అమెరికాలో ఉపశమన ఛాయలు
close
అమెరికాలో ఉపశమన ఛాయలు

క్రమంగా తగ్గుముఖం పడుతున్న మరణాలు
బ్రిటన్‌లో ఇప్పటివరకు 492 మంది భారత సంతతి వ్యక్తుల మృతి
సింగపూర్‌లో 1,600 మందికిపైగా భారతీయులకు కరోనా

వాషింగ్టన్‌, బెర్లిన్‌: కరోనా మహమ్మారి దెబ్బకు ఇన్నాళ్లూ చిగురుటాకులా వణికిన అగ్రరాజ్యం అమెరికాలో క్రమంగా ఉపశమన ఛాయలు కనిపిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తి పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాకపోయినా.. గత వారంతో పోలిస్తే కొత్త కేసులు, మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. కొవిడ్‌ తీవ్రతకు ఆ దేశంలో తాజాగా 24 గంటల వ్యవధిలో (మంగళవారం-బుధవారం మధ్య) 1,738 మంది మృత్యువాతపడ్డారు. అంతకుముందు 24 గంటల్లో 2,500కుపైగా మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం. వైరస్‌ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టడంతో దేశ ఆర్థిక వ్యవస్థలో తిరిగి జవసత్వాలను నింపే ప్రక్రియలకు ఆయా రాష్ట్రాలు శ్రీకారం చుడుతున్నాయి. నిషేధాజ్ఞలను సడలించి వ్యాపార కార్యకలాపాలను పునఃప్రారంభించే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఇళ్లలోనే ఉండాలంటూ ప్రజలకు ఇన్నాళ్లూ విజ్ఞప్తి చేసిన ట్రంప్‌ ప్రభుత్వం.. తిరిగి సాధారణ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రస్తుతం వారిని కోరుతోంది. అదే సమయంలో భౌతికదూరం వంటి ప్రమాణాలను పాటించాల్సిందేనని స్పష్టం చేస్తోంది. అమెరికాలో ఇప్పటివరకు 8.5 లక్షల మందికిపైగా వైరస్‌ బారిన పడ్డారు. మృతుల సంఖ్య 50 వేలకు చేరువైంది. కరోనా కట్టడికి తాము అనుసరిస్తున్న వ్యూహాలు సత్ఫలితాలనిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. శ్వేతసౌధంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోందన్నారు.‘‘బోస్టన్‌లో కేసులు తగ్గుతున్నాయి. షికాగోలో కొత్త కేసుల సంఖ్య స్థిరంగా ఉంటోంది. డెట్రాయిట్‌లో వైరస్‌ ఉద్ధృతి గరిష్ఠ స్థాయిని దాటేసింది’’ అని అన్నారు. పలు రాష్ట్రాల్లో త్వరలోనే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మాపై దాడి జరిగింది
కరోనా సంక్షోభాన్ని అమెరికాపై ‘దాడి’గా ట్రంప్‌ అభివర్ణించారు. ‘‘మాపై దాడి జరిగింది. ఇదేదో సాధారణ ఫ్లూ వంటిది కాదు. కచ్చితంగా దాడే. 1917 తర్వాత ఇంతటి విపత్కర పరిస్థితులను ఎవరూ చూడలేదు’’ అని అన్నారు. లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీల ఫలితంగా అమెరికాపై రుణభారం పెరుగుతుండటంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.

మరింత పెరిగిన నిరుద్యోగుల సంఖ్య
అమెరికాలో నిరుద్యోగులకు కల్పించే ప్రయోజనాల కోసం తాజాగా మరో 44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కొవిడ్‌ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అగ్రరాజ్యంలో ఉద్యోగాలు కోల్పోయినవారి సంఖ్య 2.6 కోట్లకు పెరిగినట్లయింది.

