అమెరికాలో 50 వేలు దాటిన మృతులు
close
అమెరికాలో 50 వేలు దాటిన మృతులు

24 గంటల్లో 3,172 మరణాలు
అగ్రరాజ్యంలో మళ్లీ కరోనా విజృంభణ
9 లక్షలు దాటిన కేసులు
టీకా అభివృద్ధికి చేరువలో ఉన్నామన్న ట్రంప్‌

వాషింగ్టన్‌, బీజింగ్‌: అగ్రరాజ్యం అమెరికాలో కాస్త తగ్గినట్లే కనిపించిన కరోనా ఉద్ధృతి మళ్లీ పెరిగింది. తాజాగా ఆ దేశంలో 24 గంటల వ్యవధిలో 3,172 మంది ప్రాణాలను మహమ్మారి బలి తీసుకుంది. అంతకుముందు 24 గంటల్లో కేవలం 1,738 మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం. తాజా మరణాలతో కలిపి, అమెరికాలో కొవిడ్‌ దెబ్బకు అసువులు బాసిన వారి సంఖ్య 50 వేలు దాటింది. దేశవ్యాప్తంగా వైరస్‌ బాధితుల సంఖ్య 9 లక్షలు దాటింది.

ఇళ్ల నుంచి బయటకు రాకుండా అమెరికాలో 95% జనాభాపై వచ్చే నెల 1 వరకు నిషేధాజ్ఞలు ఉన్నాయి. వాటిని మరికొన్ని రోజులు పొడిగించే దిశగా దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంకేతాలిచ్చారు. కొవిడ్‌-19 టీకా అభివృద్ధికి అమెరికా అత్యంత సమీపంగా వచ్చేసిందని అన్నారు.
కరోనాపై తమ పోరులో మే నెల నిర్ణయాత్మకంగా మారనుందని న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌ డి బ్లాసియో పేర్కొన్నారు. నగరంలో సెప్టెంబరు కల్లా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
న్యూయార్క్‌ రాష్ట్రంలో ఇప్పటివరకు 2.63 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా, అందులో సగానికిపైగా ఒక్క న్యూయార్క్‌ నగరంలోనివే.

చైనాకు నవంబరులోనే తెలుసేమో: పాంపియో
కరోనా వ్యాప్తిపై చైనా పారదర్శకంగా వ్యవహరించలేదంటూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో మరోసారి విమర్శలు గుప్పించారు. వాస్తవానికి గత ఏడాది నవంబరులోనే ఈ వైరస్‌ కేసుల గురించి చైనాకు తెలిసి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. అయినా ఆలస్యంగా సంబంధిత వివరాలను బయటపెట్టిందని ఆరోపించారు. కొవిడ్‌ గురించి చైనా నుంచి అమెరికాకు ఇంకా చాలా సమాచారం అందాల్సి ఉందని పాంపియో అన్నారు. వుహాన్‌లో వెలుగుచూసిన సార్స్‌-కొవ్‌-2 వైరస్‌ వాస్తవ నమూనా కూడా తమకు ఇంకా చేరలేదని తెలిపారు.

ఇస్తాంబుల్‌ను వుహాన్‌తో పోల్చిన టర్కీ మంత్రి
టర్కీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెత్తిన్‌ కొకా తమ దేశంలోని ఇస్తాంబుల్‌ నగరాన్ని కరోనా పుట్టుకకు కేంద్రమైన వుహాన్‌(చైనా)తో పోల్చారు. టర్కీలో ఇప్పటివరకు 1.04 లక్షల కేసులు నమోదయ్యాయి. దాదాపు 2,600 మంది మృతిచెందారు. వాటిలో అత్యధికం ఇస్తాంబుల్‌లోనివే.

ఆందోళన కలిగిస్తున్న ఆఫ్రికా
ఆఫ్రికా దేశాల్లో వైద్య సామగ్రి కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వాటిలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 25 వేలు దాటింది. వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగితే.. అధిక సంఖ్యలో బాధితులకు చికిత్స అందించేందుకు అవసరమైన సదుపాయాలు ఆ దేశాల్లో లేవని నిపుణులు చెబుతున్నారు. 10 దేశాల్లో ఒక్క వెంటిలేటర్‌ కూడా లేదని గుర్తుచేస్తున్నారు.

‘అలీబాబా’ కరోనా పరీక్షలు
చైనాలో దిగ్గజ ప్రైవేటు సంస్థలు అలీబాబా, జేడీ.కామ్‌, టెన్సెంట్‌ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరపనున్నాయి. ఇందుకోసం బుకింగ్‌ సేవలను ప్రారంభించాయి. మరోవైపు- చైనాలో శుక్రవారం కరోనా కొత్త కేసులు కేవలం ఆరు నమోదయ్యాయి. వుహాన్‌లోగానీ, హుబెయ్‌ ప్రావిన్సులోగానీ కొద్దిరోజులుగా ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదు.
* స్పెయిన్‌లో తాజాగా 24 గంటల్లో 367 మరణాలు నమోదయ్యాయి. గత నెల 22 తర్వాత ఆ దేశంలో 24 గంటల వ్యవధిలో మరణాల సంఖ్య ఇంత తక్కువగా నమోదవడం ఇదే తొలిసారి. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 22,524కు పెరిగింది.
* ఇటలీలో ఈ నెల్లో కొత్తగా నమోదైన కేసుల్లో కనీసం 44% నర్సింగ్‌ హోంలు, దీర్ఘకాలిక చికిత్సా కేంద్రాల్లో వెలుగుచూసినవేనని అధికారవర్గాలు వెల్లడించాయి.

Tags :

మరిన్ని