం

అమెరికాలో భారతీయ వైద్యులకు వైరస్‌

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌తో విలవిల్లాడుతున్న అమెరికాలో ప్రవాస భారతీయ వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారు. బాధితులకు చికిత్స అందించే క్రమంలో పలువురు ఈ మహమ్మారి బారినపడ్డారు. తాము సేవలందిస్తున్న చోటే రోగులుగా చేరారు. కొందరు ప్రాణాలనూ కోల్పోయారు. ఈ ఉదంతాలు ఎక్కువగా న్యూయార్క్‌, న్యూజెర్సీలలో చోటుచేసుకున్నారు.
న్యూయార్క్‌లో ఆసుపత్రిలో పనిచేస్తుండగా వైద్యురాలు మాధవి(61)కి కరోనా సోకింది. బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆమె కన్నుమూశారు.
ఈ నెల మొదట్లో మరో వైద్యుడు న్యూజెర్సీలోని ఆసుపత్రిలో చికిత్స చేస్తుండగా కరోనా రోగి వాంతి చేసుకున్నాడు. అది వైద్యుడి ముఖాన్ని తాకడంతో కరోనా సోకింది. సహచర వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు.
భారత అమెరికన్‌ నెఫ్రాలజిస్టు ప్రియా ఖన్నా(43).. న్యూజెర్సీలో ఇటీవల మరణించారు. ఆమె తండ్రి, జనరల్‌ సర్జన్‌ సత్యేంద్ర ఖన్నా(78)కూ కరోనా సోకగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
కొవిడ్‌-19 బారినపడిన భారత సంతతికి చెందిన అమెరికన్‌ వైద్యుల సంఘం(ఏఏపీఐ) మాజీ అధ్యక్షుడు అజయ్‌ లోధా పరిస్థితి విషమంగా ఉంది. ఏఏపీఐ మరో మాజీ అధ్యక్షుడు గౌతమ్‌ సమద్దర్‌ భార్య, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు అంజనా ఆరోగ్యమూ క్షీణిస్తోంది. మరో వైద్యుడు సునీల్‌ మెహ్రా పరిస్థితీ ఇలాగే ఉంది.

హాట్‌ స్పాట్లలోనూ సేవలు
‘కనీసం పది మంది ప్రవాస భారతీయ వైద్యులకు కరోనా సోకి అనారోగ్యం పాలయ్యారు’ అని ఏఏపీఐ కార్యదర్శి రవి కొల్లి పేర్కొన్నారు. తమ సంఘంలో 80 వేల మంది సభ్యులున్నారని, హాట్‌స్పాట్లలోనూ వారు విస్తృతంగా సేవలందిస్తున్నారని సంఘం ఉపాధ్యక్షురాలు అనుపమ గొట్టిముక్కల వివరించారు. భారత వైద్య నిపుణుల అంకితభావం అమోఘమని భారత అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి కొనియాడారు. దిగ్గజ పరుగుల వీరుడు మిల్కాసింగ్‌ కుమార్తె, వైద్యురాలు మోనా మిల్కాసింగ్‌ న్యూయార్క్‌లో కొవిడ్‌ బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

Tags :

మరిన్ని