ముందుంది మహోత్పాతం!
close
ముందుంది మహోత్పాతం!

అమెరికాలో కరోనా మరింత విజృంభించే ప్రమాదం
శీతాకాలంలో ఫ్లూ కూడా తోడయ్యే అవకాశం
సీడీసీ డైరెక్టర్‌ రెడ్‌ఫీల్డ్‌ అంచనా
ఆంక్షల సడలింపు బాటలో పలు దేశాలు

బెర్లిన్‌, వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ మున్ముందు మరింత ఎక్కువగా కల్లోలం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న శీతాకాలంలో తమ దేశంలో వైరస్‌ ఇంకా విజృంభించే ముప్పుందని.. దానికి ఫ్లూ కూడా తోడై పరిస్థితులు భయానకంగా మారొచ్చని అమెరికాలోని ‘వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) డైరెక్టర్‌ రాబర్డ్‌ రెడ్‌ఫీల్డ్‌ తాజాగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతున్న వేళ ఆయన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

మరోవైపు, అమెరికాలో నిషేధాజ్ఞల సడలింపు అంశం పూర్తిగా రాజకీయ రంగును పులుముకుంటోంది. దేశాధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాల మేరకు రిపబ్లికన్‌ గవర్నర్లు ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నారని, డెమోక్రాట్ల నేతృత్వంలోని రాష్ట్రాల్లో మాత్రం గవర్నర్లు నిషేధాజ్ఞలను మరింత కఠినతరం చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ను సడలించాలంటూ ట్రంప్‌ మద్దతుదారులు నిరసనలు కొనసాగిస్తున్నారు. వైరస్‌ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు జన సంచారంపై ఆంక్షల సడలింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి.
అమెరికాలో కొవిడ్‌ బాధితుల సంఖ్య 8.2 లక్షలు దాటింది. ఆ దేశంలో ఇప్పటికే 46 వేలమందికిపైగా ప్రాణాలను మహమ్మారి బలి తీసుకుంది. రానున్న శీతాకాలంలో కరోనాతోపాటు ఫ్లూ ఏకకాలంలో విజృంభించే ముప్పుందని రెడ్‌ఫీల్డ్‌ తెలిపారు. ఫలితంగా దేశ ఆరోగ్య వ్యవస్థపై ఊహకందని స్థాయిలో ప్రతికూల ప్రభావం పడొచ్చని పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదేందుకుగాను దాదాపు 50 వేల కోట్ల డాలర్ల ప్యాకేజీకి సెనేట్‌ తాజాగా ఆమోదం తెలిపింది. ఆస్పత్రుల్లో మెరుగైన వసతుల కల్పనకు, కరోనా నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేసేందుకు కూడా ఈ నిధులను ఉపయోగించనున్నారు. తమకు వ్యక్తిగత రక్షణ పరికరాలను సమకూర్చాలని కోరుతూ శ్వేతసౌధం వద్ద పలువురు నర్సులు తాజాగా నిరసనకు దిగారు.

అంతకంటే ముందు నుంచే విజృంభణ
అమెరికాలో కరోనా విజృంభణ గతంలో ఊహించినదానికంటే చాలా ముందుగానే మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఆ దేశంలో ఈ వైరస్‌ దెబ్బకు తొలి మరణం ఈ ఏడాది ఫిబ్రవరి 29న వాషింగ్టన్‌లో నమోదైందని ఇన్నాళ్లూ భావించారు. అయితే- కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కౌంటీలో అదే నెల 6, 17 తేదీల్లో మరణించిన ఇద్దరు వ్యక్తులకు కూడా కరోనా ఉందని తాజాగా అధికార వర్గాలు ప్రకటించాయి.

సింగపూర్‌లో ఉద్ధృతి
కొవిడ్‌ కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తుండటంతో జర్మనీ, డెన్మార్క్‌, ఆస్ట్రియా, ఫ్రాన్స్‌ సహా పలు దేశాలు నిషేధాజ్ఞలను క్రమంగా సడలిస్తున్నాయి. తొలినాళ్లలో వైరస్‌ను బాగానే కట్టడి చేసినట్టు కనిపించిన సింగపూర్‌లో ప్రస్తుతం కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జూన్‌ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఆ దేశం యోచిస్తోంది. దక్షిణాఫ్రికాలో కరోనా వచ్చే 2-3 ఏళ్లలో దశలవారీగా విజృంభించి.. 45 వేలమంది ప్రాణాలను బలి తీసుకునే ముప్పుందని నిపుణుల కమిటీ ఒకటి అంచనా వేసింది. ఇప్పటివరకు ఆ దేశంలో 3 వేలమందికిపైగా వైరస్‌ బారిన పడ్డారు. 58 మంది మరణించారు.

టీకా క్లినికల్‌ ప్రయోగాలు ప్రారంభించనున్న జర్మనీ
జర్మనీలో కరోనా నివారణ టీకాల క్లినికల్‌ ప్రయోగాలకు రంగం సిద్ధమైంది. ఆ దేశానికి చెందిన బయోంటెక్‌, అమెరికా సంస్థ ఫిజెర్‌తో కలిసి అభివృద్ధి చేసిన ఆర్‌ఎన్‌యే టీకాను మానవ వాలంటీర్లపై ప్రయోగించేందుకు అనుమతులు లభించాయి.
* కొవిడ్‌ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో వలసదారులు ఉద్యోగాలు కోల్పోయి.. వారు స్వదేశాల్లోని కుటుంబసభ్యులకు పంపే డబ్బు గణనీయంగా తగ్గిపోతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2019లో ఇలా వలసదారులు మొత్తంగా 55 వేల కోట్ల డాలర్లను స్వదేశాలకు పంపించారని, ఈ ఏడాది అది 44 వేల కోట్ల డాలర్లకు పరిమితం కావొచ్చని పేర్కొంది.
* రంజాన్‌ మాసంలో మసీదులను తెరిచి ఉంచాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌, మతపెద్దలకు వైద్యులు విజ్ఞప్తి చేశారు.

Tags :

మరిన్ని