మేమిక్కడ..మనసక్కడ
close
మేమిక్కడ..మనసక్కడ

సహాయకేంద్రానికి వెల్లువెత్తుతున్న ప్రవాసుల వినతులు

ఇక్కడ చదువు కోసం వచ్చి చిక్కుకుపోయాం.. సదస్సుకు వచ్చి ఉండిపోయాం.. స్వరాష్ట్రానికి వచ్చే అవకాశం కల్పించండి.. అంటూ విదేశాలనుంచి తెలంగాణ ప్రవాస (ఎన్‌ఆర్‌ఐ) విభాగానికి (9440854433, 04023220603, (nri@telangana.gov.in) ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఈ విభాగానికి ప్రతి రోజూ 10 వరకు కాల్స్‌ రాగా.. కరోనా నేపథ్యంలో 100 నుంచి 150 మంది తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసులను ఆదుకునేందుకు ఈ కేంద్రం తన వంతు కృషి చేస్తోంది. తాజాగా కువైట్‌లో సికింద్రాబాద్‌ వాసి కృష్ణమూర్తి గుండెపోటుతో మరణించగా అతని కుటుంబ సభ్యులు ఈ విభాగాన్ని సంప్రదించారు. వీరి చొరవతో ప్రత్యేక కార్గో విమానం ఖతార్‌ నుంచి నగరానికి వచ్చింది.

ఎక్కువ మంది స్వదేశం రావాలని
స్వదేశానికి రావాలనే వినతులే ఎక్కువగా ఉంటున్నాయి. పర్యాటక వీసాల మీద అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, థాయ్‌లాండ్‌, జర్మనీ తదితర దేశాలకు వెళ్లిన వారు భారత్‌ రావడానికి సాయం కోరుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫిలిపీ్పన్స్‌ తదితర దేశాల్లో విద్యనభ్యసించేవారు స్వదేశం వస్తామని చెబుతున్నారు.

వసతులు, వైద్య సాయంపై..
విమానాలు లేక విదేశాల నుంచి రాలేకపోతున్నవారు తమకు స్థానికంగా ఉన్న వసతి, సదుపాయాల గురించి ఆరా తీస్తున్నారు. రాయబార కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాల్లోని ఇబ్బందులను తెలియజేస్తున్నారు. వివిధ కారణాలతో అనారోగ్యం పాలవుతున్న వారు వైద్యసాయం కోసం ఫోన్లు చేస్తున్నారు.మృతి చెందిన సందర్భాల్లో శవాలకు అంత్యక్రియలు, ఇతర సాయం అడుగుతున్నవారూ ఉంటున్నారు.
సౌదీ, యూఏఈ, మలేసియాలో తాము పనిచేసే సంస్థల నుంచి వేతనాల చెల్లింపులు నిలిచిపోయాయని కొందరు కార్మికులు ఫిర్యాదు చేశారు. అమెరికాలోని కొన్ని ఐటీ సంస్థలు వేతనాల చెల్లింపుల్లో జాప్యం చేస్తున్నాయని మరికొందరు చెప్పారు.
మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌ ద్వారా ప్రవాసుల నుంచి భారీ సంఖ్యలో వచ్చే వినతులను ఆయన కార్యాలయ అధికారులు పరిష్కారం కోసం ప్రవాస విభాగానికి పంపిస్తున్నారు.


రాయబార కార్యాలయాలకు సమాచారం
జీఏడీ విభాగాధికారి చిట్టిబాబు

వివిధ దేశాల నుంచి వస్తున్న వినతులు, ఫిర్యాదులను వెంటనే ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాలకు, భారత విదేశీ వ్యవహారాల శాఖకు పంపిస్తున్నాం. వైద్యపరమైన సాయం, శవాల తరలింపు వంటివి అత్యవసరంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. వీటికి ప్రభుత్వం విమానాలను అనుమతిస్తోంది. వేతనాల చెల్లింపు వంటి వాటిపైనా సత్వరమే స్పందిస్తున్నాం. విమానాల గురించే ఎక్కువ వినతులు వస్తున్నా.. రాకపోకలు మొదలయ్యే వరకు ఏమీ చేయలేమని సమాచారం ఇస్తున్నాం.


‘అమెరికాలో వైద్యసదస్సుకు హాజరయ్యేందుకు గత నెల 12న ఇక్కడికి వచ్చా. 22న తిరిగి భారత్‌కు రావాల్సి ఉంది. విమానాలు రద్దు కావడంతో ఇక్కడే ఉంటున్నా. మాకు ప్రత్యేక విమానయాన సదుపాయం కల్పించాలి’

- వైద్యనిపుణుడు చంద్రకాంత్‌రెడ్డి వేడుకోలు

‘అర్హత గల వీసాలున్నా అమెరికాకు వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయాం. దీంతో అక్కడ ఉద్యోగాలు కోల్పోతున్నాం. భార్యాభర్తలం దూరంగా ఉంటున్నాం. అక్కడికి వెళ్లేందుకు విమానం ఏర్పాటు చేయించాలి’

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ భాను అభ్యర్థన

- ఈనాడు, హైదరాబాద్‌
Tags :

మరిన్ని