ఆ విద్యార్థులకు గ్రాంట్ల నిరాకరణ
కరోనా సంక్షోభం నేపథ్యంలో విద్యార్థులకు సహాయం చేసేందుకు ఉద్దేశించిన 600 కోట్ల డాలర్ల ప్యాకేజీపై అమెరికా విద్యాశాఖ మంత్రి బెట్సీ డెవోస్‌ తాజా మార్గదర్శకాలు జారీ చేశారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన విదేశీ విద్యార్థులకు ఈ సహాయం అందించకుండా నిషేధం విధించారు. అగ్రరాజ్యంలోకి అక్రమంగా ప్రవేశించిన విద్యార్థుల సంఖ్య 4 లక్షలకు పైగా ఉంటుందని అంచనా.

న్యూయార్క్‌లో రెండు పిల్లులకు కరోనా
న్యూయార్క్‌ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన రెండు పిల్లులకు కరోనా సోకింది. అమెరికాలో పెంపుడు జంతువులు కొవిడ్‌ బారిన పడినట్లు తేలడం ఇదే తొలిసారి.

బ్రిటన్‌లో మరో 616 మరణాలు
బ్రిటన్‌లో కొవిడ్‌ బారిన పడి ఇప్పటివరకు 492 మంది భారత సంతతి వ్యక్తులు మరణించినట్లు ఆస్పత్రులు విడుదల చేసిన తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. మరోవైపు, బ్రిటన్‌లో కరోనా దెబ్బకు కొత్తగా 616 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 18,738కి పెరిగింది.

సింగపూర్‌లో భారతీయ కార్మికుడి మృతి
భారత్‌కు చెందిన 46 ఏళ్ల కార్మికుడు కరోనాతో బాధపడుతూ సింగపూర్‌లోని ఓ ఆసుపత్రి మెట్ల వద్ద మృతిచెందాడు. స్థానిక పోలీసులు గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే అతని పేరును మాత్రం వారు చెప్పలేదు. ఖూ టెక్‌ ప్యుయెట్‌ ఆసుపత్రిలో మెట్ల వద్ద మృతదేహం పడి ఉందని, శరీరంపై గాయాలున్నాయని తెలిపారు. సింగపూర్‌లో వరుసగా 4వ రోజూ వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. గురువారం 1,037 మందిలో వైరస్‌ నిర్ధారణ జరిగింది. తాజా బాధితుల్లో 21 మంది మాత్రమే సింగపూర్‌ పౌరులు. మిగతావారంతా విదేశీ కార్మికులు. అందులో భారతీయులు కూడా ఉన్నారు.

రంజాన్‌ వేళ ఇండోనేసియా జాగ్రత్తలు
కరోనా విజృంభణ నేపథ్యంలో జన సంచారంపై నిషేధాజ్ఞలను వచ్చే నెల 22 వరకు పొడిగిస్తున్నట్లు ఇండోనేసియా ప్రకటించింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఆ దేశం.. రంజాన్‌ మాసానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. మానవాళికి ఉమ్మడి శత్రువైన వైరస్‌పై దృష్టి పెట్టాలని ముస్లింలను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరెస్‌ కోరారు.
* చైనాలో కొవిడ్‌ లక్షణాలేవీ కనిపించనప్పటికీ పాజిటివ్‌గా తేలుతున్నవారి(అసింప్టమాటిక్‌) సంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇలాంటి కేసులు 27 నమోదయ్యాయి. అసింప్టమాటిక్‌ కేసుల మొత్తం సంఖ్య 984కు పెరిగింది. ఇవి కాకుండా చైనాలో కొత్తగా 10 సాధారణ కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

లెక్కల్లోకి రాని మరణాలెన్నో..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ దెబ్బకు మరణించిన వారి సంఖ్య అధికారిక గణాంకాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉండొచ్చని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’, ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ అంచనా వేశాయి. వేల సంఖ్యలో మరణాలు లెక్కల్లోకి రాలేదని పేర్కొన్నాయి. అమెరికా, బ్రిటన్‌ సహా మొత్తం 11 దేశాల్లో మరణాలను ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ విశ్లేషించింది.

Tags :

మరిన్ని