కిమ్ ఆరోగ్యంపై వచ్చిన వార్తలన్నీ తప్పు: ట్రంప్
close
కిమ్ ఆరోగ్యంపై వచ్చిన వార్తలన్నీ తప్పు: ట్రంప్

సీఎన్‌ఎన్‌పై మండిపడ్డ అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అనారోగ్యంపై వచ్చిన వార్తలు తప్పుడు సమాచారంగా భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. ఈ సందర్భంగా తనకు వ్యతిరేకంగా వ్యవహరించే సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థపై మండిపడ్డారు. తప్పుడు నివేదికల ఆధారంగా కిమ్‌ ఆరోగ్యంపై సీఎన్‌ఎన్‌ కథనాలు ప్రసారం చేసిందని ట్రంప్‌ ఆరోపించారు. గురువారం శ్వేతసౌధంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్‌ కిమ్‌ ఆరోగ్యంపై వచ్చిన వార్తలు నిజం కావని కొట్టిపారేశారు. కిమ్‌ బాగున్నారనే సమాచారమైనా ఉత్తర కొరియా నుంచి వచ్చిందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఆయన నిరాకరించారు. ఈ నేపథ్యంలో సీఎన్‌ఎన్‌ను లక్ష్యంగా చేసుకొని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. 

కాగా, సోమవారం ఓ గుర్తు తెలియని అమెరికా అధికారిని ఉటంకిస్తూ సీఎన్‌ఎన్‌ కిమ్‌జోంగ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఓ కథనాన్ని ప్రచురించింది. శస్త్రచికిత్స అనంతరం ఉత్తర కొరియా అధ్యక్షుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని పేర్కొంది. అలాగే ఆయన ఆరోగ్యానికి సంబంధించి వాషింగ్టన్‌లో నిఘా కొనసాగుతోందని చెప్పింది. అంతకుముందు, ఉత్తర కొరియా ఫిరాయింపుదార్ల భాగస్వామ్యంతో నడుస్తున్న ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ డైలీ ఎన్‌కేలో తొలుత కిమ్‌ అనారోగ్యంపై వార్తలు వచ్చాయి. ఆయన గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్నారని, ప్రస్తుతం ఉత్తర ఫియాంగన్‌లోని ఓ విల్లాలో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపింది. కిమ్‌కు ఊబకాయంతో పాటు పొగతాగే అలవాటున్నందున ఆయనకు అత్యవసర శస్త్రచికిత్స అవసరమైందని వెల్లడించింది. మరోవైపు కిమ్‌ ఆరోగ్య పరిస్థితిపై దక్షిణ కొరియా ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలిపింది.

ఇవీ చదవండి:

అమెరికాలో ఉపశమన ఛాయలు

శృంగారం ద్వారా కరోనా వ్యాప్తి చెందదా!


మరిన్ని