ప్రపంచవ్యాప్త కేసులు పాతిక లక్షలు
close
ప్రపంచవ్యాప్త కేసులు పాతిక లక్షలు

బ్రిటన్‌లో తాజాగా 828 మంది మృతి

న్యూయార్క్‌, లండన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతోంది. ఉద్ధృతి కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా.. వైరస్‌ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. ఈ మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య మంగళవారంతో పాతిక లక్షలు దాటింది. మరోవైపు, కొవిడ్‌ సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టుకునే ప్రయత్నాలను పలు దేశాలు ముమ్మరం చేస్తున్నాయి.  అమెరికాలో పలు రాష్ట్రాలు నిషేధాజ్ఞల సడలింపు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. ఐరోపాలోనూ పలు దేశాలు ఇదే పనిలో ఉన్నాయి.
అమెరికాలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. జార్జియాలో ఆంక్షలను క్రమంగా ఎత్తివేయనున్నట్లు గవర్నర్‌ బ్రియాన్‌ కెంప్‌ ప్రకటించారు.టెక్సాస్‌లో ఈ వారం నుంచే పార్కులను తెరుస్తామని, స్టోర్లు పనిచేసేందుకు అనుమతిస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి.
* న్యూయార్క్‌లో ఆసియన్‌- అమెరికన్లపై వేధింపులు/వివక్ష ఘటనలను పరిశీలించేందుకు కొవిడ్‌-19ప్రతిస్పందన బృందాన్నిఏర్పాటుచేస్తున్నట్లు నగర మానవ హక్కుల కమిషన్‌ ప్రకటించింది.

ఇతర దేశాలపై ఆధారపడొద్దు: ట్రంప్‌
ఇతర దేశాలపై అమెరికా ఆధారపడే పరిస్థితి తలెత్తకూడదని దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు.కరోనా విజృంభణతో సరఫరా గొలుసుకు అడ్డంకులు ఏర్పడటంతోపాటు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సహా పలు ఔషధాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి రావడంతో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనాను జయించే చికిత్సల అభివృద్ధికి 72రకాల ప్రయోగాలుజరుగుతున్నాయన్నారు.

5జీ సెల్‌ టవర్లపై దాడులు
కరోనా సంక్షోభానికి అత్యాధునిక 5జీ మొబైల్‌ నెట్‌వర్కే కారణమంటూ ఐరోపాలో దాడులు చోటుచేసుకుంటుండటం కలకలం సృష్టిస్తోంది. బ్రిటన్‌లో ఈ నెల్లో ‘5జీ’కి సంబంధించిన దాదాపు 50 సెల్‌ టవర్లకు దుండగులు నిప్పంటించారు. నెదర్లాండ్స్‌, ఐర్లాండ్‌, సైప్రస్‌, బెల్జియంల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
* బ్రిటన్‌లో తాజాగా 828 మరణాలు చోటుచేసుకున్నాయి. మొత్తం మృతుల సంఖ్య 17,337కు పెరిగింది. బ్రిటన్‌లో సిక్కు వర్గం నుంచి తొలి అత్యవసర వైద్య సేవల నిపుణుడిగా గుర్తింపు పొందిన మన్‌జీత్‌ సింగ్‌ రియత్‌ కరోనా బారినపడి కన్నుమూశారు.
* సింగపూర్‌లో కొత్తగా 1,111 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఎక్కువమంది విదేశీయులే.
* కరోనా వైరస్‌ పుట్టుకపై స్వతంత్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరిగేలా అన్ని దేశాలు కృషి చేయాలని ఆస్ట్రేలియా పిలుపునిచ్చింది. మహమ్మారి నియంత్రణలో డబ్ల్యూహెచ్‌వో పనితీరును విశ్లేషించాల్సిన ఆవశ్యకతనూ నొక్కిచెప్పింది.
* పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోనున్నారు. ప్రముఖ మానవతావాది ఫైసల్‌ గతవారం ఇమ్రాన్‌ను కలిశారు. ఫైసల్‌ కరోనా బారిన పడినట్లు తాజాగా నిర్ధారణ కావడంతో ఇమ్రాన్‌ కూడా వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోనున్నారు.

Tags :

మరిన్ని