close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమెరికా సంచలన నిర్ణయం

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తితో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం అమెరికా సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. తమ దేశంలోకి వలసల్ని(ఇమ్మిగ్రేషన్‌) తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ ప్రకటన చేశారు. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘‘ఓ అదృశ్య శక్తి(కరోనా వైరస్‌) దాడి నేపథ్యంలో అమెరికా పౌరుల ఉద్యోగాలను రక్షించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందువల్లే అమెరికాలోకి వలసల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై నేను సంతకం చేయబోతున్నాను’’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఇది కార్యరూపం దాలిస్తే తదుపరి ఉత్తర్వుల వెలువడే వరకు విదేశీయులెవరూ అమెరికాలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉండదు. అమెరికాకు వలస వెళ్లే వారిలో భారతీయులు, చైనావాసులే అత్యధికం. అక్కడ పనిచేస్తున్న వారిలోనూ ఈ ఉభయ దేశ వాసులదే సింహభాగం. ట్రంప్‌ తాజా నిర్ణయంతో భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 

కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కరోనాతో 42,560 మంది మరణించారు. అలాగే పాజిటివ్‌ కేసుల సంఖ్య దాదాపు ఎనిమిది లక్షలకు చేరువైంది. దీంతో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు గత కొన్ని రోజులుగా అమలు చేస్తున్న షట్‌డౌన్‌ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. అక్కడి అధికారిక లెక్కల ప్రకారం 2.2 కోట్ల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా అనేక మంది అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా పౌరులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసకుంటున్నట్లు ట్రంప్‌ స్పష్టం చేశారు. 

మహమ్మారి భయంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతటి సంక్షోభ పరిస్థితుల ఎదుర్కోవడం ఇదే తొలిసారని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్నామని ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ సహా అనేక అంతర్జాతీయ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తరుణంలో ట్రంప్‌ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది. 

ఇవీ చదవండి..
చైనాకు నిపుణుల బృందం

మాస్కో విలవిల

Tags :

మరిన్ని