మనోళ్లకు ఇబ్బందికరమే
close
మనోళ్లకు ఇబ్బందికరమే

ట్రంప్‌ ట్వీట్‌తో భారతీయుల్లో కలవరం
ఉద్యోగావకాశాలు తగ్గుతాయని నిపుణుల అంచనా

ఈనాడు, హైదరాబాద్‌: ట్రంప్‌ ప్రకటన చట్టమైతే... భారతీయులకు అమెరికాలో ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్యాటకులు మినహా అన్ని రకాల ఇతర వీసాదారులపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని అమెరికా వ్యవహారాల అధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. ఇది తెలుగు రాష్ట్రాల ఉద్యోగార్థులకూ ఇబ్బందికరమేనని అమెరికా వీసా వ్యవహారాల నిపుణుడు ఉడుముల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఇక్కడి నుంచి అమెరికావెళ్లే వారిలో ఎఫ్‌-1 (విద్యార్థులు), హెచ్‌1బి (ఉద్యోగార్థులు) అధికం. ఎఫ్‌-1 వీసాపై అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థుల్లో చాలా మంది చేసే ఉద్యోగాలు చట్ట వ్యతిరేకమైనా, ప్రభుత్వం అంతగా పట్టించుకునేది కాదు. వీటిపై ఇప్పుడు నిఘా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

హెచ్‌1బి వారిపై సానుకూలత చూపండి
అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల హెచ్‌1బీ వీసాల గడువు పొడిగింపు విషయంలో సానుకూలత చూపాలని అమెరికాను భారత ప్రభుత్వం కోరింది. వారు వీసా గడువు తీరిన తరువాత మాతృదేశానికి వచ్చి స్టాంపింగ్‌ వేయించుకోవాలి. లాక్‌డౌన్‌ కారణంగా ఈ గడువును సుమారు 8 నెలల పాటు పొడిగించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం అంగీకరించింది. మరోవైపు లాక్‌డౌన్‌కు ముందే స్టాంపింగ్‌ కోసం ఇక్కడికి వచ్చి చిక్కుకుపోయిన వారి ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల వారు కూడా వందల సంఖ్యలో ఉన్నట్లు అంచనా. ఇలాంటి వారి విషయంలోనూ సానుకూలంగా స్పందించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు.


కొత్తగా వచ్చేవారికే నష్టం
- అమెరికాలో తెలుగు న్యాయవాది జెనితారెడ్డి

పెద్దపల్లి, న్యూస్‌టుడే: కరోనా కల్లోలంతో సతమతమవుతున్న అమెరికాలోకి వలసలను నిరోధించేందుకు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ గత రాత్రి చేసిన ట్వీట్‌ భారతీయుల్లో కలవరం రేపుతోంది. దీని ప్రభావంపై అమెరికాలో ఇమిగ్రేషన్‌ న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న జెనితారెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వలసలను నిరోధించేందుకే..
ట్రంప్‌ ట్వీట్‌లో ఎలాంటి స్పష్టత లేదు. ప్రభుత్వ ఉత్తర్వులు మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ ఉత్తర్వులతో అమెరికాలో ఉంటున్న విదేశీయులకు ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులుండవు. దేశంలోకి వలసలను నిరోధించేందుకే ఈ ఉత్తర్వులను ఉద్దేశించే అవకాశముంది. ఇప్పటికే వీసా లభించి ఇంకా అమెరికాకు రాని వారిని సైతం ఈ ఉత్తర్వులు నిలువరించే అవకాశముంది. కొత్తగా ఉద్యోగాలు, చదువు కోసం వచ్చేవారికి అమెరికాలో ప్రవేశించడం అసాధ్యమవుతుంది. ఈ ఉత్తర్వులు ఎంతకాలం అమలులో ఉంటాయి? ఏయే అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

దీర్ఘకాలంలో అమెరికాకే ఇబ్బంది
వలసల నిరోధానికి అమెరికా ఎలాంటి చట్టాలను రూపొందించినా దీర్ఘకాలంలో ఆ దేశానికే నష్టం కలిగే అవకాశముంది. అమెరికాలో వివిధ రంగాల్లో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఐటీతో పాటు వైద్యం, ఇతర ప్రధాన రంగాల్లో మన దేశంతో పాటు చైనాకు చెందిన వారిదే పైచేయి. కెనడా, ఆస్ట్రేలియాకు చెందిన వారు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వలస చట్టాలను సమీక్షించడం, వలసలను నిరోధించడం వల్ల ఐటీ, వైద్య రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది కరోనా కంటే తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఈ కారణంగా వలసలను పూర్తిస్థాయిలో నిరోధించేందుకు గత పాలకులెవరూ సాహసాలు చేయలేదు. వలసలను ప్రోత్సహించిన దాఖలాలే అధికంగా ఉన్నాయి. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తరువాత తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పలు దేశాల నుంచి వలసలను నిరోధించేందుకు పలు చర్యలు తీసుకున్నారు. ఈ కారణంగానే ప్రస్తుతం అధ్యక్షుడు చేసిన ట్వీట్‌ ఎలాంటి చట్టాన్ని తీసుకువస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags :

మరిన్ని